సీఐ వద్ద మొరపెట్టుకుంటున్న రైతులు, రోడ్డుపై బైఠాయించిన అన్నదాతలు
బనగానపల్లెరూరల్: ధాన్యం కొనుగోలు చేసి పరారైన వ్యాపారులను అదుపులోకి తీసుకుని డబ్బు లు ఇప్పించి న్యాయం చేయాలని నందవరం గ్రామ రైతులు కోరారు. లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులను అదుపులోకి తీసుకుని డబ్బులు ఇప్పిం చాలని కోరుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన 80 మంది రైతులు శుక్రవారం స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. రైతుల వివరాల మేరకు.. గడివేముల మండలానికి చెందిన జాకీర్ ఉశేన్, నందవరానికి చెందిన నుశి చిన్నవెంకటసుబ్బారెడ్డి 80 మంది రైతుల నుంచి రూ. 1.20 కోట్ల విలువైన వడ్లు, జొన్నలు, శనగలు కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా పరారయ్యారు. వారి నుంచి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధిత రైతులు నందివర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి 53 రోజులైనా పోలీసులు చర్యలు తీసుకోలేదు.
దీంతో బాధిత రైతులు రైతు రక్షణ కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రోడ్డెక్కారు. నందివర్గం ఎస్‌ఐ శంకరయ్య నచ్చజెప్పినా రైతులు వినకపోవడంతో పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి అక్కడకు చేరుకున్నారు. వ్యాపారి నుశి వెంకటసుబ్బారెడ్డి ప్రతిరోజు వారి బంధువులతో ఫోన్‌లో మాట్లాడుతున్నారని, అయినా ఆయన ఎక్కడున్నది పోలీసులు తెలుసుకోవడం లేదని రైతులు సీఐతో వాగ్వాదానికి దిగారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సీఐ హామీ మేరకు రైతులు శాంతించారు. ఆందోళనలో రైతు రక్షణ కమిటీ రాష్ట్ర సలహాదారుడు సుధాకర్‌రెడ్డి, అధ్యక్షులు శేషారెడ్డి, ఉపా«ధ్యక్షులు మహమ్మద్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి ఎర్రన్నగారి శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, ఆదిశేషు, వుశేన్ వలి, నాగశేషుడు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment