హైదరాబాద్లో జోరుగా విభజన రాజకీయాలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ముందుకురానున్న నేపథ్యంలో హైదరాబాద్లో విభజన రాజకీయాలు జోరందుకున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ రాకతో రాజకీయ వేడి పెరిగింది. విభజన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసే బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చీ రాగానే సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో దిగ్విజయ్ భేటీ అయ్యారు.
అటు తెలంగాణ, సీమాంధ్ర నాయకులు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో దిగ్విజయ్ ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కలిశారు.
సమైక్యాంధ్ర తీర్మానం చేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను కాంగ్రెస్ నేతలు అందుకున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి మంత్రి శైలజానాథ్, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి ఇదే డిమాండ్ చేసినట్టు తెలిసింది. సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా విభజన బిల్లును అడ్డుకునే విషయంపై చర్చోపచర్చలు సాగిస్తున్నారు. ఇదిలావుండగా రాష్ట్రపతి పంపిన విభజన బిల్లు ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది.