‘పెద్దన్న’పక్కచూపులు | TDP MLAs thinking to change their assembly location | Sakshi
Sakshi News home page

‘పెద్దన్న’పక్కచూపులు

Published Thu, Nov 14 2013 12:41 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

TDP MLAs thinking to change their assembly location

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’ తయారైంది జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి. వారి పార్టీ అధినేత చంద్రబాబునాయుడి ఊగిసలాట ధోరణి, రెండుకళ్ల సిద్ధాంతం పాటిస్తుండడంతో ఇక్కడి వారూ ఉవ్వెత్తున ఎగిసిన సమైక్య ఉద్యమానికి దూరంగా ఉండి పోయారు. తొలిరోజుల్లో నలుగురితో కలిసి నాలుగు కేకలు వేసినా నిరసనలు తారస్థాయికి చేరే సమయానికి జిల్లా దేశం తమ్ముళ్లు గొంతు నొక్కుకొని కూర్చుండి పోయారు. ఈ ప్రభావం ఇప్పుడు వారి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
 ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపై వారికి ధీమా సన్నగిల్లింది.

దీనితో జిల్లాలో ఆ పార్టీకి  పెద్దదిక్కుగాఉన్న నేతకే సంకటస్థితి ఎదురైంది. ఇక ఇతర నేతల సంగతి చెప్పాల్సిన పనే లేదు. దీంతో పార్టీ పెద్దాయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి వేరొక చోటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా అన్న కోరుకుంటున్న స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ్ముడు మరో చోటు నుంచి బరిలోకి దిగే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. ఒకప్పుడు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఇప్పుడు మారి పోయింది.  మూడునెలలకుపైగా కొనసాగుతున్న సమైక్య ఉద్యమం వీరిని ఈ దుస్థితికి చేర్చింది. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించింది టీడీపీయేనని ఆ నేత గట్టిగా వ్యవహరించి ఉంటే విడిపోవడం అనేది జరిగేది కాదని సమైక్యవాదులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో జిల్లాలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా  మలుపు తిరుగుతున్నాయి. మరో వైపు విభజనను మూటగట్టుకున్న కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోయిన నావగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులూ పక్కచూపులు చూస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా ఓటమి ఖాయమని తేలిపోవటంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు.
 పెద్ద దిక్కుకే దిక్కులేదు... ఇక టీడీపీలో జిల్లాకు పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్న  నాయకుడు గత ఎన్నికల్లో ‘నాకు ఇది చివరి అవకాశం, ఎమ్మెల్యేగా గెలిపించండి’ అని రెండు చేతులు జోడిస్తూ ప్రచారం చేశారు. ఓటర్లు కూడా జాలిపడి ఓటేశారు.  దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దాయన మార్పు కోరుకుంటున్నారు.తన  సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అదే విధంగా తమ్ముడిక్కూడా ఓటమి భయం అన్నకంటే అధికంగా ఉంది. నియోజక వర్గంలో ఆయన పేరెత్తితే చాలు ఓటర్లు కరుస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. స్థానికులతో సత్సంబంధాలు లేకపోవటం, ఆయన వద్దకు ఎవరు వెళ్లినా చిన్నదానికి, పెద్దదానికి  కసురుకుంటుండటంతో జనం మండిపడుతున్నారు. నియోజక వర్గంలో పార్టీ పూర్తిగా పట్టుతప్పింది.

ఈ పరిస్థితుల్లో ఇదే స్థానం నుంచి పోటీచేస్తే ఓటమి తప్పదని తెలుసుకుని వేరే చోటుకు వెళ్లడమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నారు. ఆ మేరకు పావులు కదుపుతున్నారు. అదే విధంగా కుటుంబం నుంచి మరో ఇద్దరిని బరిలోకి దింపాలని యోచనా ఈ సోదరులకు ఉన్నట్లు తెలుస్తోంది.
 పరస్పరం...
 ఇరుపార్టీలకు ఓటమి తప్పదనే భయంతో ఒకరికొకరు సహాయ సహకారాలు తీసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే బలహీనంగా ఎవరైతే ఉన్నారో.. వారు ఇంకొకరికి మద్దతిచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.  ఎవరు గెలిచినా ఒకరికొకరు అండగా నిలివాలని ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇరు పార్టీలకు చెందిన కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement