కేబినేట్ నోట్ ను ఎలా ప్రవేశపెడుతారు: లగడపాటి
ఉద్యోగులు సభ పెట్టుకుంటే బెదిరిపోయే వాళ్లు ఉద్యమాలు ఏం చేస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎద్దేవా చేశారు.
హైదరాబాద్:
ఉద్యోగులు సభ పెట్టుకుంటే బెదిరిపోయే వాళ్లు ఉద్యమాలు ఏం చేస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించిన లగడపాటి.. టీఆర్ఎస్ నేతలు, జేఏసీ నేతలపై నిప్పులు చెరిగారు. పలు ఆంక్షలు పెట్టినా.. అడ్డుకున్నా ఎపీఎన్జీఓల సభ విజయవంతమైంది అని ఆయన అన్నారు. సభ ద్వారా సమైక్యవాదం వినిపిస్తారనే భయం టీఆర్ఎస్ నేతల్లో నెలకొని ఉందని అన్నారు.
సభ పెట్టుకున్న ఎపీఎన్జీఓలకు పూలు పండ్లు ఇస్తానన్నవారు.. తిరిగి వెళ్తున్నవారిపై దాడుల చేయడం సమంజసమా లగడపాటి అని ప్రశ్నించారు. విభజన ప్రక్రియ పూర్తికాకుండా కేబినేట్ నోట్ ను ఎలా ప్రవేశపెడుతారని అన్నారు. ఏపీఎన్జీఓల సభను ఆసరా చేసుకుని కొంతమంది విద్వేషాలు రగిల్చేందుకు ప్రయత్నించారు. అయినా ఏపీఎన్జీఓలు సోదరభావంతో శాంతియుతంగా సభను నిర్వహించారు.
ఏపీఎన్జీఓలు సభ పెట్టిన రోజే శాంతి ర్యాలీ, బంద్ లు ప్రకటించడం కోదండరాం సంకుచితభావానికి నిదర్శనమని లగడపాటి అన్నారు. నిజాం కాలేజిలో టీఆర్ఎస్సీవీ నాయకులకు ఏమి పని అని ఆయన నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. సమైక్యవాదులకు 240పైగా సీట్లు వస్తాయన్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్ల తీర్చినట్టు హైదరాబాద్ ను కేంద్రం తన్నుకుపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.