విభజనకు వ్యతిరేకమనలేదు: చంద్రబాబు
పద్ధతి ప్రకారం చేయాలని కోరా: బాబు
న్యూఢిల్లీ నుండి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విభజనకు వ్యతిరేకమని ఏనాడూ అనలేదని, పద్ధతి ప్రకారం విభజన చేయాలని కోరినట్టుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజించాలని నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని కలిపి చర్చించి విభజన నిర్ణయాన్ని అమలుచేయాలని ఆరు నెలల నుండి రాత్రింబవళ్లు అందరినీ కలిసినట్టుగా వివరించారు.
రెండు ప్రాంతాల ప్రజలను కలిపి ఉంచకపోగా పాకిస్థాన్, ఇండియాలాగా శాశ్వత శత్రువులుగా చేయడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. టీడీపీలో కూడా నిలువునా విభజన వచ్చే పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తంచేశారు. అయినా పార్టీ చీలిపోయే పరిస్థితి ఉండదని అనుకుంటున్నట్టు చెప్పారు. కేంద్ర కేబినెట్‌లో విభజన బిల్లును ఆమోదించిన నాటి నుంచి లోక్‌సభలో ఆమోదించేదాకా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేయడం గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు.
ఇంకా ఆయనేమన్నారంటే... రాష్ట్రంలోని ఇరుప్రాంతాల నేతలను, ప్రజాసంఘాల నేతలను కలిపి చర్చించాక నిర్ణయం తీసుకోవాలని దేశవ్యాప్తంగా అన్ని పార్టీల నేతలను కలిశాను. అయినా విభజనను ఆపలేకపోయా. రాష్ట్ర శాసనసభ వ్యతిరేకిస్తే ఇప్పటిదాకా ఏ రాష్ట్రాన్నీ ఏర్పాటుచేయలేదు. ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాస్తవాలు ప్రజలకు తెలియకుండా లోక్‌సభ టీవీ ప్రసారాలను నిలిపివేశారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని, గవర్నరుకు శాంతిభద్రతలపై అధికారం వంటివాటికి రాజ్యాంగసవరణ అవసరమున్నా తొక్కిపెట్టారు. స్పీకర్ మీరాకుమార్ నిబంధనలను పట్టించుకోలేదు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవాలని, జగన్‌ను సీమాంధ్రలో హీరోగా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే కాంగ్రెస్‌పార్టీ అడ్డగోలుగా విభజనకు దిగింది. సీమాంధ్ర రాజధాని ఎక్కడో తెలియదు. సమస్యలను పరిష్కరించకుండా మరిన్ని సమస్యలను పెంచారు. రాజధాని నిర్మాణానికి 4-5 లక్షలకోట్లు కావాలి.