ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పలు విధాలుగా ఆందోళనలు తెలిపిన సమైక్యవాదులు శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఎన్‌జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఒంగోలు నగరంతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ఉద్యోగులు ముట్టడించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ సర్వీసులైన బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టాఫీసులు, ఎల్‌ఐసీ, బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకుల బంద్‌తో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆందోళన కార్యక్రమాలు యథావిధిగా సాగాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు ప్రకాశం పంతులు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట గోడలకు సున్నం వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి.
వివిధ నియోజకవర్గాల్లో... సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో సాగుతున్న ఆందోళన కార్యక్రమాలు శుక్రవారానికి 59వ రోజుకు చేరాయి. అద్దంకిలో ఎన్జీఓ నేతల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూయించారు. బంద్‌తో బ్యాంకులు, పోస్టాఫీసులు, సొసైటీ, ఎల్‌ఐసీ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఆర్టీసీ నాయకులు డిపో ఎదుట ఆందోళన చేశారు. ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 40వ రోజుకు చేరాయి. బల్లికురవలో సమైక్యవాదుల రిలే దీక్షలు 16వ రోజూ సాగాయి. మేదరమెట్ల మండలంలోని కొణిదెనలో బ్యాంకులు, పాఠశాలలు, వ్యాపార సంస్థలను ఆందోళనకారులు మూయించారు.
రావినూతలలో సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి రిలే దీక్షలు చేపట్టారు. చీరాలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 31వ రోజుకు చేరాయి. ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మికులు పట్టణంలో భారీ ప్రదర్శన చే శారు. ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన రథయాత్ర నిర్వహించగా, రజకులు నిరాహార దీక్ష చేపట్టారు. పర్చూరులో సమైక్యవాదుల దీక్షలు 9వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇంకొల్లులో బ్యాంక్‌లు, కేంద్ర కార్యాలయాలను జేఏసీ ఆధ్వర్యంలో మూయించారు.
కందుకూరులో రైతు గర్జన: కందుకూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పోస్టాఫీసు సెంటర్‌లో రైతుగర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై వరి, పత్తి మొక్కలు నాటి వినూత్న నిరసన తెలిపారు. గుడ్లూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వంటా-వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. కొండపిలోను కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. పొన్నలూరు మండలంలోని అగ్రహారం, ముప్పాళ్ల గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవ హారం, కోలాటం, హోమాలు నిర్వహించారు.
మార్కాపురంలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. కొనకనమిట్లలో సమైక్యాంధ్ర కోరుతూ రైతులు, విద్యార్థినులు, విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పొదిలిలో సమైక్యాంధ్ర కోరుతూ ఫొటోగ్రాఫర్లు ర్యాలీ- రాస్తారోకో చేపట్టారు. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన ప్రజలు రాష్ట్ర విభజనను నిరసిస్తూ భారీ ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. జేఏసీ దీక్షా శిబిరంలో నల్లబండకు చెందిన యువకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. బేస్తవారిపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లింలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టి, రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కొమరోలులో ఎంపీడీఓ విజయకుమార్, కార్యాలయ సిబ్బంది, ఉపాధి సిబ్బంది ర్యాలీ, మానవహారం, రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కంభంలో ముస్లింలు ర్యాలీ, మానవహారం, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు గిద్దలూరు, రాచర్ల, ఆకవీడులలో కేంద్ర కార్యాలయాలను మూసేయించారు.
కనిగిరిలో సమైక్యాంధ్ర కోసం శాంతిహోమం: కనిగిరిలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూర్ బాష సంఘం తరఫున రిలేదీక్షలో కూర్చున్నారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం శాంతి హోమం చేశారు. నిరసన ర్యాలీ, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 12వ రోజుకు చేరాయి. టీడీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. హనుమంతునిపాడు మండలం వేములపాడులో గ్రామస్తులు నిరసన ర్యాలీ చేపట్టి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎస్‌పురంలో విద్యార్థులు రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డీజీపేటలో విద్యార్థులు, యువకులు ర్యాలీ చేపట్టారు. పామూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లీంలు నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.
జిల్లాలో 59వ రోజు ఉధృతంగా సమైక్యాంధ్ర ఉద్యమం
Published Sat, Sep 28 2013 6:26 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement