సాక్షి, విజయవాడ :
రాష్ట్ర విభజనకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో జిల్లాలోని తెలుగుదేశంనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రజల వద్దకు ఎలా వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. తమ అధినేత చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతమే ఈ విభజనకు ప్రధాన కారణమైందంటూ ప్రజలు ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. 2009 సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ, ఇటీవల పోరాటంలోనూ తమ వంతు పాత్ర పోషించినప్పటికీ, చంద్రబాబు ద్వంద్వ వైఖరి వల్ల తీవ్ర నష్టం జరిగినట్లు వారు తలలు పట్టుకుంటున్నారు.
గెలుస్తామో లేదో అన్న ఆందోళన
చంద్రబాబు జిల్లాలో పాదయాత్ర, బస్సు యాత్రల్లో కేవలం సోనియా, జగన్‌మోహన్‌రెడ్డిలపై ఆరోపణలకే ప్రాధాన్యత ఇచ్చేరే తప్ప సమైక్యాంధ్ర ఊసెత్తలేదని, దీనిపై జనం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయని వారు గుర్తుచేసుకుంటున్నారు. విభజన ఖరారైన నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లడం ఎలా.. రానున్న ఎన్నికల్లో ఏం చేయాలని ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. గత ఎన్నికల్లో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న తమ పార్టీ ఈసారి ఒకటి రెండో సరిపెట్టుకోవాల్సిన దుస్థితిని చేజేతులారా తెచ్చుకున్నట్లయిందని వారు వాపోతున్నారు. ఎన్నికలు కూడా త్వరలోనే రానున్న పరిస్థితుల్లో ప్రజాగ్రహానికి తమ రాజకీయ భవితవ్యం బలికాక తప్పదని వారు ఆవేదన చెందుతున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా చంద్రబాబు ఒక్క మాట చెప్పినా నేడు తమకు ఈ ఇబ్బందికర పరిస్థితి దాపురించేది కాదని వారు మధనపడుతున్నారు.
పనికి రాని బీజేపీ స్నేహం
కమల దళంతో చంద్రబాబు దోస్తీ తమకు ఎన్నికల్లో లాభిస్తుందని ఇప్పటి వరకూ భావించిన ఆ పార్టీ నేతలు మంగళవారం లోక్‌సభలో బీజేపీ వైఖరితో కంగుతిన్నారు. బీజేపీ ద్వారా బిల్లును అడ్డుకుని సీమాంధ్రలో ఆ క్రెడిట్ కొట్టేయాలని భావించిన ఆ పార్టీ నేతలకు ఊహించని ఎదురుదెబ్బతగిలినట్లయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని సీట్లు కూడా వదులుకునేందుకు స్థానిక నేతలు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ కలవడం వల్ల తమకు నష్టమే తప్ప ఒరిగిందేమీ లేదని తెలుగుతమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును సంప్రదించకుండానే సీమాంధ్ర బంద్ కూడా చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజా పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామాల పరంపర కొనసాగుతున్నాయి. వీరిలో కొందరు టీడీపీలోకి దూకేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వీరి రాకను జిల్లా, అర్బన్ నేతలు ఏ దశలోనే ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు. ఇప్పటి వరకు తాము జెండాలు మోస్తే ఇప్పుడు కాంగ్రెస్ నేతలు వచ్చి పల్లకి ఎక్కుతారా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ నేతల్ని ఆహ్వానించడమంటే జిల్లాలో పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టడమే అవుతుందనే భావనను పలువురు టీడీపీ నేతలు వ్యక్తంచేస్తున్నారు.
భవిత బలే!
Published Wed, Feb 19 2014 5:42 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM
Advertisement