జేఏసీ నేతలు బాబును నిలదీయాలి : భూమా నాగిరెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం జీతాలు రాకపోయినా ఉద్యోగులు అర్ధాకలితో పోరాటాలు సాగిస్తున్నారని, రాష్ట్రస్థాయిలోని నాయకులు మాత్రం ప్రకటనలకు పరిమితమవుతున్నారని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మూడు రోజుల నుంచి జేఏసీ నాయకుల నిర్లిప్తతను ఎండగడుతున్నట్లు భూమా తెలిపారు. ఇప్పటికైనా జేఏసీ నాయకులు తమ ఉనికిని కోల్పోకుండా ఉండాలని, వారి ఉద్యమంపై అనుమానాలు రాకుండా ఉండాలంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీయాలన్నారు. వారికి అండగా తాము ఉంటామని లేని పక్షంలో తామే ఆ బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుందని హెచ్చరించారు.