Shahjahan Basha
-
మా ఎమ్మెల్యేకు నెలనెలా రూ.30 లక్షలు ఇవ్వాలట..
మదనపల్లె: ‘మా ఎమ్మెల్యే నన్ను పనిచేసుకోనివ్వట్లేదు. ప్రతినెలా రూ.30 లక్షలు కప్పం కట్టమంటున్నారు. ఆయన పురమాయించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ చేసి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఆయన అక్రమాలకు సహకరించకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. నేను అవినీతిపరురాలినని.. పార్టీ అనుకూల పత్రికల్లో వార్తలు రాయించి వేధింపులకు గురిచేస్తున్నారు’.. అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె తహసీల్దార్ ఖాజాబీ ఏకంగా సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి చెప్పుకున్న గోడు ఇది.తాను ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునే పరిస్థితులు కల్పించాలని ఆమె వారిని వేడుకున్నారు. అధికార పారీ్టకి చెందిన మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై అక్కడి తహసీల్దార్ నేరుగా ముఖ్యమంత్రినే కలిసి ఆరోపించడం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. పాలనా వ్యవహారాల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల అరాచకం ఈ సంఘటనకు అద్దంపడుతోంది. తన ఫిర్యాదులో తహసీల్దార్ ఖాజాబీ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. ఆఫీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు..‘ఆయన చెప్పిన పనులు వీలుకాక పోయినా చేసి తీరాల్సిందేనంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరిగే ప్రతీపని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారు. మండలంలోని బసినికొండ గ్రామం సర్వే నంబర్లు 718/8ఎ, 774/3, 510/1ఏ/2, వెంకప్పకోట సర్వే నంబర్.71/2కు సంబంధించి రెవెన్యూ చట్టం ప్రకారం సరిగ్గా ఉండడంతో మ్యుటేషన్ చేశానని, ఎమ్మెల్యేకు చెప్పకుండా ఎందుకు చేశావంటూ బెదిరిస్తూ, నన్ను ఆఫీసుకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక కోళ్లబైలు గ్రామం సర్వే నంబర్ 965/5, 595లో 1.80 ఎకరాల్లో లేఔట్ వేసి రెండు సెంట్ల చొప్పున ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాలన్నారు. కానీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు సెంట్లు ఇచ్చే అవకాశంలేదని చెబితే వినిపించుకోలేదు.ల్యాండ్ కన్వర్షన్లు, మ్యుటేషన్లు తదితర రెవెన్యూ సేవలు ఎమ్మెల్యేకు చెప్పకుండా చేయరాదని హుకుం జారీచేశారు. అలాగే, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ అస్లాం బాషాను ఎమ్మెల్యే తన చెప్పుచేతల్లో ఉంచుకుని, రికార్డులను సబ్ కలెక్టరేట్, కలెక్టరేట్‌కు పంపకుండా, పాలనాపరమైన పనులు జరగనీయకుండా అడ్డుకుంటూ, మానసికంగా నన్ను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్నారు. పైగా.. టీడీపీ అనుకూల పత్రికలో నాపై అసత్యాలు ప్రచారం చేయించారు’.. అంటూ ఆమె సీఎం, లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
చిత్తూరు(సెంట్రల్) : కలెక్టరేట్ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తు న ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో మాజీ శాసనసభ్యుడు షాజహన్ బాషా, నాయకులు నరసింహులునాయుడు, నాగభూషణం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు హామీలు నెరవేర్చాలంటే నిధులు లేవంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు. నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారో, దొంగతనం చేసి తెస్తారో, హెరిటేజ్ నిధులు పెడతారో... తెలియదుగానీ రుణమాఫీ కచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతుల పంటరుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలన్నారు. డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చిన మేరకు వారి రుణాలన్నింటినీ రద్దు చేయాలన్నారు. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులందరికీ రూ.లక్ష, రైతుకు రూ.1.5 లక్షలు మాత్రమే రద్దు చేస్తామంటే అంగీకరించబోమన్నారు. రైతులు, మహిళలతో భవిష్యత్‌లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. వేతన బకాయిలు చెల్లించాలి సంఘమిత్రలకు 14 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ ఆధ్వర్యంలో సోమవారం సంఘమిత్రలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు చైతన్య, ఐకేపీ సంఘమిత్రల యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి ఓబులేష్ మాట్లాడుతూ సంఘమిత్రల కు సెర్ఫ్ అధికారులకు గత ఏడాది మే 30న జరిగిన ఒప్పందా న్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం 14 నెలలుగా బకాయిలు చెల్లించకుండా ఐకేపీ సంఘాల యాని మేటర్స్(సంఘమిత్రలు)తో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టన వారిలో జిల్లా నాయకులతో పాటు గురవయ్య, గిరిధర్గుప్త, వేణుగోపాల్, భువనేశ్వరి, రెడ్డెప్ప, కళావతి, మణి, వాసు, ప్రతాప్ ఉన్నారు. కేబీడీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల అరెస్టు పుంగనూరు కేబీడీ షుగర్ ఫ్యాక్టరీ అక్రమ లేఆఫ్ ఎత్తివేయాలంటూ రెండు వారాలుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న కార్మికులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సోమవారం దీక్ష చేస్తున్న కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసు లు వారిని అరెస్టు చేశారు. వారిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టన వారిలో నాయకులు కేవీ రమణ, రఘునాథ్, కమురుద్దీన్, చక్రపాణి, సుబ్రమణ్యం, రెడ్డెప్ప ఉన్నారు. -
'కిరణ్ రాష్ట్రాన్ని నట్టేట ముంచాడు'
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ఎమ్మెల్యేలతోపాటు ఐదున్నర కోట్ల మంది ప్రజలను మోసం చేశారని చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం మదనపల్లిలో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన ఆపేందుకు లాస్ట్ బాల్ వరకు పోరాడుతానంటూ చివరకు రాష్ట్రాన్ని నట్టేట ముంచేశాడని సీఎంపై నిప్పులు చెరిగారు. సెప్టెంబర్ 1న చేసిన తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నానని షాజహాన్ బాషా స్పష్టం చేశారు.