brijesh tribunal
-
‘కృష్ణా’ పంపకాల బాధ్యత.. బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల పరిష్కార చట్టం–1956లోని సెక్షన్ 5 (1) కింద ఇప్పటికే కొనసాగుతున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్‌కే.. వివాదాల పరిష్కార బాధ్యతలను కూడా కట్టబెడుతున్నట్టు కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి బ్రిజేశ్ ట్రిబ్యునల్ అనుసరించాల్సిన విధివిధానాలను (టెరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్/టీఓఆర్) ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే చేసిన విజ్ఞప్తిని కేంద్రం పరిశీలించింది. దీనిపై న్యాయశాఖ సలహా మేరకు తాజా నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ, వినియోగం, నియంత్రణపై ట్రిబ్యునల్ తీసుకునే నిర్ణయాలు.. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి దోహదపడతాయని, ఇరు రాష్ట్రాల ప్రజలు లబ్ధి పొందుతారని తెలిపింది. ఈ నిర్ణయం పటిష్ట భారతదేశ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. కృష్ణా జల వివాదాలు, పరిణామాలు ఇలా.. ♦ 1969 ఏప్రిల్ 10న మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ ప్రభుత్వాల ప్రతిపాదన మేరకు జస్టిస్ బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 ఏర్పాటైంది. ♦ 1976 మే 27న: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను కేటాయిస్తూ బచావత్ ట్రిబ్యునల్ తుది నివేదిక (ఫైనల్ అవార్డు) ఇచ్చింది. ♦1976 మే 31: బచావత్ అవార్డును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 25 ఏళ్ల వరకూ అవార్డును పునః సమీక్షించాలంటూ కోరవద్దని షరతు పెట్టింది. ♦ 2004 ఏప్రిల్ 2: బచావత్ అవార్డు కాల పరిధి ముగియడంతో కృష్ణా జలాలను సెక్షన్–3 కింద పునఃపంపిణీ చేయాలని మూడు రాష్ట్రాలు కోరడంతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ అధ్యక్షతన కేడబ్ల్యూడీటీ–2ను ఏర్పాటు చేసిన కేంద్రం ♦ 2010 డిసెంబర్ 30: మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేంద్రానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ♦ 2013 నవంబర్ 29: మూడు రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ సెక్షన్–5(3) కింద బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది నివేదికను కేంద్రానికి ఇచ్చింది. (ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో దాన్ని కేంద్రం అమల్లోకి తేలేదు) ♦ 2014 మార్చి 1: ఉమ్మడి ఏపీని విభజిస్తూ చట్టాన్ని ఆమోదించిన కేంద్రం. ఆ చట్టంలో సెక్షన్–89 ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నీటినే తెలంగాణ, ఏపీల మధ్య పంపిణీ చేసే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని నిర్ణయం. ♦ 2014 మే 15: బ్రిజేశ్ ట్రిబ్యుల్ తుది నివేదికలో ఉమ్మడి ఏపీకి కేటాయించిన జలాలను.. తెలంగాణ, ఏపీలకు పంపిణీ చేసే బాధ్యతను అదే ట్రిబ్యునల్‌కు అప్పగించిన కేంద్రం. ♦ 2016 అక్టోబర్ 19: మొత్తం కృష్ణా పరీవాహక ప్రాంతం పరిధిలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఏపీ, తెలంగాణ ట్రిబ్యునల్‌ను కోరాయి. దీనిపై వాదనలు విన్న ట్రిబ్యునల్ ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకే పరిమితం అవుతామంటూ ఉత్తర్వులిచ్చింది. ♦ 2020 అక్టోబర్ 6: అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో సెక్షన్–3 ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్‌ను తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. దీనితో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని ఉపసంహరించుకుని ప్రతిపాదన పంపాలని.. న్యాయ సలహా తీసుకుని, తుది నిర్ణయానికి వస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. ♦ 2021, అక్టోబర్ 6: కృష్ణా జలాలను సెక్షన్–3 కింద పునఃపంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్సెల్పిని తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. ♦ 2023, అక్టోబర్ 4: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి కొత్త విధి విధానాలను రూపొందిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. -
పాత వాటాలే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాలను పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్ణయిం చాయి. ప్రస్తుత వాటర్ ఇయర్లో ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34:66 నిష్పత్తిన పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. ఇరు రాష్ట్రాల తక్షణ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎవరి అవసరాన్నిబట్టి వారు నీటి వినియోగం చేసుకోవచ్చని, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు తగ్గాక విని యోగ లెక్కలు చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశ మైంది. ఇరు రాష్ట్రాల వాటా నిర్ణయం, నీటి పంపిణీ, కృష్ణా బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించడం, 2019–20 సంవత్సరానికి నీటి కేటాయింపులు, రెండో దశ టెలిమెట్రీ, బోర్డుల వర్కింగ్ మ్యాన్యువల్ తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించారు. కృష్ణా బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈ నరసింహారావు, నర్సింహ, డీసీఈ నరహరిబాబు, ఏపీ తరఫున ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, ఇతర అంతర్రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. ఏపీ జలవనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఈ భేటీకి హాజరు కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో రాలేకపోయారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు గతంలో మాదిరే 34:66 నిష్పత్తిన ప్రాజెక్టుల్లోకి వచ్చే లభ్యత నీటిని వినియోగించుకోవాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించగా ఇందుకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. ఇదే సందర్భంగా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్‌కు ఆమోదం తెలపాలని, బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ఇంజనీర్లు కోరారు. అయితే ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని తెలంగాణ తోసిపుచ్చింది. దీనిపై ఏపీ మరోమారు స్పందిస్తూ సాగర్ కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని కోరింది. తమ యాజమాయిషీలేని కారణంగా ఏటా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని దృష్టికి తెచ్చింది. దీనికి తెలంగాణ అంగీకరించలేదు. ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలు సీఎంల స్థాయిలో, అపెక్స్ కౌన్సిల్లో జరగాల్సిన నిర్ణయాలని, వాటిపై బోర్డు భేటీలో నిర్ణయం చేయలేమని తేల్చిచెప్పింది. దీనిపై మళ్లీ బోర్డు భేటీలో చర్చిద్దామని చైర్మన్ స్పష్టం చేశారు. ఇక ఎగువ కర్ణాటక ప్రాంతంలో గేజ్ స్టేషన్ల వద్ద నమోదవుతున్న కృష్ణా వరద ప్రవాహాలకు, జూరాలకు చేరిన అనంతరం నమోదవుతున్న కృష్ణా ప్రవాహాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని ఏపీ బోర్డు దృష్టికి తెచ్చింది. 2016–17లో ఈ తేడా 70 టీఎంసీలు, 2017–18లో 52 టీఎంసీలు, గతేడాది 51 టీఎంసీల మేర ఉందని తెలిపింది. దీనిపై ఓ కమిటీ వేసి తేల్చుదామని బోర్డు అభిప్రాయపడింది. అవసరాన్నిబట్టి వాడకం.. ఆగస్టు నుంచి నవంబర్ వరకు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నుంచి 103 టీఎంసీలు కావాలని బోర్డును తెలంగాణ కోరగా సాగర్ కింది ఆయకట్టుకు 50 టీఎంసీలు, ఏఎంఆర్ఎస్ఎల్బీసీకి 20, హైదరాబాద్ తాగునీటికి 4, మిషన్ భగీరథకు మరో 4, కల్వకుర్తికి 25 టీఎంసీల కేటాయింపులు చేయాలని కోరింది. ఏపీ తన తక్షణ తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు కింద 23 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 10, హంద్రీనీవాకు 5 టీఎంసీల నీటి కేటాయింపులు కోరింది. దీనిపై బోర్డు సమావేశం అనంతరం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమై ఎవరి అవసరం మేరకు వారు వాడుకోవాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లోకి స్థిరంగా వరద వస్తున్నందున ఎవరి అవసరాలకు వారు నీటిని వాడుకొని ప్రవాహాలు తగ్గాక వాటాల మేరకు వాడకం జరిగిందా? లేదా చూసుకుందామనే నిర్ణయానికి వచ్చాయి. బోర్డు తరలింపు అక్కర్లేదు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న ప్రతిపాదనను ఏపీ మరోమారు ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని, దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ఏపీ ఇంజనీర్లు తెలిపారు. అయితే దీనికి తెలంగాణ అభ్యంతరం తెలిసింది. కృష్ణా బేసిన్‌లోని ఎక్కువ ప్రాజెక్టులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సహా పలు కార్యాలయాలు హైదరాబాద్ నుంచే నడుస్తున్నాయని బోర్డు దృష్టికి తెచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చాకే అమరావతి ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. అయితే దీనిపై బోర్డు చైర్మన్ స్పందిస్తూ చట్టప్రకారం తాము నడుచుకోవాల్సి ఉందని, దీనిపై కేంద్రా జలశక్తిశాఖకు నివేదించి వారి సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. గోదావరి బోర్డు ఆర్కే జైన్ నేతృత్వంలో గోదావరి బోర్డు సమావేశం జరిగినా సమావేశం కేవలం నిధుల కూర్పు, ఇంజనీర్ల నియామకం వంటి అంశాలపైనే చర్చించింది. కొత్త ప్రాజెక్టులు, వర్కింగ్ మ్యాన్యువల్ వంటి అంశాలపై తర్వాత చర్చిద్దామని నిర్ణయించింది. -
గప్‌చుప్‌గా ఆల్మట్టి ‘ఎత్తు’లు
చుక్క నీరు కూడా దిగువకు రాకుండా కృష్ణమ్మను ఒడిసి పట్టుకునేందుకు కర్ణాటక తహతహలాడుతుంటే రాష్ట్ర సర్కారు చోద్యం చూస్తోంది. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 130 టీఎంసీలను అదనంగా దండుకునేందుకు ‘ఆల్మట్టి’ ఎత్తు పెంచుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఎత్తిపోతల పథకాలతో ‘కృష్ణ’ను దారి మళ్లిస్తున్నా గుడ్లప్పగించింది. పాలక పెద్దల స్వార్థం రైతాంగానికి శాపంగా మారనుంది. ఇంకా ఇలాగే ఉపేక్షిస్తే రాష్ట్రంలో సాగు నీటిపై అన్నదాతలు ఆశలొదులుకోవాల్సిందే. సాక్షి, అమరావతి : ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధమైంది. తద్వారా అదనంగా 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్ల ఆయకట్టుకు నీళ్లందించే పనులను రూ.30,143 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు వల్ల ముంపునకు గురయ్యే 30,875 హెక్టార్ల భూమిని ఒక వైపు సేకరిస్తూనే, మరో వైపు 22 ముంపు గ్రామాలకు చెందిన 23,561 కుటుంబాల ప్రజలకు పునరావాసం కల్పించే పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులను గ్లోబల్ టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించడంపై దృష్టి సారించింది. ఈ పనులు పూర్తయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం పరిధిలోని రైతులపై తీవ్ర ప్రభావం ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు మాత్రం నోరు మెదపడం లేదు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం ‘నోటిఫై’ చేయక ముందే.. కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తున్నా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపింది. కానీ ఈ తీర్పును అమలు పరుస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయలేదు. తెలుగు రాష్ట్రాల మధ్య కాకుండా నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. డీపీఆర్ తయారీకి 2014లోనే టెండర్లు కేంద్రం నోటిఫై చేయకపోయినా, సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే పనులు చేపట్టడానికి అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి 2014 డిసెంబర్లోనే కర్ణాటక సర్కారు టెండర్లు పిలిచి, తక్కువ ధరకు కోట్ చేసిన వ్యాప్కోస్‌కు అప్పగించింది. ఈ విషయమై అధ్యయనం చేసిన వ్యాప్కోస్.. 524.256 మీటర్లకు ఎత్తు పెంచితే 30,875 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, 22 గ్రామాలకు చెందిన 23,561 మంది నిర్వాసితులుగా మారతారని తేల్చింది. అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ) మూడో దశలో భాగంగా 8 ఎత్తిపోతల పథకాలు చేపట్టి, ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల అందుబాటులోకి వచ్చే 130 టీఎంసీలను వినియోగించుకుని 5,62,032 హెక్టార్లకు నీళ్లందించవచ్చని నివేదించింది. ఇందుకు రూ.30,143 కోట్ల వ్యయం అవుతుందని చెప్పింది. ఈ నివేదికను 2016లోనే ఆమోదించిన కర్ణాటక సర్కార్ ఇప్పుడు భూసేకరణ, పునరావాస పనులను ప్రారంభించింది. డ్యామ్ ఎత్తు పెంచే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు నెలలు ఆలస్యంగా కృష్ణమ్మ ఆల్మట్టి ఎత్తు పెంచి, నారాయణపూర్ జలాశయం ఎడమ కాలువకు అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు చేపట్టడం ద్వారా అదనంగా కనీసం 223 టీఎంసీలను వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్ సన్నాహాలు చేస్తోంది. కేవలం ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ఆ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీల నుంచి 210.89 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఆగస్టు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం జూరాల, శ్రీశైలం జలాశయాలకు చేరడం లేదు. ఆల్మట్టి ఎత్తు పెంచే పనులు పూర్తయినా, నారాయణపూర్ జలాశయానికి అనుబంధంగా ఎత్తిపోతల పథకాలు పూర్తయినా.. ఎగువ నుంచి జూరాల, శ్రీశైలానికి చేరే వరద ప్రవాహంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదు. అప్పుడు సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవు. కృష్ణా పరీవాహక ప్రాంతం ఎడారే తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటా ఉంది. ఇందులో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్.. 299 టీఎంసీలు తెలంగాణకు తాత్కాలికంగా కేటాయించారు. ఐదేళ్లుగా వర్షాభావం వల్ల కృష్ణా నదిలో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. కేటాయింపుల మేరకు నీటి లభ్యత లేకపోవడం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిలో ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిలో నీటి లభ్యత కనిష్ట స్థాయికి పడిపోతుంది. అప్పుడు కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోని ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక సర్కార్ ఇంత చేస్తున్నా సీఎం చంద్రబాబు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నోరు మెదపడం లేదంటున్నారు. కనీసం కర్ణాటక చర్యలపై కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు కూడా చేయకపోవడాన్ని బట్టి చూస్తే.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కర్ణాటకకు తాకట్టు పెట్టారన్నది స్పష్టమవుతోంది. -
206 టీఎంసీలు అవసరం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది బేసిన్లో లభ్యత జలాల కేటాయింపులు మళ్లీ చేపట్టాలని, పరీవాహకం, ఆయకట్టు ఆధారంగా తెలంగాణకు కోటా పెంచాలని విన్నవిస్తూ వస్తున్న తెలంగాణ.. ప్రస్తుతం మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, తాగు అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కలిపి రాష్ట్రానికి మొత్తం గా 936.58 టీఎంసీలు అవసరమని పేర్కొన్న తెలంగాణ.. అందులో 206 టీఎంసీలు తాము భవిష్యత్తులో చేపట్టాలని భావిస్తున్న కొత్త ప్రాజెక్టులకు అవసరమని ట్రిబ్యునల్‌కు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. వీటి ద్వారా కొత్తగా 23,37,570 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రణాళిక తమవద్ద ఉందని స్పష్టంచేసింది. జూరాల వరద కాల్వ కిందే ఏకంగా 100 టీఎంసీలతో 4.57 లక్షల హెక్టార్లకు సాగునీరు ఇస్తామని అందులో తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల పంపిణీకి గాను బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణలో భాగంగా తెలంగాణ తన అఫిడవిట్‌ను సమర్పించింది. ఇందులో కొన్ని కీలకాంశాలను పేర్కొంది. తమకు మొత్తంగా 936.58 టీఎంసీల అవసరాన్ని పేర్కొన్న తెలంగాణ ఇందులో గృహ, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీళ్లు తిరిగి 80శాతం వివిధ రూపాల్లో బేసిన్లోకే చేరుతున్నందున తమ నీటి వినియోగాన్ని 771.47 టీఎంసీలుగా చూపాలని కోరింది. ఏడు ప్రాజెక్టులు.. 9.34 లక్షల హెక్టార్లు.. నిర్మాణం పూర్తయినా, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయినా కృష్ణా బేసిన్లో ఇంకా చాలా ఆయకట్టుకు నీరందలేని పరిస్థితులు ఉన్నాయని, ఈ దృష్ట్యా తమకు నీటి కేటాయింపులు పెంచితే కొత్తగా 9.34 లక్షల హెక్టార్లలో సాగునీటిని ఇచ్చేలా 7 కొత్త ప్రాజెక్టులు చేపడతామని పేర్కొంది. ఖమ్మం జిల్లాలో మున్నేరు ద్వారా 4 టీఎంసీలతో 12,950 హెక్టార్లు, వరంగల్ జిల్లాలో 2 టీఎంసీలతో 5వేల హెక్టార్లు, మున్నేరు నదిపై బ్యారేజీల ద్వారా మరో 5 టీఎంసీలతో 20,235 హెక్టార్లు సాగులోకి వచ్చేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపింది. ఇక కోయిల్‌కొండ–గండేడు ఎత్తిపోతల ద్వారా 50 టీఎంసీలతో 2,28,686 హెక్టార్లు, రేలంపాడు ఎత్తిపోతలతో 10.50 టీఎంసీతో 48 వేల హెక్టార్లు, ఎస్ఎల్బీసీ విస్తరణతో 35 టీఎంసీలతో 1,61,473 హెక్టార్లు, జూరాల వరద కాల్వతో 100 టీఎంసీల నీటితో 4,57,684 ఎకరాలకు నీరిచ్చేలా తమ భవిష్యత్ ప్రణాళిక ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా 206.50 టీఎంసీల నీటితో 9.34 లక్షల హెక్టార్ల సాగుభూమికి నీటిని అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా నీటి కేటాయింపులు చేయాలని విన్నవించింది. వీటిపై ట్రిబ్యునల్ బుధవారం నుంచి 3 రోజుల పాటు వాదనలు జరగనున్నాయి. -
బయట ఉన్నా బేసిన్లో భాగమే
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో డెల్టా ప్రాంతం ఎక్కువ భాగం కృష్ణా బేసిన్‌కు బయట ఉన్నా అది బేసిన్లో భాగమేనని, డెల్టాలో వర్షం నీరు ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ప్రాంతంలో మాత్రమే సాగుకు ఉపయోగపడుతుందని ఏపీ సర్కారు బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు వాదించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలపై గురువారం కూడా జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు విచారణ జరిగింది. ఏపీ తరఫు సాక్షి కె.వి. సుబ్బారావును తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది వి.రవీందర్రావు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. డెల్టాలో వర్షం వల్ల వచ్చే నీటిని ప్రకాశం బ్యారేజీ ఎగువన మాత్రమే సాగుకు వినియోగిస్తారని, ఇక్కడ కాలువల ద్వారా వచ్చే నీటిని వినియోగించరని సుబ్బారావు సమాధానాలిచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా పాలార్, పొన్నిర్ నదీ బేసిన్లకు కృష్ణా జలాలను మళ్లిస్తున్నారు కదా? అని రవీందర్రావు ప్రశ్నించగా.. ఇది నిజమేనని, అయితే కృష్ణా నదిలో మిగులు జలాలను మాత్రమే హంద్రీనీవాలో వినియోగిస్తున్నామని సుబ్బారావు సమాధానం చెప్పారు. కృష్ణా బేసిన్లో 95 శాతం డెల్టా ప్రాంతం బేసిన్ బయట ఉందికదా.. అని ప్రశ్నించగా.. డెల్టా వ్యవస్థ బేసిన్‌కు బయట ఉన్నా అది బేసిన్లో భాగమేనని సుబ్బారావు చెప్పారు. ఇక కేసీ కెనాల్ ఆధునీకరణ వల్ల దాని అవసరాలు 39 టీఎంసీల నుంచి 19 టీఎంసీలకు తగ్గుతుంది కదా! అని రవీందర్రావు పేర్కొనగా.. ఈ వాదనను తిరస్కరిస్తున్నట్టు సుబ్బారావు చెప్పారు. తదుపరి విచారణ శుక్రవారం కూడా జరగనుంది. -
గోదావరి నీరు మళ్లించుకోవచ్చుగా
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు సరిపడా మళ్లించుకోవచ్చు కదా అని ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ సూచించింది. దీని వల్ల నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నీరు అవసరం ఉండదు కదా అని వ్యాఖ్యానించింది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ తరఫు సాక్షి కె.వి. సుబ్బారావును తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలపై పలు ప్రశ్నలు అడిగారు. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా డెల్టా అవసరాలను తీర్చుకోవచ్చు కదా అని వైద్యనాథన్ సూచించగా ఆ ప్రతిపాదనను సుబ్బారావు తిరస్కరించారు. ఏపీ నూతన రాజధాని ప్రాంతం వల్ల కృష్ణా జలాల ద్వారా సాగులో ఉన్న 7 లక్షల ఎకరాలు ప్రభావితమవుతున్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు.. రాజధాని ప్రాంతం కేవలం 217 చ.కి.మీ. పరిధిలోనే ఉందని సమాధానమిచ్చారు. 217 చ.కి.మీ. పరిధి రాజధానిగా నిర్ణయిస్తే మౌలిక సదుపాయల అభివృద్ధి, కారిడార్ జోన్, పరిశ్రమల జోన్, అర్బన్ జో¯న్ల వల్ల పరిధి పెరిగే అవకాశం ఉంది కదా అని వైద్యానాథన్ ప్రశ్నించగా.. అన్ని జోన్లు ప్రతిపాదిత ప్రణాళికలోనే ఉంటాయని సుబ్బారావు తెలిపారు. ఇక డెల్టాలో పంటకాలం 180 నుంచి 130 రోజులకు తగ్గించినందు వల్ల నీటి అవసరాలు కూడా తగ్గినట్టే కదా అని అడిగిన ప్రశ్నకు.. పంటకాలం తగ్గింపు వల్ల నీటి ఆవశ్యకత తగ్గలేదని సుబ్బారావు సమాధానమిచ్చారు. కృష్ణా డెల్టాలో పంటకాలాన్ని 112 రోజులకు తగ్గించుకుంటే సాగునీటి అవసరం తగ్గుతుంది కదా అనగా.. అది అంగీకారం కాదన్నారు. గోదావరి నుంచి పులిచిం తల ప్రాజెక్టు ద్వారా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు ఎంత నీరు మళ్లిస్తారని అడిగిన ప్రశ్నకు.. దానిపై అధ్యయనం జరుగుతోందని సుబ్బారావు సమాధానమిచ్చారు. కాగా, కృష్ణా జలాల పంపకాలపై తదుపరి విచారణ గురువారం జరగనుంది. -
న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే
► బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం వాదనలు ప్రారంభం ► పంటల పరిస్థితికనుగుణంగా నీటి వాటాలు పెంచండి ► కృష్ణా బోర్డు పరిధిని ట్రిబ్యునల్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో దశా బ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సవరిం చాల్సిన బాధ్యత ట్రిబ్యునల్ మీదే ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర పరీవాహకం, ఇక్కడి పంటల పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని వాటాలు పెంచాలని కోరింది. కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటున్న బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్.. బుధవారం నుంచి తిరిగి విచారణ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రతిపా దించిన విచారణ అంశాలపై సమర్పించిన అదనపు పత్రాలపై వాదనలు ఆరంభిం చింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు ఆరంభించారు. ట్రిబ్యునల్ ఆర్డర్లో పలు అంశాలకు సంబంధించి గత జూలైలో ప్రతిపాదించిన సవరణలు పూర్తి చేయాలని కోరగా, అందుకు ట్రిబ్యునల్ అంగీకారం తెలిపింది. అలాగే కృష్ణా బోర్డు పరిధిని ట్రిబ్యునల్ పరిధిలోకి తేవాలని కోరారు. ప్రస్తుతం 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు దక్కేలా ఒప్పందం కుదరగా, దాన్ని కృష్ణా బోర్డు అమలు పరుస్తోందని, దాన్నే అమలు పరచాలని ఏపీ కోరగా తెలంగాణ అభ్యంతరం చెప్పింది. నదీ వ్యవస్థను మార్చవద్దు: ఏపీ నీటి వాటాల్లో మార్పులు చేయరాదని ట్రిబ్యు నల్‌ను ఏపీ కోరింది. ఈ మేరకు 36 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని, 60 శాతం జనాభా దానిపై ఆధారపడి ఉందని అందులో తెలిపింది. అందుకు భిన్నంగా తెలంగాణలో ఐటీ, ఆర్థిక రంగం, ఫార్మా, తయారీ కంపెనీ లు ప్రధాన ఆదాయ, ఉపాధి వనరులుగా ఉన్నాయని పేర్కొంది. ‘పశు, కోళ్ల, మత్స్య, కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో 70 శాతం వాటా ఏపీ నుంచే ఉంది. వీటన్నింటికీ కృష్ణా డెల్టా వ్యవస్థే ఆధారం. ఏపీ ప్రాజెక్టులన్నీ కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి’ అని వివరించింది. 1976లో బచావత్ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలను పంచగా, ఇందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు దక్కాయని, మూడేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోందని చెప్పింది. ఆయకట్టు, ప్రాజెక్టుల కింది నీటి వినియోగంలో ఎలాంటి మార్పులు లేవని, ఇలాంటి సమయంలో నీటి వాటాల్లో మార్పులు చేస్తే అది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దాదాపు 150 ఏళ్లుగా ఉన్న నదీ వ్యవస్థను మార్చే పనులు చేయరాదని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు 214.14 టీఎంసీలు తరలిస్తోందని, ఇందులో హైదరాబాద్ తాగునీటికి జీ–4 బేసిన్ నుంచి మూసీ బేసిన్‌కి 6.43 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్–1, 2ల నుంచి 68.48 టీఎంసీలు, ప్రాణహిత– చేవెళ్ల ద్వారా 83.19 టీఎంసీలు, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మరో 24.65 టీఎంసీలు కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని, ఇందిరమ్మ వరద కాల్వ, సీతారామ ఎత్తిపోతల, రామప్ప సరస్సు ద్వారా మరో 31.39 టీఎంసీలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇందులో ఏపీ వాటా ఏమిటో తేల్చాలని కోరింది. -
ఆల్మట్టి ఎత్తుపై కర్ణాటక రాజకీయం!
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు - తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతుల కోసం ఒత్తిళ్లు - ఇప్పటికే కేంద్ర మంత్రిని కలసిన కర్ణాటక మంత్రులు - అనుమతులు సాధించి రాజకీయ లబ్ధి పొందే యత్నం - కేంద్రం తలొగ్గితే తెలంగాణ ఎడారే! సాక్షి, హైదరాబాద్: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు రాజకీయ రంగు పులుముకుంటోంది.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఆధారపడి చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు సాధించుకొనేందుకు కర్ణాటక ప్రభుత్వం రాజకీయ కోణాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు కర్ణాటక మంత్రులు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిని కలసి విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ పార్టీల పెద్దలు కూడా ఈ పథకాలకు అనుమతులు సాధించి.. ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తున్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచుకునేందుకు కర్ణాటక చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పెంపుతో అదనంగా లభించే నీటిని వినియోగించుకునేలా తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది. కానీ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకపోవడం (అమల్లోకి రాకపోవడం)తోపాటు పలు ఇతర అంశాల నేపథ్యంలో ఈ ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. అయితే కర్ణాటక చేపట్టిన ఈ తొమ్మిది ఎత్తిపోతల పథకాల నుంచి పలువురు కీలక నేతలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందులో అధికార కాంగ్రెస్‌తోపాటు విపక్ష బీజేపీ నేతల నియోజకవర్గాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నేతలంతా ఎత్తిపోతల పథకాలకు ఎలాగైనా అనుమతులు సాధించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తద్వారా ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్నారు. ప్రయత్నాలు మొదలు.. ఇటీవల కర్ణాటక మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రిని కలసి ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై విజ్ఞప్తులు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని, అందువల్ల దానిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ పథకాలు పూర్తిచేస్తామని.. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే నీటి విని యోగం మొదలుపెడతామని వివరించినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ కేంద్ర మంత్రులు సైతం.. ఆ ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై దృష్టి సారించినట్లు తెలిసింది. తాము అనుమతులు సాధించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే.. కర్ణాటక ప్రభుత్వం, అక్కడి నేతల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే.. కృష్ణా పరీవాహకంలో దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే విచ్చలవిడిగా నీటిని వినియోగించుకుంటున్న కర్ణాటక.. ఆ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని వినియోగించుకుంటే దిగువకు చుక్క నీరు కూడా రాదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. -
కృష్ణాలో ఏపీకి 155 టీఎంసీలు చాలు
- 512 టీఎంసీల నికర జలాల వాటాలో కోత పెట్టండి - బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు ఏపీ అఫిడవిట్‌కు రాష్ట్రం కౌంటర్ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నికర జలాల వాటాలో కోత పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు విన్నవించింది. కృష్ణా బేసిన్లో మొత్తంగా ఏపీకి 155 టీఎంసీల నీటి వాటా సరిపోతుందని, ఆ మేరకు వారికి ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల వాటాలో కోత పెట్టాలని కోరింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌కు ఏపీ సమర్పించిన అఫిడవిట్‌పై రాష్ట్రం కౌంటర్ దాఖలు చేసింది. కౌంటర్లో వివరాలు.. ► కృష్ణా డెల్టా కింద ఏపీకి 152.20 టీఎంసీల కేటాయింపు ఉంది. రాజధాని ప్రాంతం సీఆర్డీఏ కారణంగా పరివాహకం తగ్గిపోతున్నందున మరో 16 టీఎంసీలు అవసరం లేదు. ఇక పోవలరం కాల్వల ద్వారా 80 టీఎంసీలు తరలిస్తున్నందున మొత్తం వాటాలో దీన్ని తగ్గించాలి. మొత్తంగా కృష్ణా డెల్టాకి 17.55 టీఎంసీలు సరిపోతాయి. ► గుండూరు ఛానల్‌కు 4 టీఎంసీలున్నా, వాస్తవ అవసరాలు 1.48 టీఎంసీలకు మించవు. ► సాగర్ ఎడమ కాల్వల కింద వారికి 34.25 టీఎంసీల కేటాయింపుల్లో వాస్తవ అవసరాలు 20.22 టీఎంసీలే. అయితే అమరావతి రాజధాని కింద 3.05లక్షల ఎకరాలు ప్రభావితం అవుతున్నందున ఈ నీటి కేటాయింపులు కూడా అవసరం లేదు. ► సాగర్ కుడి కాల్వ కింద 140 టీఎంసీల కేటాయింపులు ఉండగా, వాస్తవ అవసరాలు 75.57 టీఎంసీలు మాత్రమే. ఇందులోనూ కుడి కాల్వ పరిధిలోని 2.67లక్షల ఎకరాలు రాజధాని ప్రాంతంలో ఉన్నందున 26.71టీఎంసీలను తగ్గించి 75.77 టీఎంసీలు కేటాయిస్తే సరిపోతుంది. ► తుంగభద్ర లోలెవల్ కెనాల్, హై లెవల్ కెనాల్ల కింద అవసరాలకు మించి కేటాయింపులున్నాయి. వాటిని తగ్గించాలి. ► మొత్తంగా 512 టీఎంసీల నికర జలాల కేటాయింపులను 155.40 టీఎంసీలకు పరిమితం చేయాలి. ► ఇక తెలంగాణకు కృష్ణా బేసిన్లో 68.5శాతం పరివాహకం ఉండగా కేటా యింపులు మాత్రం 36.9 శాతమే. అదే ఏపీకి 31.5శాతం పరివాహకం ఉన్నా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలు ఏపీ బేసిన్ బయటే వాడుకుంటోందని తెలిపింది. బేసిన్ పరివాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణలో 36.5లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో కేవలం 15.03లక్షల హెక్టార్లు ఉంది. జనాభా పరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో 78.29లక్షలు(28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీల వరకు దక్కాలి. -
కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలి
బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను మరోమారు కోరిన రాష్ట్రం ► పోలవరం, పట్టిసీమల కింద ఏపీ గోదావరి నీటిని తరలిస్తున్నందున ఆ మేరకు కృష్ణాడెల్టాకు కోత పెట్టాలి ► పాలమూరు, డిండి, వాటర్ గ్రిడ్‌కు నీటి కేటాయింపులు చేయాలి సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల్లో తమకున్న నికర జలాల కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్లో రాష్ట్రానికి మొత్తంగా 599.90 టీఎంసీల మేర అవసరాలున్నాయని, ఇందులో రాష్ట్రానికి ఉన్న పరివాహకం, సాగు యోగ్యభూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభాను దృష్టిలో పెట్టుకొంటే ప్రస్తుతం లభ్యతగా ఉన్న 811 టీఎంసీల నికర జలాల్లో 574.6 టీఎంసీలు తెలంగాణకు దక్కాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు అదనపు వాటాలు దక్కుతాయన్న అంశాన్ని వివరిస్తూ, పెరిగే వాటాను రాష్ట్రానికి కేటాయించాలని కోరింది. పోలవరం, పట్టిసీమల కింద చేస్తున్న వినియోగం మేరకు ఏపీకి కృష్ణా డెల్టా కింద చేసిన కేటాయింపుల్లో కోత పెట్టాలని విన్నవించింది. ఇక ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవికావని, వాటికి అవసరాలకు అనుగు ణంగా నీటి కేటాయింపులు చేయాలని విన్న వించింది. ఈ మేరకు కృష్ణా జలాలపై విచా రణ చేస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు సోమవారం 67 పేజీలతో అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అఫిడవిట్‌లోని ప్రధానాంశాలివీ... ⇒ తెలంగాణకు కృష్ణా బేసిన్లో 68.5శాతం పరివాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 36.9 శాతమే. అదే ఏపీకి 31.5 శాతం పరివాహకం ఉన్నా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలను ఏపీ బేసిన్ బయటే వాడుకుం టోంది. బేసిన్ పరివాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణలో 36.5 లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో కేవలం 15.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. జనాభాపరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో కేవలం 78.29 లక్షలు (28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలను పరిగణన లోకి తీసుకుంటే 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 574.6 టీఎంసీలు, ఏపీకి 236.4 టీఎంసీలు దక్కుతాయి. ⇒ రాష్ట్రంలో 299 టీఎంసీలకు ప్రాజెక్టులు నిర్మితమై ఉండగా, 225 టీఎంసీలకు ప్రాజె క్టులు నిర్మాణంలో ఉన్నాయి, మరో 36 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టా ల్సి ఉంది. ఇక తాగు నీరు, పరిశ్రమల నీటి అవసరాలకు కలిపి రాష్ట్రానికి మొత్తంగా 599.90 టీఎంసీల అవసరం ఉంటుంది. ⇒ 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన 80 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలి. ఇక ఏపీ పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలిస్తోంది. ఈ దృష్ట్యా పట్టిసీమ ద్వారా చేస్తున్న వినియోగం మేరకు కృష్ణా డెల్టాకు కోత పెట్టాలి. ⇒ బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటి అవసరాలు తీరాకే బేసిన్అవతలి ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాలి. ⇒ కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వాడుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా, అదే కృష్ణాలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న అనుమతినిచ్చింది. వీటితోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, వాటర్‌గ్రిడ్‌లకు లభ్య త జలాలను కేటాయించి 7దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించాలి. ⇒ ఆర్డీఎస్ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. ఈ దృష్ట్యా ఇక్కడ లభ్యత జలాలు వచ్చేట్లు ఏపీ సహకరించేలా చూడాలి. -
ఆరు వారాల గడువివ్వండి
అఫిడవిట్ సమర్పణకు బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను కోరిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ.. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89పై అభిప్రాయాలను నాలుగు వారాల్లో తెలపాలన్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం అదనపు గడువు కోరింది. ట్రిబ్యునల్ విధించిన గడువు శనివారంతో ముగియడంతో అఫిడవిట్ సమర్పణకు మరో ఆరు వారాల గడువు కావాలని విన్నవించింది. ఈమేరకు ఢిల్లీలో ఉన్న అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు.. ట్రిబ్యునల్ కార్యాలయ అధికారులకు తమ వినతిని అందించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 పరిధి, విసృ్తతిపై జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా గల ట్రిబ్యునల్ గత నెలలో తీర్పు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కృష్ణా జలాల కేటారుుంపుల నుంచే రెండు కొత్త రాష్ట్రాలు పంచుకోవాలని ఇందులో స్పష్టం చేసింది. నీటి కేటారుుంపులు, ప్రాజెక్టుల వారీ కేటారుుంపులు, నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు ప్రాజెక్టుల మధ్య ఆపరేషన్ ప్రొటోకాల్(ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్లు ఇవ్వాలి) తెలంగాణ, ఏపీకే పరిమితమని తేల్చిచెప్పింది. సెక్షన్ 89 పరిధి వివాదం పరిష్కారమైందని, కొత్త రాష్ట్రాల మధ్య నీటి కేటారుుంపులు, ప్రాజెక్టు వారీ కేటారుుంపులు, ఆపరేషన్ ప్రోటోకాల్ తేల్చేందుకు తదుపరి విచారణను డిసెంబర్ 14న చేపడతామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 89లోని ఏ, బీ క్లాజులపై ఏపీ, తెలంగాణ నాలుగు వారాల్లో తమ అభిప్రాయాలను సమర్పించాలని సూచించింది. వాటికి జవాబులను తదుపరి రెండు వారాల్లో సమర్పించాలని, తిరిగి వాటిపై ఏవైనా ప్రతిస్పందనలు ఉంటే వారంలోగా సమర్పించాలంటూ ఉత్తర్వుల్లో తెలిపింది. దీనిపై ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై స్పష్టత రాకపోవడంతో రాష్ట్రం మరో ఆరు వారాల గడువు కోరింది. ఈ నేపథ్యంలో డిసెంబర్14న జరగాల్సిన ట్రిబ్యునల్ భేటీ సైతం వారుుదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. -
న్యాయ సలహా తర్వాతే ముందుకు..
బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ► రెండు గంటల పాటు తీవ్రంగా చర్చ ► న్యాయ కార్యాచరణ దిశగా పరిశీలన ► తీర్పు పర్యవసానాలను వివరించిన హరీశ్‌రావు, అధికారులు ► సాధారణ వర్షాలు కురిసినా నీటికి కటకట తప్పదనే ఆందోళన ► 29న మరోమారు సమావేశం కావాలని నిర్ణయం ► ఆ భేటీకి సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌కు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయ సంప్రదింపుల తర్వాతే ముందుకు వెళ్లాలని మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిర్ణయించింది. ఆ తీర్పు అమలైతే రాష్ట్రానికి కృష్ణా జలాలు రావడం కష్టమేనని.. వర్షాలు సాధారణ స్థాయిలో కురిసినా కూడా నీటికి కటకట తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణా జలాల వివాదాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితం చేస్తే ఏం చేయాలన్నదానిపైనా చర్చించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని.. ఆ భేటీకి సుప్రీంకోర్టు న్యాయవాది వైద్యనాథన్‌ను ఆహ్వానించి సలహా తీసుకోవాలని నిర్ణయించింది. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం శనివారం హైదరాబాద్‌లో సమావేశమైంది. సబ్ కమిటీ సభ్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జోషి, ఈఎన్సీ మురళీధర్ తదితరులు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కృష్ణా జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం, దానిని ఎదుర్కొనే వ్యూహాన్ని సిద్ధం చేసే అంశాలను పరిశీలించారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే రాష్ట్ర రైతుల పరిస్థితి ఏమిటి? సాధారణ వర్షపాతం నమోదైనప్పుడు కృష్ణా నీరు రాష్ట్రం వరకు వస్తుందా? సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందా? ఒకవేళ రెండు రాష్ట్రాలకే వివాదం పరిమితమైతే రాష్ట్రం లేవనెత్తే అంశాలు ఎలా ఉండాలి? ఏ నిర్ణయం చేస్తే రాష్ట్రానికి లాభం.. అన్న అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగే అన్యాయంపై న్యాయపరంగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశాన్ని పరిశీలించారు. ట్రిబ్యునల్ తీర్పుపై ఇప్పటికిప్పుడు ఓ నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని భావించిన సబ్ కమిటీ ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను సంప్రదించాక తుది నిర్ణయానికి రావాలనే భావన వ్యక్తమైంది. ఈ మేరకు ఈ నెల 29న సబ్ కమిటీ భేటీకి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌ను ఆహ్వానించాలని నిర్ణయించింది. అన్యాయాన్ని వివరించిన అధికారులు కృష్ణా జలాల వివాదం, ప్రస్తుత తీర్పు కారణంగా ఏర్పడే ఇబ్బందులను మంత్రి హరీశ్‌రావు, విద్యాసాగర్‌రావు, ఇతర అధికారులు సబ్ కమిటీకి వివరించారు. కొన్నేళ్లుగా కృష్ణా బేసిన్లో తీవ్ర నీటి కొరత నెలకొన్న సంగతిని హరీశ్‌రావు గుర్తు చేశారు. నికర జలాలు రావడమే కష్టమైన పరిస్థితుల్లో కొత్త తీర్పు ఇబ్బందికరమేనని స్పష్టం చేశారు. తాజా తీర్పును అనుసరించి మిగులు జలాలు, 65 శాతం డిపెండబులిటీ పద్ధతిన పంచిన నీటిని ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం మొదలు పెడితే... దిగువన ఉన్న తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని విద్యాసాగర్‌రావు వివరించారు. భారీ వరదలు వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరందివ్వడం సాధ్యమయ్యే అవకాశం లేదన్నారు. ప్రస్తుత పద్ధతి ప్రకారం కృష్ణా నది నుంచి కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయని... కొత్త తీర్పు అమల్లోకి వస్తే మరో 254 టీఎంసీలు కలిపి 1,573 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించారు. అదే జరిగితే దిగువన ఉన్న తెలంగాణకు నీటికి కటకట తప్పదన్నారు. అదనంగా కేటాయించిన 254 టీఎంసీలంటే శ్రీశైలం ప్రాజెక్టు నీటి పరిమాణంతో సమానమని... వర్షాలు సరిగా లేని సమయాల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తోందని అధికారులు గణాంకాలతో సహా వివరించారు. చాలా ఏళ్ల తర్వాత ఈసారి సరైన వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాయని, అంతకుముందు సాగర్ ఆయకట్టు రైతులు వరుసగా క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుత వివాదం తెలంగాణ, ఏపీలకే పరిమితమైతే... క్యారీ ఓవర్లోని 150 టీఎంసీల జలాలు, గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తూ చేపట్టిన పోలవరం, పట్టిసీమల్లో దక్కేవాటాల కోసం రాష్ట్రం పోరాడాల్సి ఉంటుందన్నారు. అయితే ప్రస్తుత తీర్పును మళ్లీ ట్రిబ్యునల్ వద్దే విచారణ కోరడమా, లేక సుప్రీంకోర్టును ఆశ్రయించడమా, ఇప్పటికే వేసిన ఎస్ఎల్పీపైనే కొట్లాడడమా.. అన్న అంశాలపై న్యాయవాదులతో చర్చించాక నిర్ణయించాలని సబ్‌కమిటీ అభిప్రాయపడింది. -
‘కృష్ణా’పై ఏం తేలుస్తుందో?
జలాల వివాదంపై 19న బ్రజేశ్ ట్రిబ్యునల్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించిన విచారణను రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? లేదా నాలుగు రాష్ట్రాలను కలిపి విచారించాలా? అన్న అంశం ఈ నెల 19న తేలనుంది. దీనిపై బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ మేరకు ట్రిబ్యునల్ ఆఫీస్ హెడ్ హెచ్.ఎం.సింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అడ్వకేట్లకు సమాచారం అందించారు. ఇప్పటికే ఈ అంశంమై ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపించింది. కృష్ణా బేసిన్లో లభ్యతగా ఉన్న మొత్తం జలాలను సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు మళ్లీ కేటాయించాలని వాదించింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఏపీ, తెలంగాణ మధ్య వివాదంగా చూడరాదని, నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నందున కేటాయింపుల్లోనూ అవన్నీ భాగస్వాములు అవుతాయని స్పష్టంచేసింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలకే వాదనలను పరిమితం చేయాలని ట్రిబ్యునల్‌కు ఇప్పటికే కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈనెల 19న ఉదయం 11 గంటలకు ట్రిబ్యునల్ తన నిర్ణయాన్ని వెలువరించనుంది. -
నిప్పు రాజేస్తున్న నీళ్లు!
⇒ కృష్ణా బేసిన్లో ఆది నుంచీ తెలంగాణ, ఏపీ మధ్య వివాదాలే ⇒ నీటి వాటాలు, ఉల్లంఘనలపై పరస్పర ఫిర్యాదులు ⇒ బ్రజేశ్ ట్రిబ్యునల్ ముందు సైతం భిన్న వాదనలే ⇒ పాలమూరు, డిండితో మరింత ముదిరిన వివాదం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నదీ జలాల వివాదం నిరంతరం నిప్పును రాజేస్తూనే ఉంది. రాష్ట్ర పునర్విభజనకు ముందు, ఆ తర్వాత కూడా దీని చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్నాయి. విభజన చట్టంలోని అనేక అంశాలు కొలిక్కి వస్తున్నా నీటి పంపకాల వివాదం మాత్రం తేలడం లేదు. విభజన అనంతరం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీటి వినియోగం, ప్రాజెక్టుల నియంత్రణపై మొదలైన రగడ 27 నెలలుగా రగులుతూనే ఉంది. కృష్ణా బోర్డు, కేంద్రం జోక్యం చేసుకున్నా వీటికి ఫుల్‌స్టాఫ్ పడటం లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర జల వనరుల శాఖ నిర్వహిస్తున్న అపెక్స్ కౌన్సిల్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకనైనా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి పరిష్కారం దొరుకుతుందా? లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ట్రిబ్యునల్ ముందూ భిన్న వాదనలే కృష్ణా జలాల వివాదంపై విచారణ చేస్తున్న బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టుల సామర్థ్యం, వాటి కింద ఉన్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని ప్రతి ప్రాజెక్టుకూ కేటాయింపులు చేయాలని తెలంగాణ వాదిస్తోంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా నీటి కేటాయింపులు మాత్రం మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతమే ఉన్నాయి. తెలంగాణలో ఉన్న ఆయకట్టు ప్రాంతం 62.5 శాతాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు ఏమాత్రం సరిపోవ ని వాదిస్తోంది. ఏపీలో పరీవాహక ప్రాంతం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా.. మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. మొత్తం జలాల్లో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా రాష్ట్రానికి కేటాయింపులు పెరగాలన్నది రాష్ట్రం వాదన. తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండిలను ఏపీ తప్పుపడుతుండగా.. పట్టిసీమ, పోలవరంలో తమకు 90 టీఎంసీల వాటా వస్తుందని తెలంగాణ అడుగుతోంది. నియంత్రణపై తలోమాట.. ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణపైనా ఇరు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతోంది. ప్రాజెక్టులన్నింటినీ కృష్ణా బోర్డు నియంత్రణలో ఉండాలని ఏపీ పట్టుబడుతుండగా.. తెలంగాణ అం గీకరించడం లేదు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ కాల పరి మితిని రెండేళ్లు పెంచారని, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై నిర్ణయం చేసే వరకు నియంత్రణ అన్న ప్రశ్నే ఉండదని చెబుతోంది. ఇరు రాష్ట్రాలకు కృష్ణా కేటాయింపులు ఇలా.. (టీఎంసీలో) రాష్ట్రం నికర జలాలు మిగులు జలాలు తెలంగాణ 298.96 77.00 ఏపీ 512.04 150.45 మొత్తం 811.00 227.45 -
నేడు కృష్ణ ట్రిబ్యునల్ విచారణ
-
'కృష్ణా' పై విచారణ సెప్టెంబర్ 10 కి వాయిదా
ఢిల్లీ: కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కృష్ణా జలాల అంశంలో కేంద్రం వైఖరి ఏంటో చెప్పాలని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం కోరింది. అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ లోఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది. కాగా తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీకి కేటాయించిన నీటిలో వాటా తీసుకోవాలని సూచించింది. అయితే ట్రిబ్యునల్ లో తమకు మొదటి నుంచి అన్యాయం జరిగిందని తెలంగాణ సర్కార్ వాదనలు వినిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ అవసరాలను పరిరక్షించలేదని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని టీ సర్కార్ సుప్రీంను కోరింది. మరో వైపు ఏపీ ప్రభుత్వం తమ వాదనలు సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పున:సమీక్షించాలని ఏపీ సర్కార్ అభ్యర్థించింది. కృష్ణా నీటి లభ్యత లెక్కింపులో సరైన విదానం పాటించలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 10 వతేదీకి వాయిదా వేసింది. -
‘కృష్ణా’పై తాడో పేడో..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం నుంచి సుప్రీంకోర్టులో తుది వాదనలు జరుగనున్నాయి. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పుతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని.. దానిని కొట్టివేసి, నీటిని 4 రాష్ట్రాల మధ్య తిరిగి పంపిణీ చేయాలని ఇరు రాష్ట్రాలు గట్టిగా వాదించేందుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలోని కృష్ణా బేసిన్ మొత్తం నీటి కరువు కారణంగా ఎదుర్కొంటున్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురానుంది. కృష్ణా జలాల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై బుధవారం నుంచి సుప్రీం లో విచారణ జరుగనుంది. బ్రిజేష్ తీర్పును త్వరగా అమలు చేయాలని కర్ణాటక, మహారాష్ట్రలు కోరుతుండగా.. 4 రాష్ట్రాల మధ్య మళ్లీ నీటి పంపకాలు చేయాలని తెలంగాణ కోరుతోంది. అసలు నీరు తక్కువగా ఉన్నప్పుడు ఏ ప్రాజెక్టు నుంచి ఎంతనీరు, ఎవరు ఎవరికి విడుదల చేయాలన్నదానిపై నిర్దేశాలను స్పష్టంగా తెలపాలని టీ సర్కారు తన పిటిషన్లోనే విజ్ఞప్తి చేసింది. తక్కువ నీటి లభ్యత ఉన్న సమయాల్లో ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగువకు నీటిని విడుదల చేయాలని విన్నవించింది. దీనిపై ట్రిబ్యునల్ సూచనలు ఇవ్వాల్సి ఉందని.. కనుక ట్రిబ్యునల్ అన్ని రాష్ట్రాల వాదనలు సమీక్షించాలని కోరింది. నష్టాన్ని పూడ్చాలి..: నీటి లభ్యతను అం చనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు అనుమతించడం వంటి కారణాలతో ఇప్పటికే 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతున్నామని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో కోర్టుకు తెలిపింది. మిగులు జలాలు సైతం 150 టీఎంసీల మేర ఏపీకి కేటాయించగా.. తెలంగాణకు 77 టీఎంసీలే కేటాయించారని పేర్కొంది. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్ల ముందు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించే వెసులుబాటు కలగని దృష్ట్యా.. తమ కు ఇప్పుడు అవకాశం కల్పించాలని సుప్రీంను కోరింది. గతంలోనే కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపులకై విజ్ఞప్తి చేసినా, ట్రిబ్యునల్ పట్టించుకోని దృష్ట్యా... ఇప్పుడు పునఃసమీక్ష చేయాలని అభ్యర్థించనుంది. స్థూలంగా మిగులు జలాలు, నికర జలాలు కలుపుకొని మొత్తంగా మరో 400 టీఎంసీల మేర కేటాయింపులు కోరేలా అధికారులు వాదనలు సిద్ధం చేశారు. -
తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలకు సుప్రీం కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్‌లో పొందపరచవద్దని ఏపి ప్రభుత్వం సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచాకరణకు స్వీకరించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ** -
మరో 400 టీఎంసీల కృష్ణా నీరివ్వండి
-
వాటా పెంచండి
* మరో 400 టీఎంసీల కృష్ణా నీరివ్వండి * బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను కోరనున్న తెలంగాణ సర్కార్ * ప్రాజెక్టులవారీగా కేటాయింపులు జరగాలి * పాలమూరు, జూరాల-పాకాలకే 130 టీఎంసీలు * ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణకు ఆది నుంచీ అన్యాయమే * బలమైన వాదనలతో నివేదిక సిద్ధం చేసిన సర్కారు * రాష్ర్టం తరఫు లాయర్‌తో చర్చలకు నేడు ఢిల్లీకి అధికారులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై రాష్ర్ట ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సరైన వాదనలు వినిపించకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని సర్కారు భావిస్తోంది. కృష్ణా నదీ జలాల్లో ప్రస్తుతం తగిన వాటా దక్కనందున ఇకపై జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంది. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట గట్టి వాదనలు వినిపించడానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ ట్రిబ్యునల్ పునః పరిశీలన చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో జరిగిన అన్యాయాన్ని సమర్థంగా వివరించి ఎక్కువ లబ్ధి పొందాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణకు ప్రస్తుతమున్న కే టాయింపులకు తోడు అదనంగా 400 టీఎంసీల నీటిని ఇవ్వాలని సమర్థంగా వాదించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వివరాలను ట్రిబ్యునల్ ముం దుంచనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే అధికంగా ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా లేవనెత్తనుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే అదనపు నీటి కేటాయింపులు సమంజసమేనన్న వాదనను రాష్ర్ట ప్రభుత్వం వినిపించనుంది. 17న ట్రిబ్యునల్‌కు నివేదిక రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 89(ఎ), సెక్షన్ 89(బి)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి? లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు ఎలా జరపాలన్న అంశాలను బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా నిర్ణయించాల్సి ఉంది. దీనిపై చేపట్టిన విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల అభిప్రాయాలను ఆరు వారాల్లో తెలపాలని ట్రిబ్యునల్ కోరింది. అయితే నిర్ణీత సమయం మించిపోవడంతో రాష్ట్రాలు మరో రెండు వారాల అదనపు సమయం కోరడంతో ట్రిబ్యునల్ అందుకు అంగీకరించింది. దీని ప్రకారం ఈ నెల 17న రాష్ట్రాలు తమ అభిప్రాయాలతో కూడిన నివేదికను బ్రిబ్యునల్కు సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు దీనిపై కసరత్తును పూర్తి చేశాయి. తెలంగాణ సర్కారు సైతం తన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. ఈ నివేదికను రాష్ట్రం తరఫు న్యాయవాది వైద్యనాథన్‌కు అందించి, ఆయనతో చర్చలు జరిపేందుకు సంబంధిత అధికారులు శనివారం నాడు ఢిల్లీ వెళుతున్నారు. పరీవాహక ప్రాంతం, ఆయకట్టును బట్టి వాటా విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఉండాలని టీ సర్కారు కోరుకుంటోంది. ప్రాజెక్టుల సామర్థ్యం, వాటికింద ఉన్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకొని కేటాయింపులు చేయాలని వాదించనుంది. ఇదే సమయంలో నీటి లోటు ఉన్నప్పుడు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లోని ప్రాజెక్టుల నుంచి దిగువ ప్రాంతాలకు ఎంత నీటిని విడుదల చేస్తారన్నది ట్రిబ్యునల్ తేల్చాలని కోరనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకాంశాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లనుంది. * కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా.. మొత్తం కేటాయింపుల్లో కేవలం 35 శాతమే నీటి కేటాయింపులు ఉన్నాయి. * తెలంగాణలోని 62.5 శాతం ఆయకట్టును లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుత కేటాయింపులు ఏమాత్రం సరిపోవు. * ఆంధ్రప్రదేశ్‌లో పరీవాహక ప్రాంతం 31.5 శాతం, ఆయకట్టు 37.5 శాతమే అయినప్పటికీ మొత్తం జలాల్లో 60 శాతానికి పైగా నీటి కేటాయింపులు జరిపారు. * మొత్తం జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512.04 టీఎంసీలు దక్కగా, తెలంగాణకు కేవలం 298.96 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా తెలంగాణకు దక్కిన వాటా మరింత పెరగాల్సి ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. నీటి అవసరాలూ పరిగణనలోకి.. ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చే ప్రాజెక్టులకు, ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయింపులు పెంచాలని కూడా రాష్ర్ట ప్రభుత్వం వాదిస్తోంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు అవసరానికి మించి నీటి కేటాయింపులు జరిపారని, అవసరమైతే ఇందులో కోత పెట్టి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరిన్ని జలాలు కేటాయించాలని ట్రిబ్యునల్‌ను సర్కారు కోరనుంది. ఇందుకు 15 టీఎంసీల అదనపు కేటాయింపులు కోరాలని నిర్ణయించింది. అలాగే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 77 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం గత ట్రిబ్యునల్ వాదనల్లోనే విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, దీనిపై పునఃసమీక్ష చేసి కేటాయింపులు జరపాలని కూడా సర్కారు అభ్యర్థించనుంది. ఇవేగాక రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతలకు సుమారు 130 టీఎంసీల మేర నీటి కేటాయింపులు కోరుతూ నివేదిక సిద్ధం చేసింది. స్థూలంగా మిగులు జలాలు, నికర జలాలు కలుపుకొని మొత్తంగా మరో 400 టీఎంసీల అదనపు కేటాయింపులు కోరేందుకు రాష్ర్టం సన్నద్ధమైంది. -
రాజోలి రగడ
కర్నూలు(రూరల్)/ఎమ్మిగనూరు: రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్) మరోసారి వివాదాస్పదమైంది. రాయలసీమ-తెలంగాణ ప్రాంతాల మధ్య తరచూ గొడవలకు కారణమవుతున్న ఈ ఆనకట్టు.. తాజాగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య చిచ్చు రేపింది. సీమ వైపు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఆధునికీకరణ పేరిట ఏకంగా అర అడుగు ఎత్తు పెంచే ప్రయత్నాం చేయడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు పూర్తిస్థాయిలో అమలు కాకమునుపే.. అందులోనూ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటా పంపకాలు చేపట్టక ముందే కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంపునకు శ్రీకారం చుట్టడం జల వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో తుంగభద్ర నదిపై అడ్డంగా నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్ట వివాదం ఆది నుంచి కొనసాగుతోంది. ఆర్డీఎస్ ఎడమ కెనాల్ ద్వారా కర్ణాటకలో 7500 ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాలకు.. కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప జిల్లాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అయితే కర్ణాటక కుటిల రాజకీయంతో ఆంధ్రాలో కుడికాలువ నిర్మాణానికి నోచుకోలేదు. సుంకేసుల డ్యాం ద్వారా కేసీ కెనాల్‌కు అందుతున్న నీరే ఆర్డీఎస్ నీటి వాటాగా తెలంగాణవాదులు మెలికపెడుతూ వచ్చారు. 2003లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే ఆ పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నేతల సహకారంతో ఆర్డీఎస్ ఆనకట్టకు కర్నూలు వైపు మూసి ఉన్న స్లూయిస్(వెంట్)లను రైతులు ధ్వంసం చేశారు. దీంతో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల రైతులు.. ప్రజాప్రతినిధుల మధ్య జల వివాదం చెలరేగింది. రెండు ప్రాంతాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో అప్పట్లో పలువురికి గాయాలయ్యాయి. 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మొత్తం 5 స్లూయిస్‌లో నాలుగింటిని మూయించారు. అప్పటి నుండి ఈ వివాదం సద్దుమణిగింది. వైఎస్ మరణానంతరం ఆగస్టు 14, 2010న మరోసారి ఆర్డీఎస్ వివాదం చెలరేగినా అప్పటి మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, అబ్రహాం(అలంపూర్) చొరవతో ఇరుప్రాంత రైతులు శాంతించారు. ఆనకట్ట ఎత్తు పెంపునకు కర్ణాటక కుట్ర ఆధునికీకరణ పనుల పేరిట ఆర్డీఎస్ ఆనకట్ట ఎత్తును అర అడుగు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం పన్నిన కుటిల యత్నాన్ని కోసిగి మండలం రైతులు ఆదివారం అడ్డుకున్నారు. ఇప్పటికే కర్నూలు వైపున్న అన్ని స్లూయిస్‌లను మూయించి మా కడుపులు కొట్టడమే కాకుండా ఏకంగా ఆనకట్ట ఎత్తు పెంచి తాగునీరు కూడా రాకుండా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆర్డీఎస్ ఆనకట్ట వద్దకు చేరుకొని పనులను నిలుపుదల చేయించారు. కర్నూలు రైతుకు కష్టకాలం: జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరరాలకు ప్రధాన వనరు తుంగభద్ర నది. తీరం వెంబడి విస్తరించిన పశ్చిమ ప్రాంతంతో పాటు కేసీ కెనాల్ పరీహాహకమంతా ఈ నదితోనే పెనవేసుకుంది. ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక, పాలకుల్లో చిత్తశుద్ధి కొరవడటంతో ఆది నుంచి జిల్లాకు అన్యాయం జరుగుతోంది. ఆర్డీఎస్కు దిగువనున్న మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల రైతులు నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తోంది. -
సీఎంతో సీమాంధ్ర నేతల మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులో జోక్యం కోరుతూ ప్రధాని మన్మోహన్‌ను కలిసేందుకు శుక్రవారం ఢిల్లీకి వచ్చిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రాంత నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని ఏపీభవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సాయిప్రతాప్, హర్షకుమార్, రాష్ట్ర మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథిలు సమావేశమయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన నేతలు రాష్ట్ర విభజన అంశంపై చర్చించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ మొదలైన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలన్నదానిపై సమాలోచనలు జరిపారు. ముఖ్యంగా బిల్లులోని లోటుపాట్లను కేంద్రం దృష్టికి తెస్తూనే, విభజనను వ్యతిరేకిస్తూ శాసనసభ్యులందరితో రాష్ట్రపతికి అఫిడవిట్లు సమర్పించాలని నేతలంతా అభిప్రాయపడినట్లు సమాచారం. రాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల నుంచి వ్యతిరేకత వస్తే, రాష్ట్రపతి.. విభజనకు ఆమోదం తెలపడం అంత సులభతరం కాదని, పార్లమెంట్‌లోనూ తాము ఈ అంశాన్ని నొక్కిచెబుతూ సమైక్యాంధ్రకు వివిధ పార్టీల మద్దతు కూడగడతామని ఎంపీలు చెప్పినట్టు తెలిసింది. -
బిజేశ్ తీర్పుపై నేడు ప్రధానితో అఖిలపక్షం భేటీ
-
బిజేశ్ తీర్పుపై నేడు ప్రధానితో అఖిలపక్షం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష ప్రతినిధి బృందం శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీకానుంది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ నేతలు గురువారమే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వీరందరూ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన నివాసంలో కలుస్తారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మరో ముగ్గురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత, మా జీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులున్నారు. రాష్ట్రానికి కృష్ణా నీటిని కేటాయించే విషయంలో ట్రిబ్యునల్ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదనే అంశాన్ని ప్రధాని దృష్టికి తెస్తామని, శుక్రవారం ఉదయం 10 గంటలకు అన్ని పక్షాల నేతలతో మన్మోహన్సింగ్ను కలుస్తామని నాగిరెడ్డి తెలిపా రు. మిగులు జలాల కేటాయింపు సక్రమంగా లేదని, ఈ విషయాన్నే ప్రధాని దృష్టికి తీసుకువస్తామని జూలకంటి చెప్పారు. మిగులు జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టుల భవిష్యత్‌ను ఏమి చేస్తారనేదాన్ని ప్రశ్నిస్తామని గుండా మల్లేశ్ తెలిపారు. -
విభజనతో రైతులకు తీరని నష్టం
పొదలకూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది రైతులేనని, జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు ఎడారిలా మారుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సమైక్య ఉద్యమంలో భాగంగా బుధవారం పొదలకూరు పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్ నుంచి రామ్‌నగర్ గేట్ సెంటర్ వరకు 100 ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న కాకాణి మాట్లాడారు. బిజేష్ ట్రిబ్యూనల్ తీర్పు ఈ పాటికే సీమాంధ్ర రైతులకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. మిగులు జలాలు ఆంధ్రాకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి తీర్పు వెలువడిన నేపథ్యంలో రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని ప్రాజెక్ట్‌లకు చుక్కనీరు రాదన్నారు. మహానేత వైఎస్సార్ శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వెడల్పు పెంచడం వల్ల సోమశిలకు 22 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్ సజీవంగా ఉండి ఉంటే 60 వేల క్యూసెక్కులకు పెంచేవారన్నారు. వ్యవసాయం శుద్ధ దండగంటూ తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన చంద్రబాబునాయుడు రైతులను నిలువునా ముంచారని ఆరోపించారు. వైఎస్సార్ సీఎం అయిన తర్వాత వ్యవసాయం పెద్దపండగంటూ రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు. సోనియాగాంధీ తన కుమారుడు రాహుల్‌గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే దుష్టసంకల్పంతో రాష్ట్రవిభజనకు పూనుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొడిగడుతున్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన వైఎస్సార్ కుటుంబంపై ఆ పార్టీ నేతలు విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఉసురు తగిలి కాంగ్రెస్ పార్టీ దేశంలోనే భూస్థాపితం కాబోతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందంటూ ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రజలు గమనించాలన్నారు. చంద్రబాబునాయుడు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గోగిరెడ్డి గోపాల్‌రెడ్డి, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, నాయకులు మద్దిరెడ్డి రమణారెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, డీ విజయభాస్కర్‌రెడ్డి, ఏనుగు శశిధర్‌రెడ్డి, గూడూరు శ్రీనివాసులు, వెన్నపూస దయాకర్‌రెడ్డి, తుమ్మల వెంకటకిషోర్, తదితరులు పాల్గొన్నారు. -
‘పిట్టల పోరు’లో ‘బ్రిజేశ్’ పిల్లి!
విశ్లేషణ: ‘విభజన’ రొచ్చులో కూరుకుపోయినందున, బ్రజేష్ ట్రిబ్యునల్ కూడా మన రాష్ట్రానికి నదీ జలాల కేటాయింపులలో శ్రద్ధ చూపలేదు. నాలుగేళ్ల సంక్షోభం కారణంగా రాష్ట్ర పాలకులు రెండవ ట్రిబ్యునల్ ముందు వాదించాల్సిన న్యాయవాదులనూ, సేద్యపు నీటి అధికారులనూ తరుచూ మార్చేస్తూ ఉండటం వల్ల కూడా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటూ వచ్చాయి. ‘‘నీటి వనరులను, ముఖ్యం గా నదీజలాలను అభివృద్ధి చేసు కోవడం మీదనే దేశ ఆర్థికాభ్యు న్నతి ఆధారపడి ఉంటుంది. ఇం డియా లాంటి దేశంలో వర్షపా తం అన్ని చోట్లా తగినంతగా ఉండదు. ఉన్నా, నమ్మి ఉండ లేని పరిస్థితి. కనుక దేశంలో వ్యావసాయిక, పారిశ్రామిక అభి వృద్ధి కోసం నదీజలాలను పుష్కలంగా వినియోగించు కోవాల్సిన అవసరం ఉంది. దేశంలోని ప్రధాన నదులన్నీ అంతర్రాష్ట్ర నదులే. అందువల్ల అవి రాష్ట్రాల మధ్య రాజ కీయ సరిహద్దుల్ని అధిగమించి మరీ ప్రవహిస్తుంటాయి’’ - ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా’’: ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ ప్రచురణ (1971) ఇటీవల కాలంలో తెలుగుజాతిని రాజకీయ ప్రయోజ నాల కోసం చీల్చే కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ‘అన్నపూర్ణ’, ‘ధాన్యాగారాలలో ఒకటి’ అన్న పేర్లను, చేకూరుతున్న ప్రయోజనాలను పాలకులూ, పక్షాలూ దెబ్బతీస్తూ వచ్చాయి. చచ్చువో, పుచ్చువో 1969 నాటి మొదటి బచావత్ (కృష్ణా జలవివాదాల పరిష్కారం కోసం) ట్రిబ్యునల్, ఆ తరువాత అదే జలరాశి వినియో గంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి 2010 డిసెంబర్లో ఏర్పడిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కొన్ని సిఫారసులు చేశాయి. ఈ సిఫారసులు, ఇచ్చిన తీర్పులలో కొన్ని లోపాలు ఉండ వచ్చుగాని, పూర్తిగా వాటిని తోసి వేయలేము. ఎందు కంటే, మన రాష్ట్రానికి ఎగువన ఉన్న రాష్ట్రాల ప్రయోజనా లను గౌరవించటంతో పాటు మన లాంటి దిగువన ఉన్న రాష్ట్రాల నీటి అవసరాలను గుర్తించి గౌరవించాలని కూడా ఆ ట్రిబ్యునల్స్ చెప్పకపోలేదు. కాని, అదే సమయంలో ఫలానా వ్యవధిలోగా కృష్ణా జలరాశిలోని మిగులు జలా లను కర్ణాటక, మహారాష్ర్టలకు దిగువన ఉన్న రాష్ట్రం (ఆం ధ్రప్రదేశ్) ఒక హక్కుగా కాకుండా వినియోగపు విలువ ప్రకారం, ఆ జలరాశి వృథాగా సముద్రం పాలుకాకుండా వాడుకోవచ్చునని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. అంటే 2001వ సంవత్సరంలో కాలపరిమితి ముగిసిపో యిన బచావత్ ట్రిబ్యునల్, ఆ పరిమితికి ముందే ఆంధ్ర ప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణానికి అభ్యంతరం చెప్పలేదు. అలుసైన ఆంధ్రులు కర్ణాటక ఆల్మట్టి గేట్ల ఎత్తును పెంచుకుంటూ పోతున్నప్పు డు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. 1956 నాటి కేంద్ర జల వ్యవస్థ నియంత్రణ కమిషన్ చట్టం ప్రకారం ఏర్పడిన బచావత్ ట్రిబ్యునల్ సిఫారసుల ప్రకారం కృష్ణా నదిలోని 2173 శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీ) ‘నికర జలా ల’ను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాష్ట్రాల పరీ వాహక ప్రాంతాల అవసరాలను బట్టి పంపిణీ జరగాలని చెబుతూ, ఆల్మట్టిడ్యామ్ ఎత్తును 524025 మీటర్లకే సుప్రీం నియంత్రించాల్సివచ్చింది! కాని ఆంధ్రప్రదేశ్‌కు జలరాశిలో దక్కవలసినంత వాటా అందుబాటులోకి రాక పోవడానికి కారణం ఏమిటి? అప్పుడప్పుడు పాలకుల, కొందరు విపక్ష నేతల రాజకీయ ప్రయోజనాలు, రాష్ట్రంలో ఈ ప్రజా వ్యతిరేక పక్షాలు బిళ్లబాటుగా అర్థాంతరంగా ప్రజలపై రుద్దిన తెలుగు జాతి విభజన సమస్య వల్ల ఏర్పడిన రాజకీయ అనిశ్చితి కారణాలు. పాలకులూ, ప్రతి పక్షాలూ ‘విభజన’ రొచ్చులో కూరుకుపోయినందున, బ్రిజేశ్ ట్రిబ్యునల్ కూడా మన రాష్ట్రానికి నదీజలాల కేటా యింపులలో శ్రద్ధ చూపలేదు. నాలుగేళ్ల సంక్షోభం కార ణంగా రాష్ట్ర పాలకులు రెండవ ట్రిబ్యునల్ ముందు వాదించాల్సిన న్యాయవాదులనూ, సేద్యపు నీటి అధికా రులనూ తరుచూ మార్చేస్తూ ఉండటం వల్ల రాష్ట్ర ప్రయో జనాలు దెబ్బతింటూ వచ్చాయి. ఫలితంగా ‘పిట్టపోరు ,పిట్టపోరు పిల్లి’- ‘బ్రిజేశ్ పిల్లి’ పద్ధతిలో తీర్చినట్టయింది! రెండు ట్రిబ్యునళ్ల లెక్కలు జలరాశి పంపకం విషయంలో కూడా ఈ ట్రిబ్యునల్స్ కొన్ని సంవత్సరాల మీదట ‘జల సంవత్సరం’ (వాటర్ ఇయర్)లో సగటున ఏటా ఎంత టీఎంసీ నీరు లభ్యమవు తుందో కట్టే లెక్కలు కూడా ఊహాజనితంగా తయారు కావటంతో కొన్ని సమస్యలు తలెత్తుతూవచ్చాయి. ఒక ట్రిబ్యునల్ (బచావత్) మూడు రాష్ట్రాలకు పంచగల నికర జలరాశిని ఉజ్జాయింపుగా నదిలో నమ్మకమైన నీటి లభ్య తను (డిపెండబిలిటీ) 75 శాతమని గణించుకుని దాని ఆధారంగా 2060 టీఎంసీని మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో మన రాష్ట్రానికి 1973లో పంపకం చేసిన మొత్తం 800 టీఎంసీ కాగా, తాజాగా బ్రిజేశ్ ట్రిబ్యు నల్ ఆ మొత్తం వాటాను మనకు అదనంగా మరో 301 టీఎంసీగా, అంటే మొత్తం 1001 (800+301) టీఎంసీగా నిర్ణయించింది. కాగా, బ్రిజేశ్ ట్రిబ్యునల్ విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా జలరాశి నమ్మకంగా ఉండగ లదని (డిపెండబిలిటీ) 47 సంవత్సరాల రికార్డును గణన లోకి తీసుకుని అంచనా వేసింది, 65 శాతం! అంటే బచా వత్ అంచనాకు, బ్రిజేశ్ అంచనాకు ‘నమ్మకంగా చేరగల జలరాశి’ 10 శాతం తేడా ఉంది. బ్రిజేశ్దీ ఉజ్జాయింపు శాతమే! ఏడాదిలో మూడు రాష్ట్రాల మధ్య కేటాయిం పులకు వీలైన మొత్తం సగటు నీరు 2578 టీఎంసీలని లెక్క గట్టి, మళ్లీ ఆ ఉజ్జాయింపులో 16 శాతం జలరాశిని కిందికి సముద్రంలోకి వృథాగా పోయే నీరుగా మినహాయిం చింది! ఈ సందర్భంగా బ్రిజేశ్ ట్రిబ్యునల్ చేసిన ఒక వ్యాఖ్య గమనించదగింది. ‘సముద్రంలోకి వెళ్లి కలిసే తగి నంత నీటిని వెళ్లనివ్వకుండా మొత్తం నీటిని వినియో గంలోకి తెస్తే ఉప్పురుకి పోయిన నీరు వ్యవసాయ క్షేత్రా లకే కాదు, మనుషులకు, పశువులకూ కూడా పనికిరాదు. అందుకనే నదీలోయలో ఆ ఉప్పురికిన నీరు పేరుకుపో కూడదు’. అంతేగాదు, ఉప్పు ఎగుమతుల అవసరాలను, పర్యావరణ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇం తకుముందు బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయిం పుల పరిధిని దాటి అదనంగా నీటి కేటాయింపులు సాధ్య పడదని బ్రిజేశ్ ట్రిబ్యునల్ తాజాగా స్పష్టం చేసింది! మరి ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలు తీరాలంటే ఏం చేయాలట? గోదావరి నది లాంటి పక్క పక్కనే ఉన్న నదు ల నుంచి, కర్ణాటకలో పశ్చిమంగా పారే నదుల నుంచి నీటిని ఎరువు తెచ్చుకొనక తప్పదని బ్రిజేశ్ ట్రిబ్యునల్ ‘చావు కబురు చల్లగా’ వదులుతోంది! ఇక్కడే ఉన్నాయి చట్టాలు సహజ నదీ జలరాశిలో రాష్ట్రాల హక్కులను ఎలా కాపాడు కోవాలో గత 140 సంవత్సరాలుగా మన దేశంలో అమలు లో ఉన్న సేద్యపు నీటి (ఇరిగేషన్) చట్టాలు నిర్దేశిస్తు న్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ప్రాంతపు ఇరిగేషన్ చట్టాలు), మద్రాసు హైకోర్టు తీర్పులూ వగైరా ఎన్నో ఉన్నాయి. దాదాపు ఈ చట్టాలన్నీ రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల లోపలా ఎగువనున్న ప్రాంతాలు దిగువనున్న ప్రాంతాల (పరీవాహక ప్రాంతాల) అవసరాలకు సమ ప్రాతిపదికపైన జలాల వినియోగాన్ని అనుమతించాల్సిం దేనని స్పష్టం చేస్తున్నాయి. అయితే కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర పాలకులు కొందరు కొన్నాళ్లుగా తమకు దిగు వన ఉన్న ఆంధ్రప్రదేశ్ అవసరాలకు సహజ సూత్రాలకు, సహజ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనికి ‘విభజన’తో ఆజ్యం పోస్తున్నవారు తెలుగు జాతి లోని ‘గుప్పెడు’ వేర్పాటువాదులు. ‘సందట్లో సడేమి యా’ల విద్రోహాన్ని ఆసరా చేసుకుని మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దిగువనున్న ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలా లను నియంత్రిస్తూ చడీచప్పుడు లేకుండా ‘బాబ్లీ’ గేట్లు పెంచేసి కట్టేసుకుంది. మనలోని వేర్పాటువాదులు మాసా ల తరబడి గుడ్లప్పగించి కూర్చున్నారే తప్ప దీనిని పసి కట్టలేక పోయారు (ఈ రచయిత, అతని వార్తా సిబ్బందీ మేల్కొని ‘ఇక బాబ్లీ కథ ముగిసింద’ని పతాక శీర్షికలో హెచ్చరించే దాకా రాజకీయ పక్షాల నాయకులంతా కుంభకర్ణుడి నిద్ర లోనే జోగుతూ వచ్చారు). దిగువ రాష్ట్రాలకే ఓటు మన దేశీయ చట్టాలే కాదు, అంతర్జాతీయ జల వివాదాలు సహితం దిగువన ఉన్న దేశాలకే, రాష్ట్రాలకే జలరాశి పంపి ణీలు, కేటాయింపులో ప్రాధాన్యం కల్పించాయని మరవ రాదు. మన దేశంలో కూడా నదీ జలాల తగాదాలకు న్యా యస్థానాలను ఆశ్రయించి లాభంలేదు. ఫెడరల్ వ్యవస్థలో ఈ సమస్యకు పరిష్కారం నిపుణులతో కూడిన కేంద్రీయ జలపంపిణీ వ్యవస్థతోనే సాధ్యం. ప్రాంతీయ తగాదాలకు ముగుదాడు కూడా అదే కావాలి. కృష్ణ-గోదావరి, నర్మద సహా దేశంలోని జలవివాదాలన్నింటికీ కారణం- ప్రజా హిత పరిపాలనా వ్యవస్థ ఇంకా అవతరించకపోవడమే. ట్రిబ్యునళ్లు సంబంధిత రాష్ట్రాల వాస్తవావసరాలను పూర్తి గా గణించలేవు. ఇందుకు ఉదాహరణలు - కావేరీ జలాల వివాదంలో తమిళనాడుతోనూ, కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్‌తోనూ పేచీలకు దిగిన కర్ణాటక నిర్ణయాలను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు బాహాటంగా ప్రకటిం చడమే! చివరికి చరిత్రగల తెలుగువాడి పనితీరు - ‘పిఠాపురం వెళ్లి పిడితెడు నీళ్లు తెచ్చినట్టయింది!! - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు