సాక్షి, ఒంగోలు: జిల్లాలో మద్యం అమ్మకాలు ఏటా వందల కోట్లలో సాగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రూ 241.85 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 15 శాతం వరకు మద్యం అమ్మకాలు తగ్గాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం..భారీ వర్షాలు, తుఫాన్ల ప్రభావంతో మద్యం అమ్మకాలు కొంత మేర తగ్గాయి. మద్యం అమ్మకాలు పెంచేందుకు నిబంధనల అమలు విషయంలో ఎక్సైజ్ అధికారులు చూసీ చూడనట్లు పోతున్నారు.
అమ్మకాలే లక్ష్యంగా...
జిల్లాలోని మద్యం అమ్మకాలను ఏటా గణనీయంగా పెంచడంతోపాటు మరోవైపు నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉంది. నిర్ణీత వేళల్లో మాత్రమే మద్యం అమ్మకాలు జరిపేలా చూడడం, గంజాయి అమ్మకాలు లేకుండా, నాటుసారా తయారీని అరికట్టడం, ఎన్‌డీపీ మద్యాన్ని జిల్లాలోకి రానీయకుండా చూడడంతోపాటు బ్రాందీ షాపుల్లో లూజు విక్రయాలు లేకుండా, బార్లలో నిప్ (క్వార్టర్ బాటిళ్లు)ల అమ్మకాలు జరగనీయకుండా చూడాలి. మరోవైపు మద్యాన్ని ఎంఆర్ పీకి అమ్మించాలి. అయితే జిల్లాలో ఇవేమీ తమకు పట్టవన్నట్లుగా ఆ శాఖ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కేవలం అమ్మకాలే లక్ష్యంగా వారు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.
పుట్టగొడుగుల్లా వెలుస్తున్న
బెల్ట్ షాపులు
ఊరికి వెళ్లేందుకు సరైన దారి లేనివి..రేషన్ షాపులు, పాఠశాలలు, ఆస్పత్రులు కనీసం మంచినీటి సౌకర్యం లేని గ్రామాలైనా ఉన్నాయేమోకానీ జిల్లాలో మద్యం దొరకని గ్రామాలు లేవంటే అతిశయోక్తికాదు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి బెల్ట్‌షాపులు పది వేలకుపైగా ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మామూలు రోజుల్లో జరిగే అమ్మకాలకన్నా డ్రైడేల్లో అమ్మకాలు రెట్టింపుగా ఉంటాయి.
ఇతర శాఖలతో పోలిస్తే ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగానే ఉంది. జిల్లాలోని యర్రగొండపాలెం, కంభం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం ప్రాంతాల్లో ఆ శాఖలో ఎస్సైలు లేరు. కేవలం అమ్మకాలు పెంచడంపైనే అధికారులు దృష్టి పెట్టకుండా...నిబంధనలు అమలు చేసే విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రూ 241 కోట్ల మద్యం టా..గేషారు
Published Mon, Dec 30 2013 3:55 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
Advertisement
Advertisement