సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ‘జోగీ జోగీ రాసుకుంటే..’ అన్న చందంగా తయారైంది జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల పరిస్థితి. తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న అధికార కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు టీడీపీ గాలం వేస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీడీపీ వైపు చూస్తున్నారు. అలాంటివారికి చంద్రబాబు ఎర్ర తివాచీ పరచడంపై టీడీపీ తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. తమ అభిప్రాయం తీసుకోకుండా అధినేత అనుసరిస్తున్న వ్యూహం బెడిసికొడుతుందని విమర్శిస్తున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ.. విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరితే మిగిలేది బూడిదేనని తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు.
తలుపులు బార్లా తెరిచిన బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు తలుపులు బార్లా తెరిచారు. వైఎస్సార్‌సీపీలో చేరేందుకు కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న వారిని చేర్చుకునేందుకు ఆ పార్టీ విముఖత చూపుతోంది. దీంతో విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీడీపీ వైపు దృష్టిసారించారు. ఈ పరిణామం టీడీపీలో సరికొత్త రగడకు దారితీస్తోంది.
ఓ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి కోసం తమ పార్టీ ప్రజాప్రతినిధికే చంద్రబాబు ఝలక్ ఇవ్వడానికి సిద్ధపడటం విస్మయపరుస్తోంది. పశ్చిమ ప్రాంతానికే చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేతో టీడీపీ అధిష్టానం మంతనాలు ఆ దిశగానే సాగుతున్నాయి. నియోజకవర్గంలో ఆయన సామాజికవర్గ బలంలేకపోయినా 2009 ఎన్నికల్లో గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న ఆ ఎమ్మెల్యే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు తహతహలాడారు. ప్రజావ్యతిరేకత కూడగట్టుకున్న ఆయన్ని చేర్చుకునేందుకు వైఎస్సార్‌సీపీ సమ్మతించలేదు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే భావించారు.
కానీ అధిష్టానం ఆగ్రహించడంతో వెనక్కి తగ్గారు. ఆయనతో తాజాగా టీడీపీ దూతలు మంతనాలు సాగిస్తున్నారు. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో గెలవడం కష్టమని భావించిన ఆ ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంపై కన్నేశారు. తనకు పొరుగున ఉన్న నియోజకవర్గంలో టిక్కెట్టు ఇస్తే టీడీపీలో చేరుతానని షరతు పెట్టారు. కాగా ఆ నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ ప్రజాప్రతినిధి ఉన్నారు. కానీ ఆయన ఓ ఫైనాన్స్ సంస్థ కుంభకోణంలో పాత్ర ఉందన్న ఆరోపణలతో వివాదాస్పదుడయ్యారు. ఈ అంశాన్నే చూపించి ఆయన్ని తప్పించి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు టిక్కెట్టు ఇవ్వాలన్నది టీడీపీ అధినేత ఉద్దేశంగా ఉంది. ఊహించని ఈ పరిణామంతో టీడీపీ ప్రజాప్రతినిధి హతాశుడయ్యారనే చెప్పాలి.
పశ్చిమ ప్రాంతానికే చెందిన మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారు. తన నియోజకవర్గానికి భారీ పరిశ్రమల కారిడార్‌ను కేటాయించారని సీఎం కిరణ్‌ను కీర్తిస్తున్న ఆ ఎమ్మెల్యే.. టీడీపీతో లోపాయికారీగా మంతనాలు సాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆయన తీవ్రంగా యత్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఫోన్లు మీద ఫోన్లు చేసి.. తన అనుచరులతో రాయబారాలు పంపి హడావుడి చేశారు. కానీ తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయన్ని చేర్చుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ససేమిరా అన్నారు.
విషయం తెలిసిన చంద్రబాబు తమ పార్టీ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తానని ఆయనకు గాలం వేశారు. కాగా ఇప్పటికే ఆ నియోజకవర్గంలో కొంతకాలంగా పనిచేస్తున్న టీడీపీ నేతకు ఆగ్రహం వచ్చింది. ఆయన నేరుగా బాలకృష్ణతో మాట్లాడి తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తన సన్నిహితుడని తెలిసీ ఆయన స్థానానికే చెక్ పెట్టడంపై బాలకృష్ణ కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లా కేంద్రానికి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధి ఇప్పటికే టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆయన ఏకంగా పొరుగు జిల్లాకే వెళ్లిపోనున్నారు. తన సొంత జిల్లా కూడా అయినందున అక్కడి నుంచి ఈసారి టీడీపీ టిక్కెట్టుపై పోటీ చేయాలన్నది ఆయన ఉద్దేశం. ఈ పరిణామాలపై టీడీపీ తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. పదేళ్లుగా అధికారం లేకపోయినా పార్టీని అంటిపెట్టుకున్న తమను కాదనడంపై మండిపడుతున్నారు. అధినేత చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మరి ఈ పరిణమాల పర్యవసానం ఎలా ఉంటుందో చూడాల్సిందే.
మాకొద్దు..!
Published Fri, Dec 27 2013 4:03 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM
Advertisement
Advertisement