సీమాంధ్రలో 40వ రోజుకు సమైక్యాంధ్ర ఉద్యమం!
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతునే ఉన్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళలు ఆదివారానికి 40వ రోజుకు చేరుకున్నాయి.
సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమానికి వివిధ సంస్థలు, నేతలు, విద్యార్థులు రాస్తారోకోలతోపాటు, మానవహారాలు నిర్మిస్తూ 13 జిల్లాలో నిరసన తెలుపుతున్నారు. ఉద్యమం ప్రారంభించి.. నెలరోజులు పూర్తవుతున్నా..ఉద్యమ ప్రభావం తగ్గకపోగా.. మరింత ఉధృతమవుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి, ఇతర జిల్లాలో ర్యాలీలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి.
ఆదివారం రోజున గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున్న మానవహారాన్ని నిర్మించారు. విజయనగరంలో పలు పార్టీలకు చెందిన నేతలు రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇతర జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలతో రోడ్లపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ-రాజమండ్రి రహదారిపై మహిళలు రాస్తారోకో కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లో శనివారం నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో పాల్గొన్న ఎపీఎన్జీఓ ఉద్యోగులపై జరిపిన దాడులపై నిరసన వ్యక్తం చేశారు.