రెండు ప్రాంతాల్లోనూ సంబరాలు చేయండి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ముగిసిన సందర్భంగా సంబరాలు చేయాలని పార్టీ ఇరు ప్రాంతాల నేతలకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. అసెంబ్లీ వాయిదా పడిన తరువాత సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల నేతలతో ఆయన తన నివాసంలో విడివిడిగా భేటీ అయ్యారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలో కూడా అందుబాటులో ఉన్న వారితో సమావేశమయ్యూరు. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ‘అసెంబ్లీలో చివరిరోజు పరిణామాలను ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకోండి. ప్రజల్లోకి వెళ్లండి. మా పార్టీ వల్లే రాష్ర్ట విభజన ఆగిందని సీమాంధ్ర నేతలు చెప్పుకోండి. తమ సహకారం వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంతవరకు వచ్చిందని తెలంగాణ వారు ప్రచారం చేయండి..’ అని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఇరుప్రాంతాల నేతలు రంగంలోకి దిగారు.
విక్టరీ చిహ్నాలను చూపుతూ హడావుడి చేశారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బల్లి దుర్గాప్రసాదరావు, మల్లేల లింగారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఇది ప్రజా విజయమన్నారు. సీమాంధ్రలోని పలు పట్టణ కూడళ్లలో టీడీపీ నేతలు స్వీట్లు పంచారు. మరోవైపు టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు నేతృత్వంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో స్వీట్లు పంచుకున్నారు. సభలో బిల్లుపై రాష్ట్రపతి కోరిన విధంగా అభిప్రాయాలు వెల్లడించామని, ఓటింగ్ జరగలేదని, సీఎం ఇచ్చిన తీర్మానానికి, బిల్లుకు ఎలాంటి సంబంధం లేదని విలేకరుల సమావేశం పెట్టి చెప్పారు. ఇలావుండగా, రెండుప్రాంతాల నేతలు త్వరలోనే ఢిల్లీ వెళ్లాల్సిందిగా చంద్రబాబు సూచించారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని రాష్ట్రపతి, ప్రధాని, వివిధ పార్టీల ముఖ్య నేతలకు సీమాంధ్ర నేతలు విజ్ఞప్తి చేయాలన్నారు. తమ ప్రాంతానికి అనుగుణంగా తెలంగాణ నేతలు వ్యవహరించాలని సూచించారు.
నేడు చెన్నైకి చంద్రబాబు: చంద్రబాబు శుక్రవారం చెన్నైకి వెళ్లనున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక నిర్వహించే జాతీయ స్థాయి విద్యా సదస్సులో బాబు పాల్గొంటారని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ మీడియాకు తెలిపారు.
ప్రతిపక్ష నేతగా బాబు ఉన్నట్టా.. లేనట్టా!
విభజనకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లుపై సభలో నోరెత్తకుండా, ఏ బీఏసీలోనూ పాల్గొనకుండా, బిల్లుపై సవరణలు ప్రతిపాదించకుండా, చివరికి లిఖితపూర్వక అభిప్రాయాలనైనా వెల్లడించకుండా మౌనముద్ర దాల్చిన ప్రతిపక్ష నేతగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శాసనసభ రికార్డుల్లో నిలిచిపోనున్నారు. బిల్లుపై సభలో మాట్లాడాల్సి వస్తే విభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాల్సి వస్తుందని చంద్రబాబు నోరు విప్పకుండా తప్పించుకున్నారు. ఈ గండం నుంచి సభా నాయకుడు, ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా చంద్రబాబును రక్షించారు. గురువారం శాసనసభ నిరవధిక వాయిదాతో గండం గట్టెక్కిందని బాబు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన తీరును చూసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు ఉన్నట్టా.. లేనట్టా.. అని సొంత పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.