రుణమాఫీ సమస్యల పరిష్కార వేదికకు రెండోరోజైన మంగళవారం భారీసంఖ్యలో తరలివచ్చిన రైతులు
‘రుణమాఫీ ఫిర్యాదులు కర్నూలు జిల్లాలో తక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ జిల్లాలో రుణమాఫీ బాగానే జరిగిందనే విషయం స్పష్టమవుతోంది.’ – ఇవీ సోమవారం రుణమాఫీ ఫిర్యాదుల పరిష్కార వేదిక ప్రారంభం సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఆయన అంచనా తప్పని ఒక్కరోజులోనే తేలిపోయింది. తమకు రుణాలు మాఫీ కాలేదని, ఎందరు అధికారులను కలిసినా, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేదని ఫిర్యాదు చేయడానికి వేలాదిమంది రైతులు తరలివచ్చారు.
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని పంచాయతీ వనరుల కేంద్రంలో రెండోరోజైన మంగళవారం కూడా రుణమాఫీపై ఫిర్యాదుల స్వీకరణ కొనసాగింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన రైతులతో జెడ్పీ ప్రాంగణం కిటకిటలాడింది. రెండో రోజు దాదాపు ఆరు వేల మంది రైతులు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చారంటే జిల్లాలో రుణమాఫీ ఏ రీతిలో అమలైందో అర్థం చేసుకోవచ్చు. రైతు సాధికార సంస్థ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల ద్వారా ఫిర్యాదులను పరిశీలించేందుకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయంతో 15 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద రైతులు బారులుతీరారు. అర్ధరాత్రి వరకు ఫిర్యాదుల పరిశీలన కొనసాగింది.
ఒక్కో రైతుది ఒక్కో వేదన..
పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే ఒక్కో రైతుది ఒక్కో వేదనగా ఉంది. రుణమాఫీకి అన్ని అర్హతలున్నా ఒక్కరూపాయి కూడా మాఫీ కాని రైతులు 50 శాతం మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిలో బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ కాని వారు, మొదటి విడత రైతులకు మాత్రమే నిధులు జమ అయ్యి.. రెండు, మూడు విడతలు రానివారు ఉన్నారు. మాఫీ నిధులు వడ్డీలకు కూడా సరిపోలేదని రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండు, మూడు విడతల మాఫీ నిధులను సంబంధిత బ్యాంకులకు విడుదల చేశామని, వెళ్లి బ్యాంకులో కలవాలంటూ అధికారులు పాత పాటే పాడారు. పరిష్కార వేదిక పేరిట హడావుడి తప్ప పెద్దగా ప్రయోజనం లేదనే విమర్శలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు రైతుల కోసం ఏదో చేస్తున్నారే అభిప్రాయాన్ని ఏర్పరచుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా దుయ్యబట్టారు.
బంగారంపై తీసుకున్న రుణం మాఫీ కాలేదు
బంగారంపై రూ.78 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. కానీ మాఫీ కాలేదు. అర్హత ఉన్నందున మాఫీ కోసం చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఫిర్యాదు చేశా. యథావిధిగా ఎన్‌ఐసీ పోర్టల్‌లో వివరాలు లేవు. బ్యాంకుకు వెళ్లమని కాగితం చేతిలో పెట్టారు. – బి.గిరప్ప, చాగి, ఆదోని మండలం
Comments
Please login to add a commentAdd a comment