సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరనున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు పయనమవుతున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ నేతలతో కలసి హస్తినకు చేరుకున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు, పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమ, మంగళవారాల్లో వేర్వేరుగా ఢిల్లీకి చేరుకోనున్నారు.
ఎంపీలు, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలంతా పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తయ్యే వరకు ఢిల్లీలోనే మకాం వేయాలని భావిస్తున్నారు. కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి సూచనల మేరకు తెలంగాణ ప్రాంత నేతలు వేర్వేరుగా భేటీలు కావడంతోపాటు అవసరమైతే యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలసి తెలంగాణకు మద్దతును కూడగట్టాలని యోచిస్తున్నారు. రాజ్యసభ, లోక్‌సభల్లో తెలంగాణ బిల్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆమోదం పొందేందుకు సహకరించాలని యూపీఏయేతర పార్టీల నేతలనూ కలవాలని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో బీజేపీ నుంచి ఇబ్బందులు రావచ్చని భయపడుతున్న తెలంగాణ నేతలు, బీజేపీ వ్యతిరేకించినా పార్లమెంటులో గండాన్ని గట్టెక్కించుకొనేందుకు ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవాలన్న భావనతో ఉన్నారు. పార్లమెంటులో బిల్లుకు తగిన మద్దతు కూడగట్టే పనిని, ఫ్లోర్ కోఆర్డినేషన్‌ను కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలు చేస్తున్నా, తమవంతు బాధ్యతగా ఆయా పార్టీల నేతలను కలిస్తే ఎక్కువ ప్రయోజనముంటుందని తెలంగాణ నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రపతితో భేటీకి సీమాంధ్ర నేతల సన్నాహాలు
మరోవైపు, సీమాంధ్ర నేతలు కూడా హస్తిన బాటపడుతున్నారు. రాష్ట్రపతిని కలిసి విభజన బిల్లును అసెంబ్లీ తిరస్కరించినందున దానిని పార్లమెంటుకు పంపేందుకు అనుమతించరాదని కోరాలని భావిస్తున్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంటు కోసం వారు లేఖ రాశారు. రాష్ట్రపతి ఇచ్చే సమయాన్ని బట్టి ఈనెల 4న లేదా 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. అంతకంటే ముందే ఇతర నేతలు హస్తినకు చేరుకోనున్నారు. ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఇప్పటికే సీఎం కిరణ్, సీమాంధ్ర మంత్రులు పలుసార్లు సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో మౌనదీక్ష, రాష్ట్రపతి కార్యాలయం వరకు పాదయాత్ర చేయడం వంటి కార్యక్రమాలపై ఆలోచనలు సాగిస్తున్నారు. కాగా, సీఎం 4న ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారని పార్టీనేతలు చెబుతున్నారు.
నేడు రాష్ట్రపతితో బాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం ఏడున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ కానున్నారు. దీనికోసం బాబుతో సహా పార్టీ ఎమ్మెల్యేలు ఉదయం 6.40 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్న తరువాత పలువురు జాతీయ పార్టీ నేతలను కలిసి తెలంగాణ విషయంపై తమ పార్టీ అభిప్రాయాలను వారి దృష్టికి తీసుకొస్తారు. ఆయనతోపాటు పార్టీ నేతలు మంగళవారం కూడా ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక ‘ఢిల్లీ’మే సవాల్!
Published Mon, Feb 3 2014 1:28 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement