రాష్ట్ర విభజన విషయంలో తన వంతు పాత్ర పోషిస్తున్న టీడీపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆ పార్టీ నాయకులు నియోజకవర్గాల్లో తిరిగేందుకూ జంకుతున్నారు.
బాబు ముఖ్యమంత్రి అయ్యాక మాఫీ
జోరుగా కరపత్రాల పంపిణీ
రైతులు, పొదుపు మహిళలకు గాలం
పార్టీ కార్యకర్తలకు రహస్య శిక్షణ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర విభజన విషయంలో తన వంతు పాత్ర పోషిస్తున్న టీడీపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఆ పార్టీ నాయకులు నియోజకవర్గాల్లో తిరిగేందుకూ జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు తటపటాయిస్తున్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నోట ‘మాఫీ’ మాట మారుమ్రోగుతోంది.
ఆయన చూపిన బాటలోనే తమ్ముళ్లు కూడా అదే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ‘‘రైతులు, పొదుపు మహిళలు రుణాలను తిరిగి చెల్లించొద్దు. రానున్నది చంద్రబాబు ప్రభుత్వం. ఆ తర్వాత వీటన్నింటినీ మాఫీ చేసి కొత్త రుణాలిస్తాం.’’ అంటూ ఏకంగా కరపత్రాలు ముద్రించి సరికొత్త ప్రచారానికి తెరతీశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక మునుపే టీడీపీ శ్రేణుల సొంత డబ్బా ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది.
ఈ పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను చెల్లించాలా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. జిల్లాలో గుట్టుగా సాగుతున్న ఈ తరహా ప్రచారం సోమవారం ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని చాగలమర్రి, గొడిగనూరు, ముత్యాలపాడు గ్రామాల్లో వెలుగుచూసింది. ఈ కరపత్రాల గుట్టుపై వివిధ బ్యాంకుల అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలాఉండగా పార్టీ నాయకులు ప్రజలనే కాదు.. కార్యకర్తలనూ బోల్తా కొట్టించే పనిలో తలమునకలవుతున్నారు. పార్టీపై నమ్మకం లేకపోవడంతో ఇప్పటికే చాలా మంది తమ్ముళ్లు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
వీరిని తిరిగి ఆకర్షించేందుకు శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా జిల్లాలో కార్యకర్తలు, నాయకులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ ముద్రించిన కరపత్రాలను వీరి చేతిలో పెట్టి హామీలకు విస్తృత ప్రచారం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ‘చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేకపోయారు.. ఇప్పుడు కొత్త హామీలతో ప్రజలను ఎలా నమ్మించగలం’ అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తుండటంతో నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.