మాకొద్దీ సైకిల్ | we dont need cycle | Sakshi
Sakshi News home page

మాకొద్దీ సైకిల్

Published Mon, Oct 14 2013 3:18 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

we dont need cycle

 రాష్ట్ర విభజన అంశం.. సమైక్యాంధ్ర ఉద్యమం తెలుగుదేశం పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది. పదేళ్లుగా అధికారం లేకపోవడం.. అధినేత రెండు కళ్ల సిద్ధాంతంతో సైకిల్ చతికిలపడింది. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరిట దేశ, రాష్ట్ర రాజకీయాల తలరాతలనే మార్చే స్థాయికి ఎదిగిన ‘అన్న’ ఆశయాలను గంగలో కలిపేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ్ముళ్ల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. జిల్లా రాజకీయాల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. సైకిల్ ఎక్కే వారు కరువై రానున్న ఎన్నికల్లో వలస పక్షులపైనే ఆధారపడాల్సి రావడం పార్టీ దయనీయ స్థితికి నిదర్శనం.
 
 సాక్షి, కర్నూలు:
 టీడీపీ కోట బీటలువారుతోంది. అధికారంలో ఉండగా ముగ్గురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలతో అలరారిన పార్టీ ఒక్కసారిగా నేలవాలింది. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభంజనం ముందు కోలుకోలేని విధంగా ఓటమి చవిచూసింది. 2009లోనూ అదే పరిస్థితి ఎదురవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. జిల్లాలో 14 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకం కాగా.. కేవలం ఒక్క కుటుంబం చుట్టూ భవిష్యత్తు చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు ఆ నియోజకవర్గాల్లో తిరుగులేదనిపించినా.. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఇన్‌చార్జీలకూ దిక్కులేని పరిస్థితి. పార్టీ సీనియర్ నేత బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి దూరమవడంతో నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం ఏర్పడింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు ఆ పార్టీ ప్రతిష్ట ఏ స్థాయిలో దిగజారిందో చెప్పకనే చెబుతోంది. అదేవిధంగా మంత్రాలయంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలనాగిరెడ్డి పార్టీని వీడటంతో ఆ నియోజకవర్గంలో పార్టీ కనుమరుగైంది. కనీసం జెండా మోసే వారు లేకపోవడంతో ఎన్నికల్లో పోటీకి ఏ ఒక్కరూ ముందుకు రాలేకపోతున్నారు.
 
  కోట్ల కుటుంబానికి కంచుకోటగా ఉన్న కోడుమూరులో గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులపై పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో మణిగాంధీ టీడీపీ తరఫున బరిలో నిలిచి గట్టి పోటీనిచ్చారు. అయితే అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఆయనా పార్టీని వీడి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసే నాథుడే కరువయ్యాడు. ఆలూరులో నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ ఎంపీపీ వైకుంఠం శివప్రసాద్‌ను నియమించినా కోలుకోలేకపోతోంది. ఫ్యాక్షన్ ప్రభావంతో ఆయన ఎక్కడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి ఉండటంతో తమ్ముళ్లు దిక్కులేని వారయ్యారు. ఇక జిల్లా కేంద్రమైన కర్నూలులో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రతిసారీ మిత్రపక్షాల ఒప్పందంలో సీపీఎంకి ఆ సీటు దక్కడంతో పార్టీ ఉన్నా లేనట్లేననే భావన నెలకొంది. మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి పార్టీలో చేరినా ఆయనకు వ్యతిరేకత ఉండటంతో శ్రేణులు రెండుగా చీలిపోయారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు చౌదరి చేస్తున్న ప్రయత్నాలకు మరో వర్గం ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూనే ఉంది.
 
  గత ఎన్నికల్లో పోటీ పడి నంద్యాలలో ఓటమి పాలైన ఎన్.హెచ్. భాస్కర్ రెడ్డిని తప్పించి మాజీ మంత్రి ఫరూక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో అక్కడ అసమ్మతి రాగం వినిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బి.వి.మోహన్‌రెడ్డి మరణంతో ఎమ్మిగనూరులో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. ఆయన కుమారుడు జయనాగేశ్వరరెడ్డి పార్టీ బాధ్యతలు చూస్తున్నా ప్రత్యర్థి నేతలతో ఢీకొనే శక్తి లేకపోవడం.. తమ్ముళ్లకు అండగా నిలవకపోవడం పార్టీని నష్టపరుస్తోంది. ఆళ్లగడ్డలో ఇరిగెల ఉన్నా ఆయనకు ఓటమితోనే పరిచయం ఎక్కువ. బనగానపల్లె, శ్రీశైలంలో ఎర్రబోతుల వెంకటరెడ్డి, బుడ్డా కుటుంబీకులు టీడీపీ వీడటంతో పార్టీ దిక్కులేనిదైంది. వలస వచ్చిన బి.సి.జనార్దన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డిలతో కాలం గడుపుతున్నారు. ఆదోనిలో ఆ పార్టీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనివ్వరనే అపవాదును మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితి అంతర్గత కుమ్ములాటలకు తావిస్తోంది. పత్తికొండ, డోన్‌లలో ఎమ్మెల్యేలుగా ఉన్న కేఈ సోదరులు ఇటు పార్టీకి, అటు పదవులకు అంతా తామేనన్నట్లు వ్యవహరిస్తుండటంతో మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ ఎదుగుదల మందగించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 పార్లమెంట్ నియోజకవర్గాలోనూ అదే పరిస్థితి
 జిల్లాలోని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలలోనూ సైకిల్ పంక్చరైంది. గతంలో కర్నూలు నుంచి పోటీ చేసిన బీటీ నాయుడు ఇక గెలవలేననే భావనతో మంత్రాలయం అసెంబ్లీ నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను పత్తికొండను వదిలేసి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని కేఈ ప్రభాకర్ బాహాటంగానే ప్రకటించారు. దీంతో పార్టీలో కలకలం రేగింది. నంద్యాల పార్లమెంట్‌లో టీడీపీకి అభ్యర్థి దొరకని పరిస్థితి. ఫరూక్ కూడా అసెంబ్లీ వైపు మొగ్గు చూపడంతో ఎంపీగా ఆ పార్టీ తరఫున పోటీ చేసే వారే కరువయ్యారు.
 
 వలస పక్షులపైనే ఆశలు
 రోజు రోజుకూ ప్రశ్నార్థకంగా మారుతున్న టీడీపీకి వలస పక్షులే దిక్కయ్యారు. నంద్యాల ఎంపీ స్థానానికి కాంగ్రెస్ నుంచి గంగులను రప్పించుకోవాలని ఆ పార్టీ అధినేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ముణిగాంధీ పార్టీ వీడాక కోడుమూరుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న మురళీకృష్ణ వస్తే మెరుగుపడుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక కర్నూలు పార్లమెంట్‌కు మంత్రి టీజీ వెంటకటేష్ వస్తారని టీడీపీ వర్గీయుల్లో విస్తృత ప్రచారం సాగుతోంది. వలస పక్షుల రాకతోనైనా సైకిల్‌కు పట్టిన తుప్పు వదులుతుందేమోనని తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement