ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
చిత్తూరు(సెంట్రల్) : కలెక్టరేట్ సోమవారం ధర్నాలతో దద్దరిల్లింది. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తు న ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నాలో మాజీ శాసనసభ్యుడు షాజహన్ బాషా, నాయకులు నరసింహులునాయుడు, నాగభూషణం అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.
చంద్రబాబు ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు హామీలు నెరవేర్చాలంటే నిధులు లేవంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారని ఆరోపించారు. నిధులు లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారో, దొంగతనం చేసి తెస్తారో, హెరిటేజ్ నిధులు పెడతారో... తెలియదుగానీ రుణమాఫీ కచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
రైతుల పంటరుణాలు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ చేయాలన్నారు. డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చిన మేరకు వారి రుణాలన్నింటినీ రద్దు చేయాలన్నారు. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులందరికీ రూ.లక్ష, రైతుకు రూ.1.5 లక్షలు మాత్రమే రద్దు చేస్తామంటే అంగీకరించబోమన్నారు. రైతులు, మహిళలతో భవిష్యత్‌లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
వేతన బకాయిలు చెల్లించాలి
సంఘమిత్రలకు 14 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీ యూ ఆధ్వర్యంలో సోమవారం సంఘమిత్రలు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు చైతన్య, ఐకేపీ సంఘమిత్రల యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వాణిశ్రీ, జిల్లా కార్యదర్శి ఓబులేష్ మాట్లాడుతూ సంఘమిత్రల కు సెర్ఫ్ అధికారులకు గత ఏడాది మే 30న జరిగిన ఒప్పందా న్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం 14 నెలలుగా బకాయిలు చెల్లించకుండా ఐకేపీ సంఘాల యాని మేటర్స్(సంఘమిత్రలు)తో వెట్టిచాకిరీ చేయించుకుంటోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టన వారిలో జిల్లా నాయకులతో పాటు గురవయ్య, గిరిధర్‌గుప్త, వేణుగోపాల్, భువనేశ్వరి, రెడ్డెప్ప, కళావతి, మణి, వాసు, ప్రతాప్ ఉన్నారు.
కేబీడీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల అరెస్టు
పుంగనూరు కేబీడీ షుగర్ ఫ్యాక్టరీ అక్రమ లేఆఫ్ ఎత్తివేయాలంటూ రెండు వారాలుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్న కార్మికులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సోమవారం దీక్ష చేస్తున్న కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసు లు వారిని అరెస్టు చేశారు. వారిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టన వారిలో నాయకులు కేవీ రమణ, రఘునాథ్, కమురుద్దీన్, చక్రపాణి, సుబ్రమణ్యం, రెడ్డెప్ప ఉన్నారు.