
సాక్షి,విశాఖసిటీ: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ నెరవేర్చాలనే డిమాండ్‌తో అఖిలపక్షాలు చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన, కాంగ్రెస్ పార్టీలు, ఏపీ హోదా సాధన సమితితోపాటు విద్యా, విద్యార్థి సంఘాలు, వాణిజ్య, వ్యాపార సంఘాలతో పాటు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌తో నగరంతో పాటు జిల్లా స్తంభించిపోయింది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుంచే రహదారులపైకి అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు వచ్చి నిరసనలు తెలిపారు. మద్దిలపాలెం జాతీయ రహదారిపై వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వై.విజయసాయిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తైనాల విజయ్‌కుమార్, గుడివాడ అమర్‌నాథ్, నియోజకవర్గాల సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ, సీపీఎం నగర కార్యదర్శి గంగారాం సహా వివిధ పార్టీల నేతలు పాల్గొని జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జగదాంబ జంక్షన్ వద్దకు చేరుకొని నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులు ఆధ్వర్యంలో అన్ని పార్టీల నేతలు హోదా ర్యాలీ నిర్వహించారు. జగదాంబ జంక్షన్ నుంచి సరస్వతీ పార్క్ మీదుగా అంబేడ్కర్ విగ్రహం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. దారిలో అక్కడక్కడా తెరిచి ఉన్న దుకాణాలను మూయించారు. డాబాగార్డెన్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా కార్యాలయాలకు వెళ్లి.. ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని కోరుతూ సంస్థలను మూయించివేశారు. జగదాంబ జంక్షన్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో వినూత్న నిరసన ప్రదర్శలు చేపట్టారు.
గాజువాకలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా నిర్వహించారు. జాతీయ రహదారిపై వైఎస్సార్‌సీపీ నేతలు అర్థనగ్నప్రదర్శనలు నిర్వహించి బైఠాయించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాత గాజువాక జంక్షన్‌లో కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించగా, వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలు పొర్లు దండాలు పెట్టారు. సీపీఎం, వైఎస్సార్‌సీపీ మహిళా ప్రతినిధులు రోడ్డుపైనే కబడ్డీ ఆడారు. సీపీఎం కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించారు.
భీమిలిలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం ఆరు గంటలనుంచే బస్సులు, ఆటోలు తిరగలేదు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేస్తూ బంద్‌కు మద్దతు తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలు, కార్యాలయాలు సెలవు ప్రకటించాయి. మెయిన్‌రోడ్డు గంటస్తంభం వద్ద వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావ్, ఇతర అఖిల పక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి విజయనిర్మల, ఇతర పార్టీల ఆధ్వర్యంలో కొమ్మాది కూడలి, కార్ షెడ్ కూడలి, మధురవాడ, ప్రధాన వాణ్యి కూడలి వేమువలస జంక్షన్‌లో తదితర ప్రాంతాలలో దఫదఫాలుగా రాస్తారోకోలు నిర్వహించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. గ్రామీణ వైద్యుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ప్రకటిస్తూ ర్యాలీ చేపట్టింది.
సింహాచలంలో ఆంధ్రాబ్యాంకు, స్టేట్‌బ్యాంక్, కోఆపరేటివ్ సొసైటీ, దేవస్థానం పరిపాలనా కార్యాలయాన్ని ఆందోళనకారులు మూయించివేశారు. బస్సులు లేకపోవడంతో సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వెలవెలబోయింది. పెందుర్తిలో అన్ని పార్టీల శ్రేణులతో పాటు ఐద్వా తదితర ప్రజాసంఘాల నాయకులు రోడ్డెక్కి హోదాపై తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. పెందుర్తి కూడలి వద్ద వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో భారీ మానవహారం నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యార్థులు, మహిళలు, సామాన్యులు రోడ్లపై బైటాయించి ప్రత్యేకహోదా ప్లకార్డులు ప్రదర్శించారు. ఓ దశలో పోలీసులు, ఆందోళనకారులకు మద్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు తగ్గకపోవడంతో పోలీసులు మిన్నకుండిపోయారు. మరోవైపు బంద్‌ను విచ్చిన్నం చేసేందుకు టీడీపీ నాయకులు తెరచాటు ప్రయత్నాలు చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్తలు సత్తిరామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, సనపల చంద్రమౌళి ఆధ్వర్యంలో గురుద్వారా కూడలిలో రహదారుల దిగ్బంధనం చేశారు. ఊర్వశీ జంక్షన్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు.
మరోవైపు.. జిల్లా అంతటా బంద్ సందర్భంగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, నర్సీపట్నంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ బంద్ విజయవంతమైంది. రాంబిల్లిలో రోడ్డుపై బైఠాయించిన అఖిలపక్ష నాయకులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. మునగపాకలోనూ పోలీసులు జులూం ప్రదర్శించారు. ఆందోళనకారుల్ని రోడ్డుపై నుంచి బలవంతంగా నెట్టేశారు. మాడుగుల నియోజకవర్గంలో బంద్ ఉద్రిక్తంగా మారింది. మాడుగులలో రోడ్డుఅడ్డంగా బంద్‌లో ప్రత్యేక హోదా నినాదాలు చేస్తుంటే ఎస్.ఐ ధనుంజయ్‌తో సిబ్బంది వైఎస్సార్‌సీపీ నాయకులు పెదబాబును, కొట్యాడలను బలవంతంగా తీసుకెళ్లారు.