సమైక్య సత్యాగ్రహం
సాక్షి, నెట్‌వర్క్ : రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీమాంధ్రులు వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలు గురువారం 114వ రోజుకు చేరుకున్నాయి. కర్నూలు జిల్లా సమైక్యాంధ్ర జేఏసీ, విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో గరువారం కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన సమైక్య సత్యాగ్రహం సభ విజయవంతమైంది.
నగరంలోని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ప్రజలూ పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అసోం గణపరిషత్ ఎంపీ జోసఫ్ టోపో, సమతాపార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వీవీ కృష్ణారావు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న మైనార్టీ ప్రభుత్వాలకు రాష్ట్రాన్ని విభజించే అధికారం లేదన్నారు. డిసెంబర్‌లోపు 371డీని సవరించడం సాధ్యం కాదని, ఈ తరుణంలో ఉద్యమం ఉధృతంగా చేస్తే విభజన ప్రక్రియ ఆగుతుందని పేర్కొన్నారు. విశాఖ జిల్లా న్యాయవాదులు కోర్టు ప్రాంగణం నుంచి మద్దిలపాలెం కూడలి వరకు బైక్‌ర్యాలీ తీసి అనంతరం రాస్తారోకో నిర్వహించారు.