పశ్చిమలో నిరసనల హోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్టణంలో గురువారం తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీని విఫలం చేయడానికి విమానాశ్రయంలో ఆయనను నిర్భందించడాన్ని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు వామపక్ష పార్టీలు, జనసేన నాయకులు శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరులో నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలు తెలిపారు. భీమవరంలోని యనమదుర్రు డ్రెయిన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిష్టిబొమ్మను నిమజ్జనం చేశారు. పోలవరం, నరసారం, తణుకు, పాలకొల్లు, గోపాలపురం, ఆచంట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. చింతలపూడిలో బైక్ ర్యాలీ నిర్వహించగా, కొవ్వూరులో భారీ ర్యాలీ జరిపారు. నరసాపురంలో పార్టీ కార్యకర్తలు పోలీసు వ్యాన్‌కు అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం, ఆచంట నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తణుకులో జరిగిన నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు కారుమూరి నాగేశ్వరరావు సొమ్మసిల్లిపడిపోవడంతో కొంతసేపు నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందారు.