నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా ఆయన చెప్పిన పనులు చేయాలంట
లేదంటే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు
పార్టీ అనుకూల పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాయించి వేధిస్తున్నారు
మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై సీఎం, మంత్రులు లోకేశ్,‘అనగాని’కి తహసీల్దార్ స్వయంగా ఫిర్యాదు
తనను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితి కల్పించాలని వేడుకోలు
మదనపల్లె: ‘మా ఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన అక్రమాలకు సహకరించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను అవినీతిపరురాలినని.. పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి వేధింపులకు గురిచేస్తున్నారు’.. అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ ఖాజాబీ ఏకంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి చెప్పుకున్న గోడు ఇది.
తాను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించాలని ఆమె వారిని వేడుకున్నారు. అధికార పారీ్టకి చెందిన మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై అక్కడి తహసీల్దార్ నేరుగా ముఖ్యమంత్రినే కలిసి ఆరోపించడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. పాలనా వ్యవహారాల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అరాచకం ఈ సంఘటనకు అద్దంపడుతోంది. తన ఫిర్యాదులో తహసీల్దార్ ఖాజాబీ ఇంకా ఏం పేర్కొన్నారంటే..
ఆఫీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు..
‘ఆయన చెప్పిన పనులు వీలుకాక పోయినా చేసి తీరాల్సిందేనంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రతీపని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారు. మండలంలోని బసినికొండ గ్రామం సర్వే నంబర్లు 718/8ఎ, 774/3, 510/1ఏ/2, వెంకప్పకోట సర్వే నంబర్.71/2కు సంబంధించి రెవెన్యూ చట్టం ప్రకారం సరిగ్గా ఉండడంతో మ్యుటేషన్ చేశానని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎందుకు చేశావంటూ బెదిరిస్తూ, నన్ను ఆఫీసుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక కోళ్లబైలు గ్రామం సర్వే నంబర్ 965/5, 595లో 1.80 ఎకరాల్లో లేఔట్ వేసి రెండు సెంట్ల చొప్పున ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలన్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు సెంట్లు ఇచ్చే అవకాశంలేదని చెబితే వినిపించుకోలేదు.
ల్యాండ్ కన్వర్షన్లు, మ్యుటేషన్లు తదితర రెవెన్యూ సేవలు ఎమ్మెల్యేకు చెప్పకుండా చేయరాదని హుకుం జారీచేశారు. అలాగే, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అస్లాం బాషాను ఎమ్మెల్యే తన చెప్పుచేతల్లో ఉంచుకుని, రికార్డులను సబ్ కలెక్టరేట్, కలెక్టరేట్‌కు పంపకుండా, పాలనాపరమైన పనులు జరగనీయకుండా అడ్డుకుంటూ, మానసికంగా నన్ను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్నారు. పైగా.. టీడీపీ అనుకూల పత్రికలో నాపై అసత్యాలు ప్రచారం చేయించారు’.. అంటూ ఆమె సీఎం, లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment