సమైక్య ఉద్యమం ఎఫెక్ట్ వాళ్లు రాలేదు.. వీళ్లు వెళ్లలేదు
బదిలీ ఉత్తర్వులకు స్పందించని తహశీల్దార్లు
నేడు రెవెన్యూ అసోసియేషన్ నిర్ణయం
హైకోర్టు ఉత్తర్వులతో ఎంపీడీవోల బదిలీలు అనుమానమే
సాక్షి, మచిలీపట్నం :
తహశీల్దార్‌ల బదిలీలపై సమైక్య ఉద్యమ ప్రభావం పడింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు చర్యలు తీసుకోవడంపై కన్నెర్ర చేస్తున్న ఉద్యోగ వర్గాలు బదిలీ ఉత్తర్వులకు స్పందించడం లేదు. సోమవారం నాటి బదిలీ ఉత్తర్వుల నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి కృష్ణా జిల్లాకు రావాల్సిన తహశీల్దార్లు రాలేదు. ఇక్కడి నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లాల్సినవారూ కదల్లేదు. ఎక్కడి తహశీల్దార్లు అక్కడే ఉండటంతో భవిష్యత్ కార్యాచరణపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
నిరసన వ్యక్తం చేసేందుకే...
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ.. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమం సాగిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో ఏపీ ఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు త్యాగాలకు సిద్ధపడి ముందుభాగాన నిలిచారు. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు పలికారు. అయినా కేంద్రంలోని యూపీఏ సర్కారుకు చీమకుట్టినట్టు లేదు. సమైక్య ఉద్యమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర విభజనకు తెగించింది. దీంతో గత కొద్దిరోజులుగా ఉద్యోగులు మరోమారు ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అసోసియేషన్ కూడా సమైక్య రాష్ట్రం కోసం సమ్మెబాట పట్టింది. ఈ నేపథ్యంలో ఎన్నికల బదిలీల్లో భాగంగానే జిల్లాల్లో పెద్ద సంఖ్యలో తహశీల్దార్‌ల బదిలీలు జరిగాయి. అయితే వారంతా విధుల నుంచి రిలీవ్ కాకుండా తమ నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నారు.
ఎంపీడీవోల బదిలీ అనుమానమే..
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో జిల్లాలోని ఎంపీడీవోల బదిలీలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎంపీడీవోలకు ప్రత్యక్షంగా ఎన్నికల విధులు అప్పగించని నేపథ్యంలో వారి బదిలీలు చేయకూడదని, ఎన్నికల విధులు కేటాయించేవారినే బదిలీ చేయాలని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్‌కు పంపించారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మేరకు ఎంపీడీవోల బదిలీలపై నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది.
రెవెన్యూ అసోసియేషన్‌లో తర్జనభర్జన
ఎన్నికల బదిలీల్లో భాగంగా భూ పరిపాలన ప్రధాన అధికారి (సీసీఎల్‌ఏ) నుంచి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
జిల్లా నుంచి 38 మంది తహశీల్దార్లను బదిలీ చేశారు. అందులో తూర్పుగోదావరికి 20 మంది, పశ్చిమగోదావరికి 18 మంది వెళ్లాలని ఆదేశాలిచ్చారు.
ఉభయగోదావరి జిల్లాల నుంచి 43 మంది తహశీల్దార్లు కృష్ణా జిల్లాకు బదిలీ అయ్యారు. వారిలో తూర్పుగోదావరి నుంచి 24 మంది, పశ్చిమగోదావరి నుంచి 19 మంది రావాల్సి ఉంది.
తహశీల్దార్లు ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణం వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లి కలెక్టర్‌లకు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
సమైక్య ఉద్యమానికి మద్దతు పలుకుతున్న తహశీల్దార్లు అంతా బదిలీల ఉత్తర్వులను అమలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే కృష్ణాజిల్లా నుంచి రిలీవ్ కాలేదు. ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన తహశీల్దార్లు కూడా రాలేదని కలెక్టరేట్ వర్గాలు ధృవీకరించాయి.
బదిలీ ఉత్తర్వుల అమలుపై రెవెన్యూ అసోసియేషన్‌లో తర్జన భర్జన సాగుతోంది.
ఎన్నికల బదిలీలు కావడంతో అమలు చేయకపోతే ఇబ్బంది అవుతుందని కొందరు, వాటిని పాటించకుండా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకాలని ఇంకొందరు భిన్నవాదనలు వినిపిస్తున్నారు.
ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకుని అమలుచేసేలా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బుధవారం సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది.
తహశీల్దార్ల బదిలీలు కదలిక లేదు
Published Wed, Feb 12 2014 2:14 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement