సాక్షి, న్యూఢిల్లీ: బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో జోక్యం కోరుతూ ప్రధాని మన్మోహన్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీకి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని ఏపీభవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సాయిప్రతాప్, హర్షకుమార్, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథిలు సమావేశమయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన నేతలు రాష్ట్ర విభజన అంశంపై చర్చించుకున్నారు.
ముఖ్యంగా రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ మొదలైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలన్నదానిపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా బిల్లులోని లోటుపాట్లను కేంద్రం దృష్టికి తెస్తూనే, విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ్యులందరితో రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని నేతలంతా అభిప్రాయపడినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తే, రాష్ట్రపతి.. విభజనకు ఆమోదం తెలపడం అంత సులభతరం కాదని, పార్లమెంట్‌లోనూ తాము ఈ అంశాన్ని నొక్కిచెబుతూ సమైక్యాంధ్రకు వివిధ పార్టీల మద్దతు కూడగడతామని ఎంపీలు చెప్పినట్టు తెలిసింది.