ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు అనుకూలంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖ వల్లే ప్రస్తుతం సీమాంధ్రలో విభజన జ్వాలలు ఎగసిపడుతున్నాయని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని, కేంద్రమంత్రిగా మాత్రం ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. స్థానిక ఎన్‌ఎస్పీ గెస్ట్‌హౌస్‌లో గురువారం సాయంత్రం విలేకర్లతో ఆమె మాట్లాడారు. టీడీపీ, బీజేపీలు రాష్ట్రాన్ని విభజిస్తే తమకేమీ అభ్యంతరం లేదని లేఖలు అందజేశాయని, దానివల్లే కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకిగానీ, కేంద్ర మంత్రి పదవికిగానీ రాజీనామా చేసే ఆలోచన తనకు లేదన్నారు. తాను ఢిల్లీలోనే ఉంటూ కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నానని, సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదన్నారు. చంద్రబాబునాయుడే తన కుమారుని రాజకీయ భవిష్యత్తు కోసం నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ముందుగా నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కంఠసర్పి, జ్వరంతో బాధపడుతున్న చిన్నారులను కేంద్రమంత్రి పరామర్శించారు. ఆమె వెంట సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ తదితరులున్నారు.
అడ్డుకోబోయిన ఎన్‌జీఓ నేతల అరెస్ట్...
కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని అడ్డుకోబోయిన ఎన్జీఓలు, జేఏసీ నాయకులను ఎన్‌ఎస్పీ గెస్ట్‌హౌస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో ఎన్‌జీఓ అసోసియేషన్ నాయకుడు అబ్దుల్‌బషీర్, విద్యార్థి జేఏసీ నాయకుడు జగదీష్ తదితరులున్నారు. వారిని స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద నుంచి నుంచి ఎన్‌ఎస్పీ గెస్ట్‌హౌస్‌కు బయలుదేరిన ఎన్‌జీఓలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన
Published Fri, Sep 20 2013 2:54 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
Advertisement