‘సమైక్యం’ కోసం దిగ్బంధం | Ysr congress party ready to highways blockade for seemandhra | Sakshi
Sakshi News home page

‘సమైక్యం’ కోసం దిగ్బంధం

Published Wed, Nov 6 2013 5:39 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Ysr congress party ready to highways blockade for seemandhra

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ ప్రస్థానం కొనసాగిస్తోంది. అందులో భాగంగా బుధ, గురువారాల్లో రహదారుల దిగ్బంధనానికి సమాయత్తమైంది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు రహదారులను దిగ్బంధించనున్నాయి. ఇందుకోసం జిల్లా పార్టీ నేతలు కూడా సర్వసన్నద్ధమయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డితో చర్చించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు          నూకసాని బాలాజీ జిల్లాలోని నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అదే విధంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో చర్చించారు. జిల్లాలో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో రెండు రోజులపాటు ప్రధాన రహదారుల దిగ్బంధనానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. మండల, పట్టణ కన్వీనర్లకు ఆ కార్యాచరణను వివరించారు. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదుల సహకారంతో ఈ ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉద్యుక్తమవుతున్నారు.
 
 పకడ్బందీ వ్యూహం...
 రెండు రోజులపాటు ప్రధాన రహదారుల దిగ్బంధనానికి వైఎస్సార్‌సీపీ పక్కా ప్రణాళిక రూపొందించింది. జిల్లాలో రెండు ప్రధాన రహదారులపై దృష్టి కేంద్రీకరించింది. కోల్‌కత్తా-చెన్నై జాతీయ రహదారి, త్రోవగుంట- దిగమర్రు  రాష్ట్ర రహదారులను అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయించింది. జాతీయ రహదారిపై మేదరమెట్ల, మార్టూరు, మద్దిపాడు, ఒంగోలు, సింగరాయకొండ, ఉలవపాడు, తెట్టు... ఇలా ప్రతి చోటా రాకపోకలను అడ్డుకోనున్నారు. త్రోవగుంట- దిగమర్రు రాష్ట్ర రహదారిపై కూడా పలు చోట్ల వాహనాల రాకపోకలను అడ్డుకోవడానికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఈ బాధ్యతను చీరాల నియోజకవర్గ నేతలు వహిస్తారు. అదే విధంగా పశ్చిమ మండలాల్లోని దర్శి, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా పలుచోట్ల రహదారులను దిగ్బంధించనున్నారు.
 
 బృందాలవారీగా...
 రెండు రోజులపాటు రహదారుల దిగ్బంధనానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహంతో రంగంలోకి దిగనుంది. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసింది. ఒక బృందాన్ని అడ్డుకున్నా... మరో బృందం వెంటనే రంగంలోకి దిగాలన్నది వ్యూహం. అందుకోసం ప్రత్యేకమైన పాయింట్లను కూడా గుర్తించారు. ఈ పాయింట్లకు ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి ఇన్‌చార్జికి కొంతమంది నేతలు, కార్యకర్తల బృందాన్ని కేటాయించారు. ఒక బృందం తరువాత ఒక బృందం రహదారులను దిగ్బంధిస్తారు. రహదారుల దిగ్బంధన కార్యక్రమంలో మొదటి రోజుకు భిన్నంగా రెండోరోజు ఆందోళనను వైఎస్సార్‌సీపీ రూపొందించింది. పలు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలతో కొన్ని ప్రత్యేక పాయింట్లలో రహదారులను దిగ్బంధించనున్నారు. 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధనంతో ప్రజల సమైక్యాంధ్ర స్ఫూర్తిని మరోసారి రగిలించాలన్నది తమ లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement