సమగ్రసమాచారం లేని విభజన బిల్లుపై సభలో ఎలా చర్చిస్తామంటూ టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ మనోహర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు.
-
స్పీకర్‌తో టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: సమగ్రసమాచారం లేని విభజన బిల్లుపై సభలో ఎలా చర్చిస్తామంటూ టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ స్పీకర్ మనోహర్ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు పి.అశోక్ గజపతిరాజు, పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కేఈ ప్రభాకర్ తదితరులు ఆయన్ను కలిశారు. తాము రూపొందించిన బిల్లు అసమగ్రంగా ఉందని, త్వరలో పూర్తి వివరాలతో మరో బిల్లు పంపుతామని కేంద్రం రాష్ట్ర సీఎస్‌కు సమాచారమిచ్చినట్లు వార్తలొచ్చాయని, అందు వల్ల బిల్లును వెనక్కు పంపాలని కోరారు.
ఒకవేళ చర్చకు చేపడితే సమగ్రత లోపంపై రూలింగ్ కోరతామన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని స్పీకర్ చెప్పారు. కాగా కేంద్రం రూపొందించిన బిల్లుకు సవరణలు చేసే అధికారం సీఎంకు లేదని, తాను సమైక్యవాదినని చెప్పుకునేందుకు సవరణల పేరిట సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టీ టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్.ప్రకాశ్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి తదితరులు స్పీకర్‌కు లేఖ రాశారు. టీఆర్ ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలూ ఇదే విషయమై స్పీకర్‌కు లేఖలు రాశారు.