మైదుకూరు(చాపాడు), న్యూస్‌లైన్ : టమోటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలలుగా వాటి ధరలు ఆకాశాన్ని అంటడంతో పసుపు, వరి సాగు చేసుకున్న రైతులు తాము కూడా టమోటా సాగు చేసుకున్నా బాగుండునేమోనని ఆటోచనలో పడ్డారు. ఇప్పడైనా సాగు చేద్దామని ఇటీవల రైతులు ఎక్కువ విస్తీర్ణంలో టమోటా సాగుచేశారు. అయితే వారి ఆశలు ఆవిరి అవుతున్నాయి. టమాటాను ఎందుకు సాగు చేశామా అనే సందిగ్ధంలో పడ్డారు.
మైదుకూరు మండలం వ్యాప్తంగా సుమారు ఆరు వేల ఎకరాలలో రైతులు టమోటా సాగు చేశారు. రెండు నెలలుగా టమోటాల దిగుబడులు అధికంగా రావడంతోపాటు ధరలు కూడా అధికంగానే ఉంటూ వచ్చాయి. సమైక్యాంధ్రా ఉద్యమం ప్రారంభం నుంచి రెండు వారాల క్రితం వరకు ధరలు బాగానే ఉన్నాయి. గతంలో 20 కేజీల టమోటాల బాక్సు రూ.1000-రూ.1200 వరకు పలికింది. ఆ సమయంలో రైతులు సొమ్ము చేసుకున్నారు.
రెండు వారాల క్రితం నుంచి టమోటా రైతు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. బాక్సు రూ.1000 ఉన్న ధరలు రోజుకు రోజుకు తగ్గిపోతూనే ఉంది. 20 కేజీల టమోటాల బాక్సు ధరలు క్రమంగా రూ.800, రూ.600, రూ.400 నుంచి ఏకంగా రూ.210-రూ.220లకు పడిపోయాయి. ‘దిగుబడి చూస్తే పెరుగుతోంది.. ధరలు చూస్తే తగ్గుతున్నాయి.. వ్యాపారులేమో రోజుకొకరేటు చెబుతున్నారు... ఎంటి మన పరిస్థితి’ అన్న సందిగ్ధంలో రైతన్నలు ఉన్నారు.
ఇతర ప్రాంతాలకు తరలింపు
మైదుకూరు ప్రాంతంలో పండిన టమోటను వ్యాపారులు ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వైజాగ్, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడు, హైదరాబాదు, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాలలో రెట్టింపు ధరలు ఉన్నట్లు తెలుస్తోంది.
పెట్టుబడైనా తిరిగి వస్తుందేమోనని..
నేను ఎకరాన్నర్ర పొలంలో టమోటా పంటను సాగు చేశాను. రెండు వారాల క్రితం నుంచే పంట వస్తోంది. ప్రస్తుతం కోతకు 15 బాక్కులు వస్తున్నాయి. ఎకరా సాగుకు రూ.30వేలు పైగా పెట్టుబడి అయింది. ధరలు చూస్తే రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఎంత త్వరగా పంటను అమ్మి తమ పెట్టుబడిని సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడుతున్నా. - ఎం.సుబ్బరాజు, టమోటా రైతు, విశ్వనాథపురం
టమోటా తగ్గుముఖం
Published Sun, Dec 8 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement