Seemandhra Activists
-
సమైక్య సత్యాగ్రహం
సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రులు వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలు గురువారం 114వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ, విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గరువారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన సమైక్య సత్యాగ్రహం సభ విజయవంతమైంది. నగరంలోని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ప్రజలూ పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసోం గణపరిషత్ ఎంపీ జోసఫ్ టోపో, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న మైనార్టీ ప్రభుత్వాలకు రాష్ట్రాన్ని విభజించే అధికారం లేదన్నారు. డిసెంబర్‌లోపు 371డీని సవరించడం సాధ్యం కాదని, ఈ తరుణంలో ఉద్యమం ఉధృతంగా చేస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని పేర్కొన్నారు. విశాఖ జిల్లా న్యాయవాదులు కోర్టు ప్రాంగణం నుంచి మద్దిలపాలెం కూడలి వరకు బైక్‌ర్యాలీ తీసి అనంతరం రాస్తారోకో నిర్వహించారు. -
మోగుతూనే ఉన్న సమైక్య నగారా
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్రలో ఎగసిన జనోద్యమం వరుసగా 97వరోజైన సోమవారం నాడూ ఉధృతంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో న్యాయవాదులు సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను కొద్దిసేపు అడ్డుకున్నారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. విశాఖ జిల్లా చోడవరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో జెడ్పీ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కృష్ణాజిల్లా కలిదిండి సెంటరులో సమైక్యవాదులు దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఒంగోలులో విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న మందకృష్ణ సీమాంధ్రలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణుల అలుపెరుగని పోరు సమైక్యాంధ్రకు ఆది నుంచి కట్టుబడిన రాజకీయ పార్టీగా నిరశన దీక్షలు, విభిన్నరూపాల్లో ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు నిర్విరామపోరు సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ సోమవారం నాడూ సమైక్యఉద్యమాన్ని హోరెత్తించింది. సీమాంధ్ర జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. విశాఖ కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ నేత కోలా గురువులు ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రం విడిపోతే తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఎండుచేపలను సేవ్ ఏపీ ఆకారంలో ప్రదర్శిం చారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో రోడ్డుపై మోకాళ్లపై నిలబడి పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గుంటూరు నగరంలో పార్టీ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఇక గత నెల 2వతేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గకేంద్రాల్లో పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
చల్లారని ఉద్యమాగ్ని.. అలుపెరుగని సమైక్య పోరు
మూడు నెలలుగా అలుపెరుగని సమైక్య పోరు సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో ఎగసిన సమైక్యాంధ్ర ఉద్యమం నిరవధికంగా సాగుతోంది. వేర్పాటు ప్రకటన వెనక్కి వెళ్లేవరకూ పోరాటాన్ని ఆపేదిలేదంటూ తెగేసి చెబుతున్న సమైక్యవాదులు విభిన్న రూపాల్లో ఆందోళనలు హోరెత్తిస్తున్నారు. వరుసగా 90వ రోజైన సోమవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ ప్రదర్శనలు, విభజన యత్నాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు పోటెత్తాయి. తొంభై రోజుల ఉద్యమానికి సంకేతంగా చాలాచోట్ల విద్యార్థులు 90 అంకె ఆకారంలో ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై ధర్నా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్వోలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లెలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తిలో ఇంజినీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బి.కొత్తకోటలో విద్యార్థులు ర్యాలీ చేశారు. చిత్తూరు ఎన్జీవో హోం వద్ద ఎన్జీవోలు రిలే దీక్షలు ప్రారంభించారు. తిరుపతిలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతపురంలో యువ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్మించి సమైక్య నినాదాలు చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాస్కులు ధరించి.. రాజ్యాంగాన్ని పరిరక్షించండి అంటూ ప్రదర్శన నిర్వహించారు. పెనుకొండలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలుపగా.. విద్యార్థులు ర్యాలీ చేశారు. రాయదుర్గంలో విద్యార్థులు నిర్వహించిన ర్యాలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మద్దతు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థుల భారీ ర్యాలీ కడపలో ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏడురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో ఆర్టీసీ ఎన్ఎంయూ సభ్యులు దీక్ష చేపట్టారు. ఆంధ్రా యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. సమైక్యాంధ్ర కోసం ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకోగా లేనిది వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని నడిబొడ్డున సమైక్య శంఖారావం మోగిస్తే లగడపాటికొచ్చిన ఇబ్బందేమిటో చెప్పాలని విద్యార్థులు నినదించారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో పెన్షనర్లు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఎన్జీవోలు రిలే దీక్ష చేపట్టారు. తాడేపల్లిగూడెంలో న్యాయవాదులు రోడ్డుపై గుంజీలు తీసి నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్సీపీ అకుంఠిత దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ప్రతిచోటా పార్టీ కార్యకర్తలు, నేతలు రిలే దీక్షలు చేపడుతున్నారు. నేడు నాగార్జున వర్శిటీలో సమైక్య విద్యార్థి జేఏసీ సమావేశం సీమాంధ్ర ప్రాంతంలోని విశ్వవిద్యాలయాలు, వివిధ జిల్లాల సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకుల సమావేశం మంగళవారం గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతుందని సమైక్యాంధ్ర జేఏసీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో రూపొందిస్తామని ఆయన గుంటూరులో విలేకరులతో చెప్పారు. -
సీమాంధ్ర జిల్లాల్లో.. సమైక్య శపథం
సాక్షి నెట్వర్క్: సీమాంధ్ర జిల్లాల్లో ఇప్పుడు కోట్లాది గొంతుకలు ఒక్కటై మార్మోగిస్తున్న నినాదం సమైక్యాంధ్రప్రదేశ్. రాష్ట్రం ముక్కలు కాకుండా ఒక్కటిగానే ఉంచాలంటూ ప్రతిఒక్కరూ ఆశిస్తూ, స్వాశిస్తూ సమైక్యఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. వరుసగా 63వ రోజైన మంగళవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాలు ధర్నాలు, రాస్తారోకోలతో దద్దరిల్లాయి. సమ్మెబాట పట్టిన ఆర్ అండ్ బీ అధికారులు, ఇరిగేషన్ ఇంజనీర్లు విజయవాడలో వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ఒంగోలులో ఆటోలతో భారీర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో బ్రాహ్మణులు రాష్ట్ర విభజన జరగకూడదంటూ నడిరోడ్డుపై యజ్ఞయాగాదులు నిర్వహించారు. గుంటూరులో ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం ఎదుట అధ్యాపకులు నడిరోడ్డుపై నమూనా న్యాయస్థానం ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విభజన వాదులతో వాద ప్రతివాదాలు చేశారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు పట్టణంలో రజకులు ఒంటెద్దు బండ్లతో ర్యాలీ చేపట్టి చాకిరేవు నిర్వహించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్యమకారులు జోలెపట్టి భిక్షాటన చేశారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు కాకినాడ-పిఠాపురం రహదారిపై కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్, సోనియా, షిండే మాస్కలను గాడిదలకు కట్టి ఊరేగించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ- ఆంధ్రాకు అడ్డంగా గోడ కట్టి అనంతరం దాన్నిబద్దలు కొట్టి వినూత్న నిరసన తెలిపారు. విశాఖలోని ఆంధ్రాయూనివర్సిటీలో విద్యార్థులు సోనియా, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్ వరకు రెండు జిల్లాలను కలుపుతూ మహా మానవహారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో నీలమణి దుర్గమ్మ అమ్మవారికి వేలాది మంది మహిళలు ముర్రాటలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పూజలు చేశారు. రాజీనామా చేసి రండి అధికారపార్టీ నేతలు ఎక్కడ కనిపిస్తే అక్కడ సమైక్యవాదులు నిలదీస్తున్నారు. ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాలకు అనంతపురం జిల్లా గుంతకల్లులో సమైక్య సెగ తగిలింది. మునిసిపల్ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వారివురు దీక్షా శిబిరం వద్దకు వెళ్లగా జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముందు రాజీనామాలు చేసిన తరువాతే ఉద్యమంలో పాల్గొనాలని చెప్పారు. కేంద్రమంత్రి పనబాకలకిష్మని కృష్ణాజిల్లా గుడివాడలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. తామంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆమె చెప్పినా రాజీనామా చేయాలని పట్టుబట్టారు. పోలీసులు జోక్యంచేసుకుని ఆమెను అక్కడి నుంచి సురక్షితంగా పంపించివేశారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలోని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. ఆమె కార్యాలయంలో నుంచి బయటికొచ్చి, ప్రసుత తరుణంలో రాజీనామాలు అవసరంలేదని, తెలంగాణ బిల్లును అడ్డుకోవాలంటే పదవిలో ఉండాలని వివరించడంతో సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆమె తన క్యాంపు కార్యాలయంలోనికి వెళ్లిపోయారు. ఆగ్రహించిన ఆందోళనకారులు అక్కడే బైఠాయించి సుమారు మూడు గంటలసేపు నినాదాలు హోరెత్తించారు. పులికాట్ పొలికేక శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో పులికాట్ పొలికేక పేరుతో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు వేలాదిగా రైతులు తరలివచ్చారు. కోవూరులో చేపట్టిన రైతుగర్జనకు రైతులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రైతులు ఊక బస్తాలతోర్యాలీ చేసి, అనంతరం ఊకను రోడ్డుపై పోసి నిప్పంటించి నిరసన తెలిపారు. సర్పవరంలో ఐదువేల మందికి పైగా గ్రామస్తులు సకలజన ఘోష పేరిట సమైక్య నినాదం వినిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో రైతు రణభేరిపేరిట నిరసన తెలిపారు. నర్సాపురంలో భవన నిర్మాణ కార్మికులు సమైక్య గర్జన సభ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన సమైక్య ‘రణభేరి’కి సమైక్యవాదులు భారీగా తరలివచ్చారు. సభలో గజల్ శ్రీనివాస్ పాడిన గేయాలు సభికులకు ఉత్తేజాన్నిచ్చాయి. కార్మికులతో ఆర్టీసీ ఎండీ చర్చలు విఫలం బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపబోమన్న నేతలు తిరుపతి, న్యూస్‌లైన్ : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంగళవారం ఆర్ఎం కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణం గా సీమాంధ్రలో ఇప్పటికే సంస్థ రూ.630 కోట్లు నష్టపోయిందని ఖాన్ నతెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రానున్నారని, ప్రస్తుతం నడుస్తున్న 107 ఆర్టీసీ బస్సులకు అదనంగా 150 బస్సులు నƒ డపాలని సూచించారు. జీతాలకన్నా జీవితాలు ముఖ్యమని, సమ్మెలో సడలింపు ఉండదని కార్మిక నాయకులు తేల్చి చెప్పారు. ఈ నెల 5 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని, సమయం ఉంది కాబట్టి పునరాలోచించాలని చివరిగా ఖాన్ సూచించారు. దసరా అడ్వాన్సగా మూడు వేల రూపాయలు ఇప్పించాలని కార్మిక నేతలు కోరగా పరిశీలిస్తానన్నారు. అనంతరం ఆయన టీటీడీ ఈవోతో చర్చలు జరిపారు. కార్మిక నేతలతో మరోమారు చర్చలు జరుపుతామని తెలిపారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద రానున్న 120 కొత్త బస్సులను ఉపయోగించే అవకాశముందని పేర్కొన్నారు. -
ముక్కలు చేస్తే సహించం.. 57 రోజులుగా నిర్విరామ పోరు
సాక్షి నెట్వర్క్ : రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసేవరకూ ఉద్యమం ఆగేది లేదని సీమాంధ్ర ప్రజ తెగేసి చెబుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుజాతిని ముక్కలు చేస్తే సహించేది లేదని నినదిస్తోంది. వరుసగా 57వరోజూ బుధవారం సమైక్యవాదుల ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, వినూత్న ఆందోళనలతో కోస్తా, రాయలసీమ జిల్లాలు దద్దరిల్లాయి. విజయవాడలో విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణానదిలో పడవలపై నిరసన ప్రదర్శన చేశారు. సమైక్యాంధ్ర జెండాలు పట్టుకుని పడవలపై పున్నమిఘాట్ వద్ద నీటిలో నిరసన తెలిపారు. పామర్రులో జేఏసీ నాయకులు ఆకులను వస్త్రాలుగా చుట్టుకుని నిరసన తెలిపారు. మైలవరంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. గుంటూరులో ప్రైవేటు సిటీబస్సు ఆపరేటర్లు భారీ ప్రదర్శన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి సమైక్యాంధ్ర ఉద్యమంపై ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి శ్రీకాకుళం వరకు వాహనయాత్ర ప్రారంభించారు. యర్రగొండపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మహిళా టీచర్లు ఇంటింటికీ వెళ్లి ఉద్యమంలోకి రావాలని విజ్ఞప్తిచేశారు. విశాఖపట్నంలోని మద్దిపాలెం కూడలిలో జిల్లా స్కేటింగ్ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు స్కేటింగ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాణిజ్యపన్నుల శాఖ సిబ్బంది బీచ్‌రోడ్డులో సాయంత్రం కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు కేంద్రమంత్రుల దిష్టిబొమ్మల్ని దగ్ధం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ వద్ద మహిళా సంఘాలు బతుకమ్మ సంబరాలు నిర్వహించి తెలంగాణ సంప్రదాయాలను తాము గౌరవిస్తున్నామని చాటారు. గోపాలపురం వద్ద జాతీయ రహదారిపై గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమైక్య హోమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మహిళా కళాకారులు రిలే దీక్షలు ప్రారంభించారు. ఇరగవరంలో టీచర్లు కార్లు తుడిచి నిరసన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలో గిరిజన సంప్రదాయ నృత్యాలతో నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు ముళ్ళ కిరీటాలు ధరించి నిరసన తెలియజేశారు. విశాలాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో అత్తారింటికి దారేది సినిమా వాల్‌పోస్టర్లను దహనం చేశారు. వైద్య ఉద్యోగుల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. రాజంపేటలో ఆర్టీసీ కార్మికులు గడ్డితింటూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలో భిక్షాటన చేపట్టారు. తిరుపతిలో మున్సిపల్ ఉద్యోగులు చెవిలో కాలిఫ్లవర్ పెట్టుకుని నిరసన తెలిపారు. చిత్తూరులో పౌరసంబంధాలు, రిజిస్ట్రేషన్, మత్స్య, కార్మిక శాఖలకు చెందిన సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో ఉపాధ్యాయులు మోకాళ్లపై కుమారస్వామి తిప్పకొండకు (111 మెట్లు) ఎక్కి నిరసన తెలిపారు. సమాధులకు ఉపాధ్యాయుల మొర అనంతపురం జిల్లా రాయదుర్గంలో రాష్ట్ర విభజన వద్దంటూ శ్మశానంలోని సమాధులకు మొరపెట్టుకున్నారు. ఉరవకొండలో విద్యార్థులు రోడ్డుపై పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపారు. కర్నూలులో పంచాయతీరాజ్ ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకొని రోడ్లు ఊడ్చారు. ఆదోనిలో ఉపాధ్యాయులు ఒంటి నిండా ఆకులు కప్పుకొని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి సీఆర్ ఇంటికి టూలెట్ బోర్డు సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ జిల్లా కడపలో మంత్రి సి.రామచంద్రయ్య ఇంటిని ప్రైవేటు వృత్తి విద్య కళాశాలల సమాఖ్య ఆధ్వర్యంలో సమైక్యవాదులు, విద్యార్థులు ముట్టడించి టు లెట్ బోర్డును అతికించారు. మంత్రి తోట నరసింహం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మీదుగా గోకవరం వెళుతుండగా కోరుకొండలో జేఏసీ నాయకులు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలోనే మృతి నెల్లూరు: రాష్ట్ర విభజన చిచ్చు మరో రెండు నిం డు ప్రాణాల్ని బలిగొంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ స్క్వాడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సీహెచ్ సోమశేఖర్రాజు (55) సమైక్య దీక్షా శిబిరంలోనే ఛాతినొప్పితో కుప్పకూలి మృతిచెందారు. గూడూరులో నివాసం ఉండే ఆయన బుధవారం నెల్లూరుకు చేరుకుని స్థానిక బస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన దీక్షా శిబిరంలో కూర్చున్నారు. దినపత్రికలో సమైక్య ఉద్యమవార్తలు చదువుతూ తీవ్ర ఉద్వేగానికి గురై నేలకూలారు. వైద్యులు వచ్చేసరికే మృతిచెందారు. రాజుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజు సమ్మెకాలంలో గూడూరు నుంచి ప్రతిరోజూ నెల్లూరుకు వచ్చి ఉద్యమంలో పాల్గొనేవారని ఆర్టీసీ జేఏసీ నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. గుండెపోటుతో మరో ఉద్యోగి మృతి కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలోని మదిరె గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు త్యాగరాజు(55) బుధవారం విభజన కథనాలను టీవీలో వీక్షిస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుతో మరణించాడు. చిన్నారి ‘సమైక్య’ సీమాంధ్రవాసుల్లో సమైక్యాంధ్ర ఉద్యమ స్ఫూర్తి అణువణువునా నిండిందనడానికి నిదర్శనమిది. తమకు పుట్టిన ఆడపిల్లకు ‘సమైక్య’ అని పేరు పెట్టడం ద్వారా ఆ తల్లిదండ్రులు రాష్ట్రంగా ఒక్కటిగా ఉండాలన్న ఆకాంక్ష తమలో ఎంత ప్రబలంగా ఉందో చాటి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కుసుమ ప్రవీణ్ అల్లవరం మండల వ్యవసాయ విస్తరణాధికారిగా పని చేస్తున్నారు. ఆయన భార్య ఉమాదేవి ఈ నెల 22న ఆడపిల్లకు జన్మనిచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న తరుణంలో జన్మించిన తమ పాపకు ‘సమైక్య’ అని నామకరణం చేస్తున్నట్టు బుధవారం ఆ దంపతులు చెప్పారు. - న్యూస్‌లైన్, అల్లవరం -
నీలకంఠాపురంలో రఘువీరారెడ్డి ఇల్లు ముట్టడి
అనంతపురం: మంత్రి రఘువీరా రెడ్డికి సమైక్యాంధ్ర సెగ తగిలింది. నీలకంఠాపురంలోని ఆయన ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీల వైఖరికి నిరసనగా మడకశిరలో ఉపాధ్యాయులు చెవిలో పూలతో నిరసన తెలిపారు. మంత్రి రఘువీరా రెడ్డిని అడ్డుకునేందుకు మడకశిర నుంచి నీలకంఠాపురం వెళుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనగా సమైక్యవాదులు రోడ్డుపై బైఠాయించారు. దాంతో మడకశిరలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
సమైక్యాంధ్రకు వైఎస్ఆర్సిపి మద్దతు