రైతుల కడుపు కొట్టడం బాబు నైజం
Published Sat, Jan 21 2017 12:21 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– పీఏసీ చైర్మన్ బుగ్గన మండిపాటు
– కమలాపురం బాధితులకు బాసట
డోన్ టౌన్ : రైతుల కడుపుకొట్టడం సీఎం చంద్రబాబు నైజమని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. డోన్ పట్టణంలోని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు టీఈ చిన్న కేశవయ్యగౌడ్ స్వగృహంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతుల పక్షపాతి, రైతు బాంధవుడని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు అసలు నైజం బలవంతపు భూసమీకరణతోనే ప్రజలకు తెలిసిపోయిందన్నారు. రైతుల సంక్షేమంపై బాబుకున్న చిత్తశుద్ధి ఏపాటిదో రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో ఇఛ్ఛాపురం నుంచి చిత్తూరు వరకు రైతుల భూములను బలవంతంగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపార చేస్తున్నారని ఆరోపించారు.
కమలాపురం దళితులకు న్యాయం చేయాలి...
ఏడేళ్లక్రితం డోన్ మండలం కమలాపురం, కన్నపకుంట గ్రామాల రైతులకు చెందిన 77 హెక్టార్ల సాగు భూమిని అధికారపార్టీ నాయకులు లీజు పొంది రైతుల పొట్టకొట్టారని డోన్ శాసన సభ్యుడు బుగ్గన ఆరోపించారు. దీనికి అధికారులు వత్తాసు పలకడం దారుణమన్నారు. కాళ్ల చెప్పులు అరిగేలా రైతులు న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ, అధికార పార్టీ నాయకులు చుట్టూ తిరుగుతున్నా కనికరించకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ భూముల లీజును రద్దుచేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రొటోకాల్ హారన్ మార్చండి...
అధికారపార్టీ నాయకులకు, వారి బంధువులు , వారి కార్ల డ్రైవర్లకు ప్రొటోకాల్ పేరుతో ఇస్తున్న ఎస్కార్ట్ వాహనాల హారన్‌ను మార్చాలని బుగ్గన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంబులెన్స్ హారన్ సౌండ్‌తో వీరి వాహనాల శబ్దాలు కూడా ఒకటిగా ఉండడంతో ప్రజల్లో అయోమయం నెలకొందన్నారు. వెంటనే ఈ సౌండ్ సిస్టంను మార్చాలని ఆయన పోలీసు అధికారులను కోరారు.
మహనీయుల విగ్రహాల జోలికి రావద్దు...
డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు అధికారపార్టీ నాయకులు అధికారులను పావులుగా ఉపయోగించుకోవడం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకుల ఆగడాలను ఎదుర్కొంనేందుకు వైయస్‌ఆర్‌సీపీ.. కోట్ల కుటుంబానికి ఈ విషయంలో అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ నాయకుల విగ్రహాలను ప్రభుత్వ భూముల్లో కాక టీడీపీ నాయకుల ఇళ్ల వద్ద ఉన్నాయా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటుకు ఆటంకం కలిగించే కుయుక్తులను అధికారపార్టీ నాయకులు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని బుగ్గన హెచ్చరించారు. సమావేశంలో డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు , పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, పుల్లారెడ్డి, వెంకోబారావు, దినేష్‌గౌడ్, కటిక వేణు, పోస్టు ప్రసాద్, రామచంద్రుడు, కోట్రికె హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.
20డిహెచ్‌ఎన్90ఎ : మాట్లాడుతున్న పీఏసీ చైర్మన్ బుగ్గన
Advertisement
Advertisement