
బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం రూరల్: ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్త కాకి దుర్గారావు(55) అనే గిరిజనుడు గుండెపోటుతో మృతిచెందాడు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దుర్గారావు బంద్‌లో పాల్గొన్నాడు. కార్యకర్తలు, నాయకులతో కలసి సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ తీరును నిరసిస్తూ నినాదాలు చేస్తుండగా పోలవరం సీఐ ఎం.రమేశ్‌బాబు ఆధ్వర్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో దుర్గారావు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
బాలరాజును అదుపులోకి తీసుకొని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ప్రధాన సెంటర్ నుంచి పోలీస్‌స్టేషన్‌కు అర కిలోమీటర్ పైనే ఉంది. నినాదాలు చేస్తూ కార్యకర్తలందరూ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో కొంతమందిని స్టేషన్ లోపలే ఉంచి గేటు మూసివేశారు. దీంతో దుర్గారావు గుండెపోటుతో ఒక్కసారిగా స్టేషన్ ప్రాంగణంలోనే పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని బుట్టాయగూడెం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించారు. వైద్యం పొందుతూ దుర్గారావు మరణిం చాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
దుర్గారావు మృతికి జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: రాష్ట్ర బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ కార్యకర్త దుర్గారావు పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోదా కావాలని ఉద్యమిస్తూ దుర్గారావు మృతి చెందడం విషాదకరమని ఆయన ట్వీట్టర్ ట్వీట్ చేశారు. దుర్గారావు కుటుంబ సభ్యులకు జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment