ఏపీ బంద్‌ సంపూర్ణం | AP bandh successful all over the state | Sakshi
Sakshi News home page

ఏపీ బంద్‌ సంపూర్ణం

Published Tue, Apr 17 2018 1:13 AM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

AP bandh successful all over the state - Sakshi

సోమవారం బంద్‌ సందర్భంగా విజయవాడ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు

సాక్షి, నెట్‌వర్క్‌/అమరావతి: టీడీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినా.. నోటీసులిచ్చి బెదిరించినా.. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసినా కూడా ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా సోమవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌ సంపూర్ణంగా విజయవంతమైంది. రాష్ట్ర సర్కార్‌ బెదిరింపులను సైతం ధిక్కరించి ఒక్కటైన జనం ప్రత్యేక హోదా కోసం దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, జనసేనతో పాటు ప్రజా, విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా హోదా కోసం కదంతొక్కాయి.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ప్రజా సంకల్ప యాత్రకు విరామం ఇచ్చి బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయన పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, బైక్‌ ర్యాలీలతో రాష్ట్రం దద్దరిల్లింది. హోదా నినాదంతో హోరెత్తింది. ఆందోళనకారులు ధర్నాలకు దిగడంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు బ్యాంకులు, సినిమా హాళ్లు కూడా మూతబడ్డాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఆందోళనకు దిగడంతో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. హోదా సాధించే వరకూ విశ్రమించబోమని ఆందోళనకారులు ప్రతినబూనారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. స్వల్ప ఘటనలు మినహా అన్ని జిల్లాల్లోనూ బంద్‌ ప్రశాంతంగా జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు తదితర జిల్లాల్లో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 

విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు మధు, రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ నేతలు వంగవీటి, యలమంచిలి రవి తదితరులు 

ఉనికి కోసం టీడీపీ నాటకాలు..
బంద్‌కు మద్దతివ్వని టీడీపీ.. మరోవైపు సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో మాత్రం పోటీ ర్యాలీ నిర్వహించింది. బస్టాండ్‌ సెంటర్‌లో ఇరుపక్షాలు ఎదురవ్వడంతో ఉద్రిక్తత తలెత్తింది. వివిధ సంఘాలు, పక్షాలు చేస్తున్న ఆందోళనలో కలవకుండా.. కేవలం ఉనికి కోసమే టీడీపీ ఈ విధంగా నాటకాలు ఆడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టే ప్రత్యేక హోదాపై చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమౌతోందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. వేకువజాము నుంచి తాము బంద్‌ నిర్వహిస్తుంటే.. అధికార పార్టీ నాయకులు ఈ విధంగా అడ్డు తగలడం ఎంతవరకు సబబు అని విపక్ష నాయకులు ప్రశ్నించారు. ఒకవైపు హోదా కోసం రాజీ లేని పోరాటం చేస్తానంటూనే.. మరోవైపు ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆంక్షలు విధించడం, నిరసనకారులను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. 

హోదా కోసం రోడ్డెక్కిన జనం..
ప్రత్యేక హోదా కోసం కృష్ణా జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన గళం వినిపించారు. ప్రత్యేక హోదా సాధన సమితితో పాటు వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, ప్రజా, పాత్రికేయ సంఘాలు, న్యాయవాదులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే విజయవాడ ప్రధాన బస్టాండ్‌ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ నేతలు పార్థసారథి, మల్లాది విష్ణు, బొప్పన భవకుమార్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి.మధు, రామకృష్ణ ధర్నాకు దిగి బస్సులను అడ్డుకున్నారు. నగరంలోని బెంజ్‌సర్కిల్‌ వద్ద లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ర్యాలీ చేపట్టింది. జగ్గయ్యపేటలో సామినేని ఉదయభాను రిక్షా తొక్కి నిరసన తెలిపారు.

మచిలీపట్నంలో ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నానిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీయూడబ్ల్యూజే బంద్‌కు మద్దతు ప్రకటించడంతో పలువురు జర్నలిస్టులు నిరసనల్లో పాల్గొన్నారు. ఇక ప్రత్యేక హోదా నినాదాలతో గుంటూరు జిల్లా మార్మోగింది. తాడికొండలో వైఎస్సార్‌సీపీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. సత్తెనపల్లిలో రోడ్డుపైనే వంటావార్పు చేశారు. ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు నేతలు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున తదితరుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

సంక్షేమ శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు తలకిందులుగా నిరసన వ్యక్తం చేయగా.. ఏఐఎస్‌ఎఫ్‌ నేతలు మోదీ కేడీ పేరుతో కబడ్డీ ఆడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద జర్నలిస్టులు దీక్షలో కూర్చున్నారు. సంతనూతలపాడులో రోడ్డుపైనే వంటావార్పు చేపట్టి అన్నదానం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి, నేతలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, ద్వారకానాథ్‌ తదితరులు ర్యాలీలు, ధర్నాలు చేపట్టి నిరసన తెలియజేశారు. 

ప్రత్యేక హోదా మా హక్కు అని నినదిస్తూ  నెల్లూరు నగరంలో భారీ ౖబైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు 

పోలీసులతో అణిచివేసేందుకు యత్నం..
తూర్పు గోదావరి జిల్లాలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. విద్యా, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. బంద్‌ కారణంగా నన్నయ, జేఎన్‌టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. కాకినాడలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్సీ పిల్లి సుభాశ్‌ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మీ, పినిపే విశ్వరూప్, మోషేన్‌ రాజు, కందుల దుర్గేష్‌ నేతృత్వంలో నిరసనలు మిన్నంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకారులు కదంతొక్కారు. ఏలూరులో ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఆధ్వర్యంలో బంద్‌ విజయవంతమైంది. నరసాపురంలోని జాతీయ రహదారిపై ముదునూరి ప్రసాదరాజు తదితరులు రాస్తారోకో చేపట్టి హోదా గళాన్ని వినిపించారు. గోపాలపురంలో హైవేపై బైఠాయించిన ఆందోళనకారులు వాహన రాకపోకలను అడ్డుకున్నారు.

పాలకొల్లులో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. నేతలు తెల్లం బాలరాజు, మేకా శేషుబాబు తదితరులు ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు. విశాఖ జిల్లాలోని ఏయూ పరిధిలో జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేశారు. మద్దిలపాలెం జంక్షన్‌లో వామపక్షాల నాయకులతో కలిసి వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. నక్కపల్లి జాతీయ రహదారిపై అఖిలపక్ష నాయకులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. చోడవరంలో వందలాది మంది విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో రాస్తారోకో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ, వామపక్ష, జనసేన పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

శ్రీకాకుళంలో ఆదివారం రాత్రి పలువురిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళంలో వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో నిరసనకారులు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బైఠాయించి హోదా నినాదాలు చేశారు. చిలకపాలెంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యేలు కళావతి, కంబాలో జోగులు, నేతలు ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు రోడ్లపై ధర్నాలకు దిగారు. విజయనగరం జిల్లాలో పోలీసులు వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనల్లో ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్ప శ్రీ వాణి తదితరులు పాల్గొన్నారు. 

విశాఖలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, వివిధ పార్టీలు, సంఘాల నేతలు 

రాస్తారోకోలు.. పిండప్రదానాలు
చిత్తూరు జిల్లా తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,400 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరుపతిలో బంద్‌ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ఓ బైక్‌కు నిప్పు పెట్టగా.. దీన్ని సాకుగా తీసుకొని నలుగురు వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట వామపక్షాలు మోదీ శవయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రగిరిలో ఆందోళనకారులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నిరసనల్లో వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, సీపీఐ, సీపీఎం నేతలు రామానాయుడు, కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

అనంతపురం క్లాక్‌ టవర్‌ వద్ద పది తలల మోదీ దిష్టిబొమ్మను బాణాలతో కాల్చారు. పార్లమెంట్‌ మెట్ల మీద ఫొటోలకు ఫోజులివ్వడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదని నేతలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి దుయ్యబట్టారు.  వైఎస్సార్‌ జిల్లా కడపలో వైఎస్సార్‌సీపీ నేత కె.సురేష్‌బాబు ఆధ్వర్యంలో శ్రేణులు ఆర్టీసీ బస్టాండుకు చేరుకుని ధర్నాకు దిగాయి. బస్టాండ్‌ ఆవరణలో క్రికెట్‌ ఆడి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అంజద్‌బాష బైక్‌పై కడప నగరంలో తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. కృష్ణాపురం, రాయచోటి రింగ్‌రోడ్డు వద్ద ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ప్రధాని మోదీకి పిండ ప్రదానం చేశారు.

రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. బద్వేలులోని నాలుగు రోడ్ల కూడలిలో వంటావార్పుతో పాటు కబడ్డీ ఆడి నిరసన తెలిపారు. ఆందోళనల్లో నేతలు ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో జరిగిన నిరసనలతో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన బస్సులు నిలిచిపోయాయి. ప్రజలు బంద్‌కు పూర్తి స్థాయిలో సహకరించడంతో ఆటోలు కూడా తిరగలేదు. రాయలసీమ వర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఎమ్మిగనూరులో భారీ బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. పాలకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి విగ్రహానికి నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, జయరాం, ఐజయ్య, నేతలు బీవై రామయ్య, హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్ర, వామపక్షాల నేతలు ఎంఏ గఫూర్, కె.ప్రభాకర్, గిడ్డయ్య తదితరులు ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించి హోదా ఆవశ్యకతను తెలియజేశారు. 

శిబిరం నుంచే బంద్‌ను పర్యవేక్షించిన వైఎస్‌ జగన్‌
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రత్యేక హోదా సాధన కోసం చేస్తున్న ఆందోళనలో భాగంగా సోమవారం జరిగిన రాష్ట్ర బంద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన శిబిరం నుంచే పర్యవేక్షించారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ బంద్‌ సందర్భంగా తన పాదయాత్రకు విరామం ప్రకటించి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడు క్రాస్‌ వద్ద బస చేశారు. వైఎస్సార్‌సీపీ, ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తా, ఇతర ప్రజా సంఘాలు ఈ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బంద్‌ జరిగిన తీరును జగన్‌ గంట గంటకూ స్వయంగా పర్యవేక్షించారు. ఆయా జిల్లాల పార్టీ నాయకులతో ఫోన్‌లో మాట్లాడి బంద్‌ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా బంద్‌ జరిగేలా పలు సూచనలు చేశారు. పార్టీ జిల్లా నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొని జయప్రదం చేసేలా చూడాలని కోరారు. అనంతరం బంద్‌ను జయప్రదం చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు వైఎస్‌ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరిచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement