నాకు కమీషన్ ఇవ్వకపోతే పనులు చేయలేరు జాగ్రత్త!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం అటు అధికారులకు, ఇటు కాంట్రాక్టర్లకు ఇబ్బందికరంగా మారింది. కాంట్రాక్టు పనుల్లో తన కమీషన్‌తో పాటు అధికారుల వాటా తనకే ఇవ్వాలంటూ కాంట్రాక్టర్లకు తెగేసి చెబుతున్నారు. తనకు కమీషన్లు ఇవ్వకపోతే పనులు మొదలుపెట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైనా టెండర్‌లో పనులు దక్కించుకుంటే.. సదరు కాంట్రాక్టర్ తనను కలిసేదాకా పనులు మొదలుపెట్టకుండా చూడాలని అధికారులకు సైతం హుకుం జారీచేస్తున్నారు. ఫలితంగా అటు కాంట్రాక్టర్లు, ఇటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సదరు ఎమ్మెల్యేకు దగ్గరగా ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం కమీషన్ ఇచ్చామనే ధైర్యంతో పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు.
వారిని అధికారులు సైతం ఏమీ అనలేని పరిస్థితి. టెండర్ దక్కించుకున్న ‘సాధారణ’ కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడదామనుకుంటే.. ఎమ్మెల్యేను కలిసిన తర్వాతే ముందుకు సాగాలని నేరుగా అధికారులే చెబుతుండడంతో ఏమి చేయాలో వారికి పాలుపోవడం లేదు. సదరు ఎమ్మెల్యేను కలిస్తే.. అధికారుల వాటా కూడా కలిపి మొత్తం తనకే ఇవ్వాలని తేల్చిచెబుతుండడంతో కాంట్రాక్టర్లు నోరెళ్లబెడుతున్నారు. ఒకవేళ ఇచ్చేందుకు నిరాకరిస్తే నెలల తరబడి పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కాంట్రాక్టర్లతో పాటు అధికారులు వాపోతున్నారు.
కక్కలేక..మింగలేక..
వాస్తవానికి ప్రభుత్వ శాఖలో ఏ పని చేయాలన్నా అధికారులకు అంతో ఇంతో కమీషన్ ఇచ్చుకోవడం రివాజుగా మారింది. ఇక అధికార పార్టీ నేతలకు కమీషన్ల వ్యవహారానికి వస్తే స్థానిక నేత వ్యవహారశైలిని బట్టి ఉంటుంది. అయితే, జిల్లాలో మాత్రం ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటోంది. ఏ పనికి టెండర్ పిలిచినా.. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఆయన్ను కలిసిన తర్వాతే ముందుకు వెళ్లే పరిస్థితి. గతంలో కర్నూలు సర్వజన ఆసుపత్రిలో అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆయన్ను కలిసి.. ఆయన చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే ముందుకు వెళ్లారు. రోడ్డు పనులతో పాటు వివిధ బిల్డింగ్‌ల నిర్మాణం విషయంలోనూ ఇదే పరిస్థితి. మునిసిపాలిటీలో చేపడుతున్న కాంట్రాక్టు పనులు కూడా ఇతరులకు ఎవ్వరికీ దక్కకుండా చేస్తున్నారు. ఒకవేళ ఇతరులకు దక్కినా.. సబ్ కాంట్రాక్టు కింద తాము చెప్పిన వారికే ఇవ్వాలని అంటున్నారని తెలుస్తోంది. పైగా సదరు సబ్ కాంట్రాక్టర్ల నుంచి ముందుగానే కమీషన్లు దండుకుంటున్నట్టు సమాచారం. వారు ఎటువంటి నాణ్యత లేకుండా పనిచేసినప్పటికీ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించాల్సి వస్తోంది.
అటువైపు వెళితే ఒట్టు!
అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసుతో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కనీస నాణ్యత లేకుండానే పనులు కానిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు కనీసం అటువైపుగా చూడడం లేదు. వాస్తవానికి అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వెళ్లి.. టెండర్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా, లేదా అనేది చూడాలి. ఒకవేళ నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే నోటీసు జారీచేయాలి. అయితే, సదరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో జరుగుతున్న ఏ పనులనూ అధికారులు పరిశీలించే సాహసం చేయడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment