సిగపట్లు వీడి చర్చలకు సిద్ధం
రాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం మాని చర్చలకు సిద్ధపడ్డారు. ఇది శుభపరిణామం. ఒకరినొకరు తిట్టుకుంటే విద్వేషాలు పెరిగడమేగానీ ఫలితం ఏమీ ఉండదు. ఇప్పటికే గత నాలుగేళ్లుగా జరుగుతున్న ఉద్యమాల ఫలితంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి కుంటుపడింది. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కాంగ్రెస్ ప్రకటించడంతో తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని భావించారు. అప్పటి నుంచి వారు అనేక విధాల ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అదుగో ఇదుగో అంటూ కాంగ్రెస్ పార్టీ నాన్చుతూ వచ్చింది. రెండో ఎస్ఆర్సి - పార్టీల అభిప్రాయాలు - ఏకాభిప్రాయం - చర్చల ప్రక్రియ - తెలంగాణకు కాల నిర్ణయం లేదు - వారం అంటే ఏడు రోజులు కాదు - నెల అంటే 30 రోజులు కాదు - సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోంది - అది కీలక సమస్య - సంప్రదింపులు - ప్రాంతాల మనోభావాలు - చిన్న రాష్ట్రాల సమస్య తలెత్తే ప్రమాదం ..... అని అనేక సాకులు చెప్పు కుంటూ కాలం వెళ్లబుచ్చింది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్లో కదలిక వచ్చింది. ఎన్ని ఆందోళనలు జరిగినా పట్టీ పట్టనట్లు వ్యవహరించిన కాంగ్రెస్ ఆదరాబాదరాగా యుపిఏ నేతలను సమావేశ పరిచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం పొందింది. ఆ తరువాత సిడబ్ల్యూసిని సమావేశపరిచింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు - పది జిల్లాలతో ప్రత్యేక తెలంగాణగా రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించేశారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ - పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని ప్రకటించారు. రాష్ట్రంలో పరిస్థితి కాస్త మెరుగుపడిందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ఒక్కసారిగా బాంబు పేల్చింది. వారికి కావలసింది రాష్ట్ర ప్రయోజనం కాదని, సీట్లు, ఓట్లు అన్న విషయం స్పష్టమైపోయింది. నదీజలాలు, ఆస్తులు, అప్పులు, సీమాంధ్రకు రాజధాని .....వంటి కీలక అంశాలకు సంబంధించి స్పష్టతలేకుండా తాంబూలాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లు రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ఓ ప్రకటన చేసేశారు.
విభజన ప్రకటనతో సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. రాజకీయాలకు అతీతంగా, నాయకులతో సంబంధంలేకుండా ప్రజలే ఉద్యమించారు. కేంద్ర మంత్రులను, రాష్ట్ర మంత్రులను, ఎంపిలను, ఎమ్మెల్యేలను నిలదీశారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క ఉద్యోగులు కూడా సమైక్యాంధ్ర కోసం సమ్మె చేయడం ప్రారంభించారు. రోజురోజుకు ప్రజల నుంచి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి ఎక్కువైపోయింది. మరో పక్క ఇంతకాలం ఉద్యమం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం పొందే సమయంలో సీమాంధ్రులు ఉద్యమించడం పట్ల తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇరు ప్రాంతాల నేతలు, ఉద్యోగులు, ప్రజలు ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటున్నారు. హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది.
ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన ప్రకటన వల్ల తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు ఈ నెల 19న సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశానికి ఇరు ప్రాంతాల నుంచి పదిమంది చొప్పున నేతలు హాజరు కానున్నారు. సమావేశంలో అన్ని విషయాలను చర్చించి మంచి ఆలోచనలు వస్తే వాటిని అమలు చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. రెండు ప్రాంతాల నేతలు కలిసి కూర్చొని చర్చించుకుందామన్న మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డిలు చేసిన ప్రతిపాదనకు మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విభజన విషయంలో రెండు ప్రాంతాలకు సంబంధించిన కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.