తాళాలు వేస్తున్న ఏపీ భవన్ అధికారులు
ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌ల విభజనపై వివాదం
► ‘విభజన’ వాటా ప్రకారం ఆర్‌సీ బంగ్లాను స్వాధీనం చేసుకున్న తెలంగాణ
► తాళం పగులగొట్టి తిరిగి అధీనంలోకి తీసుకున్న ఏపీ
► ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం
► చివరికి ఇద్దరూ తాళాలు వేసుకెళ్లిన వైనం
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు కొలిక్కి వస్తున్న తరుణంలో ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ ఉమ్మడి భవన్ విభజన చిచ్చురాజేసింది. ఉమ్మడి భవన్ ఆస్తుల పంపకం రెండు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదానికి తెరలేపింది. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన ఆర్‌సీ బంగ్లాను సోమవారం మధ్యాహ్నం ఏపీ అధికారులు తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల భవన్‌ల అధికారులు వాగ్వాదానికి దిగారు. వివాదం సద్దుమనగకపోవడంతో ఏపీ, తెలంగాణ భవన్‌ల అధికారులు ఇద్దరూ బంగ్లాకు తాళాలు వేసుకెళ్లారు. వివాదంపై తెలంగాణ భవన్ అధికారులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం ఉమ్మడి భవన్‌ను రెండు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో విభజించుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించినా.. తెలంగాణకు 32 శాతం భవనాలనే ఏపీ కేటాయించిందని, అందుకే 42 శాతం ఆస్తుల వాటాకు అనుగుణంగా గతంలో తెలంగాణ ఆధీనంలో ఉండి, ప్రస్తుతం ఏపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్‌సీ బంగ్లాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో ఏపీ భవన్ అధికారిగా ఉన్న వీనా ఈష్.. తన లగేజీ కోసం బంగ్లా వినియోగించుకుంటానని చెప్పగా తాళాలు ఇచ్చామని, కానీ వీనా ఈష్ బదిలీ తరువాత కూడా బంగ్లాను ఏపీ వినియోగించుకుంటోందని పేర్కొన్నారు.
భవన్‌పై గతంలోనే ఏపీకి లేఖ రాశాం: రామ్మోహన్‌రావు
తెలంగాణ నుంచి గవర్నర్, హైకోర్టు సీజే, ఉప ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఢిల్లీలో పర్యటించే సమయంలో శబరీ బ్లాక్‌లో బస చేస్తారని తెలంగాణ భవన్ అసిస్టెంట్ రెసిడెంట్æ కమిషనర్ రామ్మోహన్‌రావు చెప్పారు. అయితే పక్కనే ఉన్న ఆర్‌సీ బంగ్లాలో ఏపీ భవన్ అధికారులు కార్యకలాపాలు నిర్వహిస్తూ.. ఇతరులకు వసతి కల్పిస్తూ శబరీ బ్లాక్‌కు భద్రతా పరమైన సమస్యలు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వీఐపీల భద్రత దృష్ట్యా ఆర్‌సీ బంగ్లాను కేటాయించాలని గతంలోనే ఏపీ రెసిడెంట్ కమిషనర్‌కు లేఖ రాశామని చెప్పారు. స్పందన లేకపోవడంతో తెలంగాణకు రావాల్సిన 42 శాతం ఆస్తుల వాటాకు అనుగుణంగా ఆర్‌సీ బంగ్లాను ఆధీనంలోకి తీసుకొని తాళం వేసినట్టు వివరించారు. అయితే సోమవారం మధ్యాహ్నం ఏపీ భవన్ అధికారులు తాళం పగలగొట్టి ఆర్‌సీ భవన్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దీంతో రెండు భవన్‌ల అధికారులు అక్కడి చేరుకొని ఆర్‌సీ బంగ్లా తమకే చెందుతుందంటూ వాగ్వాదానికి దిగారు. వివాదం సద్దుమణగకపోవడంతో ఇరు భవన్‌ల అధికారులు ఇద్దరూ బంగ్లాకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు.
సమాచారం ఇవ్వలేదు: ఏపీ భవన్ వర్గాలు
మూడేళ్లుగా ఏపీ భవన్ ఆధీనంలో ఉన్న ఆర్‌సీ బంగ్లాను ముందస్తు సమాచారం ఇవ్వకుండా తెలంగాణ భవన్ అధికారులు తాళాలు వేసుకోవడం సరికాదని ఏపీ భవన్ అధికారులు పేర్కొన్నారు. సమస్య ఉంటే రెండు భవన్‌ల అధికారులు చర్చించుకొని పరిష్కరిం చుకోవాలని చెప్పారు. ఆర్‌సీ బంగ్లాను తెలంగాణ అధికారులు ఎప్పుడు కోరినా కేటాయిస్తున్నామని, మూడేళ్లుగా లేనిది ఇప్పుడే తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.