ఢిల్లీలో ఏపీ, తెలంగాణ అధికారుల వాగ్వాదం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఏపీ రెసిడెంట్ భవన్‌పై సోమవారం ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం రాజుకుంది. రెసిడెంట్ కమిషనర్‌కు కేటాయించిన గదిని ఇతరులకు కేటాయించడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనాభా నిష్పత్తుల ప్రకారం 58:42 తమకు భవనాలు కేటాయించడం లేదని అధికారులు ఆరోపించారు.
ఏపీ ఇతరులకు కేటాయించిన ఆ గదికి తాళం వేశారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న ఏపీ అధికారులు తాళాన్ని పగులగొట్టేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమస్యలేవైనా ఉంటే చర్చకు రావాలే తప్ప గదికి తాళం వేయడం సరికాదని ఏపీ భవన్ అసిస్టెంట్ కమిషనర్ సూర్యనారాయణ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రం 42 శాతం కంటే ఎక్కువ భవనాలను ఢిల్లీలో వినియోగించుకుంటోందని చెప్పారు. అవసరం ఉండటం వల్లే రెసిడెంట్ కమిషనర్ గదిని వినియోగించుకున్నామని వివరించారు. కాగా, వివాదంపై మాట్లాడిన తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రామ్మోహన్.. ఏపీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. 36 శాతానికి మించి భవనాలను తెలంగాణ వాడుకోవడం లేదని చెప్పారు. రెసిడెంట్ కమిషనర్ భవన్‌ను డార్మెటరీగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు.