‘హోదా’ సాధించేదాకా ఆగదు పోరాటం | fight will continue to get special status to ap, says ys jagan mohan reddy at delhi dharna | Sakshi
Sakshi News home page

‘హోదా’ సాధించేదాకా ఆగదు పోరాటం

Published Tue, Aug 11 2015 1:57 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘హోదా’ సాధించేదాకా ఆగదు పోరాటం - Sakshi

‘హోదా’ సాధించేదాకా ఆగదు పోరాటం

- ఢిల్లీ ధర్నాలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్
- కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు కలిసికట్టుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి
- బాబు స్వార్థ ప్రయోజనాలకోసం ఏపీ ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు
- బీజేపీ నేతలది ఎన్నికలకు ముందో మాట, ఇప్పుడో మాట
- హోదాకు 14వ ఆర్థిక సంఘం అడ్డుపడుతోందని అబద్ధాలు చెబుతున్నారు
- అగ్గి నేనే పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అన్నట్లుగా రాహుల్‌గాంధీ వైఖరి
- మునికోటి ఆత్మాహుతి ప్రజల భావోద్వేగానికి, ఆవేదనకు అద్దం పడుతోంది
- హోదావల్ల వచ్చే ప్రయోజనాలు మన నేతలకు తెలియకపోవడం మన ఖర్మ
- ప్రత్యేకహోదా వచ్చేవరకూ పోరాడతాం..     ఈ నెల 28న ఏపీ బంద్
 
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం మొదలుపెట్టిన పోరాటం ఇంతటితో ఆగదని, హోదా సాధించేవరకు కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కలిసికట్టుగా రాష్ట్రానికి అన్యా యం చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్లమెంటు తలుపులు మూసేసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తే... ప్రత్యేకహోదాపై బీజేపీ నేతలు అప్పుడో రకంగా, ఇప్పుడో రకంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టారని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసులో విచారణ జరగకుండా తప్పించుకోవడానికే ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ లైన్’లో వచ్చిన కథనాన్ని ప్రస్తావించారు. తిరుపతిలో మునికోటి అనే యువకుని ఆత్మాహుతి ప్రత్యేకహోదా కోసం రాష్ట్ర ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు, ఆవేదనకు అద్దం పడుతుందన్నారు. అయినా బాబు ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావడానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి 3 రోజులు ముందుగా.. అంటే ఈనెల 28న ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో బాబును కడిగేస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా సాధనకోసం సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో చేసిన ధర్నాలో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ధర్నాలో జగన్

ప్రసంగం సాగిందిలా...

నిరంకుశ వైఖరితో విభజించారు

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీఇచ్చి నెరవేర్చకపోవడంతో మనకు జరిగిన అన్యాయంపై స్వరం వినిపించేందుకు ఢిల్లీకి వచ్చాం. అసలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే 19 నెలలు వెనక్కువెళ్లాలి. రాష్ట్రాని విడగొట్టవద్దని మేం మొత్తుకుని చెప్పాం. 60 శాతం ప్రజలు అంగీకరించకపోయినా నిరంకుశ వైఖరితో రాష్ట్రాన్ని విభజించారు. లోక్‌సభ తలుపులు మూసి మరీ విభజన బిల్లుకు ఆమోదముద్ర వేయించారు.

రాష్ట్రాన్ని విభజించే బిల్లు ఆనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పుడు.. విభజించవద్దన్నందుకు మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. లైవ్‌టీవీ ప్రసారాన్ని కూడా కత్తిరించిన బ్లాక్‌డేను రాష్ట్ర ప్రజలింకా మరిచిపోలేదు. విభజన బిల్లుకు అప్పటి ప్రతిపక్షం బీజేపీ, టీడీపీ(చంద్రబాబు) కూడా మద్దతు ఇచ్చాయి కాబట్టే.. బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభ దాకా వెళ్లింది. రాజ్యసభలో మేం లేము. అక్కడ సుదీర్ఘంగా జరిగిన చర్చ మధ్య.. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అన్న పదాన్ని పెట్టారు. ‘రాష్ట్రం విడిపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తోంది కాబట్టి.. సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం మాకు తెలుసు.

హైదరాబాద్‌ను 60 సంవత్సరాలుగా అన్ని ప్రాంతాల ప్రజలు కలిసికట్టుగా నిర్మించారు. అలాంటి హైదరాబాద్ దూరమైతే  70 శాతం పరిశ్రమలు దూరమవుతాయి. 95 శాతం సేవలు.. అంటే మొత్తం సాఫ్ట్‌వేర్ రంగం దూరమవుతుంది. కాబట్టే.. సీమాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక హోదా కల్పిస్తాం. దానివల్ల పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి’ అని సాక్షాత్తూ అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు. అదే రాజ్యసభలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సభ్యులు.. ఐదు సంవత్సరాలు సరిపోదు.. 10 ఏళ్లు కావాలని డిమాండ్ చేశారు.

చంద్రబాబు పార్టీ రాష్ట్ర విభజనకు మద్దతు తెలిపింది. విభజన బిల్లు మీద తామే తొలి ఓటు వేశామని టీడీపీ చెప్పడం మనందరికీ బాగా గుర్తుంది. సాక్షాత్తూ అధికార, ప్రతిపక్షాలు కలిసి ఒక్కటై రాష్ట్రాన్ని విడగొడుతున్నాం.. కానీ ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు మాటిచ్చాయి. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఆ మాటను ఇప్పుడు గౌరవించకపోతే సామాన్యులమైన మనం ఎవరి వైపు చూడాలి? భారతదేశంలో రాజ్యాంగం ఉందా? లేదా? అని అడగాల్సి వస్తుంది.

హోదాతో రెండు ప్రయోజనాలు...
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాల గురించి నేతలకు కూడా తెలియకపోవడం దురదృష్టకరం. ప్రత్యేకహోదా వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి.. కేంద్రం నుంచి వచ్చే సహాయంలో 90 శాతం గ్రాంటు, 10 శాతం రుణం అవుతుంది. గ్రాంటుగా వచ్చే సహాయాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ప్రత్యేక హోదా లేకుంటే... కేంద్రం నుంచి వచ్చే గ్రాంటులు కేవలం 30 శాతమే. మిగతా 70 శాతాన్ని రుణంగా ఇస్తారు. తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 90 శాతం గ్రాంటుగా వస్తే.. ఆమేరకు నిధులు ఊరికే రాష్ట్రానికి వస్తాయి. రెండు.. రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి పలు రకాల పన్నులు, సుంకాల నుంచి మినహాయింపు వస్తుంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వస్తే ఉత్సాహవంతులు, పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి వస్తారు. ఫలితంగా పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయి. యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయి. రాష్ట్రం బాగుపడుతుంది.

కానీ పార్టీలు ఏం చేస్తున్నాయి?
కానీ ప్రత్యేక హోదా కల్పించే విషయంలో పార్టీలు ఎన్నికలప్పుడు ఏమన్నాయో, ఇప్పుడు ఏమంటున్నాయో చూస్తుంటే బాధ కలుగుతోంది. రాహుల్ గాంధీ ఇటీవల రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్రం విడిపోయి 15 నెలలు అవుతుంటే.. కనీసం ఒక్కరోజు కూడా ఆయన రాష్ట్రం ముఖం చూడలేదు. పార్లమెంట్‌లో కూడా ఒక్కరోజు కూడా ప్రత్యేకహోదా గురించి ప్రశ్నించిన పాపానపోలేదు. అలాంటాయన ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి.. ప్రత్యేకహోదా కోసం పోరాడతానంటారు.

ఆయన తీరు ఎలా ఉందంటే.. అగ్గి నేనే పెట్టాను.. నీళ్లు కూడా నేనే పోస్తాను అన్నట్లుగా ఉంది. ఆ రోజు రాష్ట్రాన్ని కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తుంటే... ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే 10 ఏళ్లు ఇస్తామని గట్టిగా చెప్పింది. మేనిఫెస్టోలో కూడా పెట్టింది. కానీ ఎన్నికల తర్వాత మాట మారుస్తున్నారు. బిహార్, ఒడిశా కూడా అడుగుతున్నాయని అడ్డుపుల్ల వేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో హామీ ఇచ్చినప్పుడు ఒడిశా, బిహార్ లేవా?

14వ ఆర్థిక సంఘం మీద నెపం
ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపడం లేదని ప్రతి సందర్భంలోనూ బీజేపీ మంత్రులు, సీఎం చంద్రబాబు, టీడీపీ మంత్రులు చెబుతున్నారు. అందువల్లే ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కావడం లేదంటున్నారు. కానీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వమని, ఇవ్వద్దని సిఫారసు చేసే అధికారం ఆర్థిక సంఘానికి లేదు. కేంద్రానికి పన్నుల ద్వారా సమకూరే ఆర్జనను రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలనే అంశాన్ని సూచించడమే దాని పని. ప్రణాళికేతర గ్రాంట్లు, రుణాలు ఎలా ఇవ్వాలో సిఫారసు చేస్తుందేతప్ప, ప్రణాళికా వ్యయంలో ఉన్న లోటు గురించి, ప్రణాళికా గ్రాంట్లు గురించి ఎలాంటి సిఫారసులు చేయదు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందే సాధారణ సాయం, ప్రత్యేక సాయం గురించి ఆర్థిక సంఘాలు ఎలాంటి సిఫారసులు, సూచనలు చేయవు. ఆర్థికశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్న మేరకు.. ప్రత్యేక హోదా ఉన్న, లేని రాష్ట్రాల మధ్య వ్యత్యాసం చూపించడం గతంలోనూ ఆర్థిక సంఘాలు చేయలేదు. (ఈ మేరకు జగన్ అందులో పేర్కొన్న విషయాన్ని చదివి వినిపించారు). ప్రత్యేకహోదా కల్పన మీద నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నేతృత్వంలోని నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కే పూర్తి అధికారాలున్నాయి. కానీ నెపాన్ని 14వ ఆర్థిక సంఘం మీద నెట్టుతున్నారు.

చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?
పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే పార్టీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తూ.. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న  ప్రత్యేక హోదా ఉపసంహరించుకొనే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారని మంత్రి సమాధానం ద్వారా స్పష్టమైంది. అంటే ప్రత్యేక హోదా అమల్లో ఉన్నట్లే.

మరి ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ, టీడీపీకి వచ్చే నష్టం ఏమిటి? రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా ఇవ్వమని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి పంపిద్దామని బాబును అడిగాం. కానీ ఆయన స్పందించలేదు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి.. కేంద్రాన్ని గట్టిగా నిలదీద్దామని అడిగినా ఉలుకూ పలుకూ లేదు. హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ మంత్రులను ఎందుకు కొనసాగిస్తున్నారు? అని అడిగినా జవాబు లేదు.

లంచాలపై కక్కుర్తితో..
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే 300 టీఎంసీలకు పైగా నీటిని వాడుకొని రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చు. గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు తీసుకెళ్లచ్చు. కానీ చంద్రబాబు లంచాలకు కక్కుర్తిపడి పోలవరాన్ని పక్కనబెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో దినేష్‌కుమార్.. రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన నడుస్తున్నాయని, ఎన్నిసార్లు చెప్పినా పనులు ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డిపెడుతూ కేంద్రం లేఖ రాసింది.

కాంట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని లేఖలో రాస్తే, ఆ కాంట్రాక్టర్‌కు చంద్రబాబు సీఎం అయ్యాక రూ. 290 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా ఇచ్చారు. మరో రూ. 220 కోట్లు పనులు చేశారని ఇచ్చేశారు. పోలవరం ప్రాజెక్టు మీద మీరు చూపిస్తున్న శ్రద్ధ ఏమిటి చంద్రబాబూ? ఈ కాంట్రాక్టర్ బాగా పనిచేయడం లేదని ఇప్పుడు చెబుతున్నావు.. మరి ఆ విషయం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిన నాడు గుర్తుకు రాలేదా? పోలవరం పనులు చేస్తున్నది టీడీపీకి చెందిన ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కంపెనీ కాదా?

పోలవరం ప్రాజెక్టు పనులను నత్తనడకన చేయిస్తారు. నత్తనడకన పనులను సాకుగా చూపించి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తారు. దాని నుంచి కోట్లకు కోట్లు పిండుకుంటారు. ఇసుక కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదు. మాఫియా రూపంలో దోచుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు తన సొంతానికి ప్రత్యేక హోదా ఇచ్చుకున్నారు. కోట్లు కొల్లగొడుతున్నారు. స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేశారు.

పోరుబాటలో వైఎస్సార్‌సీపీ
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ మొదటినుంచీ పోరాడుతూనే ఉంది. మంగళగిరిలో రెండు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టింది. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. తిరుపతిలో కోటి అనే యువకుడు కాల్చుకొని చనిపోయాడు. 67 మంది ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలతో ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తున్నాం. వేల మంది 40 గంటలపాటు రైళ్లలో ప్రయాణించి ఢిల్లీ వచ్చి నడిరోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రానున్న రోజుల్లో మరింత ఉధృతం చేస్తాం.

పోరాటం కొనసాగింపులో భాగంగా చంద్రబాబు, కేంద్రం మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు.. శాసనసభ సమావేశాలు ప్రారంభానికి మూడు రోజుల ముందు అంటే ఈ నెల 28న ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నాం. శాసనసభలో చంద్రబాబును గట్టిగా కడిగేస్తాం. ఈ పోరాటం ఇంకా ముందుకు సాగుతుంది. ఇంతదూరం వచ్చి ధర్నా చేశాం. ఇక్కడనుంచి పార్లమెంట్ కొంచెం దూరమే. మనమంతా కూడా పార్లమెంట్‌కు మార్చ్ చేద్దాం. మనకు జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్‌లో కూడా వినిపిద్దాం. రండి.. అందరం కలిసి పార్లమెంట్ వైపు నడుద్దాం..!
 
‘ఓటుకు కోట్ల’ నుంచి బయట పడేందుకే..
 ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు అడగడం లేదు? కేంద్రంలోని వారి మంత్రులను ఎందుకు ఉపసంహరించుకోవడం లేదు? అని నాకు వచ్చిన అనుమానమే ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘బిజినెస్ లైన్’కూ వచ్చింది. ఈమేరకు కథనం ప్రచురించింది. ఓటుకు కోట్లు పెట్టి కొనుగోలు చేస్తూ వీడియో టేపుల్లో పట్టుబడ్డారు.

ఎమ్మెల్సీని గెలిపించుకోవాలనే దిక్కుమాలిన ప్రయత్నంలో ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను రూ. 150 కోట్లకు బేరమాడి, ఒక ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా వీడియో టేపుల్లో పట్టుబడిన విషయాన్ని కథనంలో ప్రస్తావించారు. ఓటుకు కోట్ల కేసులో విచారణ జరగకుండా తప్పించుకోవడానికి చంద్రబాబు.. ప్రత్యేక హోదా గురించి గట్టిగా కేంద్రాన్ని నిలదీయడం లేదని స్పష్టంగా రాశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టినట్లు నేను చెబుతున్నది కాదు.. ‘బిజినెస్ లైన్’ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement