రాష్ట్ర భవిష్యత్‌ కోసమే బంద్‌ | AP Bundh Is For Good Future Says Majji Srinivasa Rao YSRCP | Sakshi
Sakshi News home page

రాష్ట్ర భవిష్యత్‌ కోసమే బంద్‌

Published Mon, Apr 16 2018 7:45 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

AP Bundh Is For Good Future Says Majji Srinivasa Rao YSRCP - Sakshi

మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు  

విజయనగరం మున్సిపాలిటీ : రాష్ట్ర భవిష్యత్‌ కోసం, ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా సాధనకు సోమవారం చేపడుతున్న రాష్ట్ర బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక సత్య కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న బంద్‌కు బాధ్యత గల ప్రతి పక్షంగా, హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు.

బంద్‌ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు, స్కూల్స్‌ను మూసివేయించాలన్నారు. రవాణా వ్యవస్థను నిలిపివేయాలన్నారు. ఆటో డ్రైవర్లు బంద్‌కు సహకరించాలని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు. తెలుగు ప్రజలందరికీ కావాల్సిన హోదా కోసం చేస్తున్న పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తోన్న సిబ్బంది పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తూ ప్రజలను, రాష్ట్రాన్ని మోసం చేస్తున్నా రన్నారు.

నాలుగేళ్ల కిందట ఇవ్వాల్సిన హోదాను కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.సూర్యనారాయరాజు, పార్టీ నాయకులు పిళ్లా విజయ్‌కుమార్, కౌన్సిలర్‌ గాడు అప్పారావు, మాజీ కౌన్సిలర్‌ పొట్నూరు వెంకటి, పట్టణ నాయకులు పిలకా శ్రీను, ముల్లు త్రినాథ్, ఇసరపు శేఖర్, తురాల శ్రీను, గడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement