సాక్షి, అమరావతి: దేశంలో దివ్యాంగుల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్‌సీపీపీ) నాయకుడు, పార్టీ కో ఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పార్టీ దివ్యాంగుల విభాగ సమావేశాన్ని టెలీకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక వేలాదిమంది దివ్యాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు పెన్షన్ ఇస్తూ అండగా నిలుస్తోందని చెప్పారు. 14 రకాల రోగపీడితులు, వైకల్యాలున్న 7,98,352 మందికి నెలకు రూ.255 కోట్లకుపైగా పింఛన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతినెల ఒకటో తేదీనే వలంటీర్ ద్వారా నేరుగా దివ్యాంగుని వద్దకే పెన్షన్ పంపుతున్నట్లు చెప్పారు.
దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచి ఉద్యోగ నియామకాల్లోను, ప్రమోషన్లలోను అవకాశం కల్పిస్తున్నారన్నారు. పార్టీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు కిరణ్‌రాజ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు, జోనల్ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
వినతుల స్వీకరణ
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వరసగా మూడోరోజు బుధవారం కూడా వి.విజయసాయిరెడ్డి గ్రీవెన్స్ డే నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment