రైతురథం కింద ట్రాక్టర్లు తీసుకునే రైతులు వాటిని ఆరేళ్ల పాటు అమ్మరాదు. ఈ మేరకు అఫిడవిట్ కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ కొందరు తీసుకున్న వెంటనే అమ్మేశారు. దేవనకొండ మండలం కుంకనూరు గ్రామానికి చెందిన ఒక రైతుకు ఐదెకరాల మెట్టభూమి ఉంది. ఇతనికి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సిఫారసు మేరకు ఇటీవలనే ట్రాక్టర్ ఇచ్చారు. అయితే.. నెల రోజులకే రూ.75 వేలు తీసుకొని ట్రాక్టరు, దానికి సంబంధించిన అప్పును ఇతరులకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టే రైతురథం పథకం ఎలా దుర్వినియోగమవుతుందో అర్థం చేసుకోవచ్చు.
కర్నూలు(అగ్రికల్చర్): రైతురథం పథకం ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్నప్పటికీ పక్కా టీడీపీ కార్యక్రమంగా మార్చేశారు. దీని కింద ట్రాక్టర్లన్నీ అధికార పార్టీ వారికే కేటాయించారు. వీటిని కొందరు నేతలు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఒక్కో దానికి రూ.25 వేల ప్రకారం వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. అనర్హులకు ట్రాక్టర్లు ఇస్తుండటంతో అవి నెల రోజులకే ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. రైతురథం కింద జిల్లాకు మొదట 858 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. అయితే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌లు వ్యవసాయ మంత్రి ద్వారా మరో 310 తెచ్చుకున్నారు. మొత్తంగా జిల్లాకు 1,168 ట్రాక్టర్లు వచ్చాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన 13 నియోజకవర్గాలకు వీటిని కేటాయించారు. ఈ ట్రాక్టర్లను అధికార పార్టీ నేతలు తమ బంధువులు, టీడీపీ కార్యకర్తలకే ఇస్తున్నారు.
సిఫారసు ఉంటేనే దరఖాస్తు పరిశీలన
2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్లకు రూ.1.50 లక్షలు, 4వీల్ డ్రైవ్ ట్రాక్టర్లకు రూ.2 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. వీటి కోసం రైతులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను వ్యవసాయాధికారులకు పంపాల్సి ఉంటుంది. అయితే.. అధికారులు ముందుగా అధికార పార్టీ నేతల సిఫారసు లేఖ ఉందా, లేదా అని చూస్తున్నారు. సిఫారసు లేఖ లేకపోతే ఎంత అభ్యుదయ రైతు దరఖాస్తు అయినప్పటికీ దాన్ని తిరస్కరిస్తున్నారు. ఒక రైతుకు ట్రాక్టరు ఇవ్వాలంటే ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదం కూడా తప్పనిసరి అవుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 2,200కు పైగా దరఖాస్తులు వచ్చాయి. అధికార పార్టీ నేతల సిఫారసు లేదన్న సాకుతో దాదాపు వెయ్యి దరఖాస్తులను పక్కన పడేశారు. ఇన్‌చార్జ్ మంత్రి ఆమోదం మేరకు 1,073 ట్రాక్టర్లకు ప్రొసీడింగ్ ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు 719 ట్రాక్టర్లకు రైతులు నాన్ సబ్సిడీ మొత్తం చెల్లించారు. అత్యధికంగా 2 వీల్ డ్రైవ్ ట్రాక్టర్లను, మరికొందరు రైతులు రోటోవేటర్‌తో కలిపి తీసుకుంటున్నారు. మొత్తమ్మీద రూ.18.25 కోట్ల సబ్సిడీ ఇస్తుండగా.. ఇదంతా టీడీపీ వారికే దక్కుతోంది.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు 7 ట్రాక్టర్లు
మాత్రమే.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. టీడీపీ ఎమ్మెల్యేలు, చివరకు ఆ పార్టీ ఇన్‌చార్జ్‌లకు పెద్దసంఖ్యలో ట్రాక్టర్లను కేటాయించిన ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మాత్రం కేవలం ఏడు ట్రాక్టర్లు ఇచ్చింది. అవి కూడా కలెక్టర్ రిజర్వు కోటా నుంచి ఇచ్చినవే. ట్రాక్టర్ల కేటాయింపులో సర్కారు వివక్ష చూపడాన్ని రైతులు తప్పుబడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ అర్హులైన రైతులు ఉంటారని, వారి కోణంలో చూడకుండా రాజకీయ కక్ష సాధింపునకు వేదికగా మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎంపీ బుట్టా రేణుకకు 25 ట్రాక్టర్లు ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment