న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే | krishna water dispute tribunal | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే

Sep 14 2017 3:11 AM | Updated on Aug 29 2018 9:29 PM

న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే - Sakshi

న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే

కృష్ణా నదీ జలాల్లో దశా బ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సవరిం చాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌ మీదే ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

► బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు రాష్ట్రం వాదనలు ప్రారంభం
► పంటల పరిస్థితికనుగుణంగా నీటి వాటాలు పెంచండి
► కృష్ణా బోర్డు పరిధిని ట్రిబ్యునల్‌ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల్లో దశా బ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని సవరిం చాల్సిన బాధ్యత ట్రిబ్యునల్‌ మీదే ఉందని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర పరీవాహకం, ఇక్కడి పంటల పరిస్థితిని దృష్టి లో పెట్టుకొని వాటాలు పెంచాలని కోరింది. కృష్ణా జలాల పంపిణీపై వాదనలు వింటున్న బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌.. బుధవారం నుంచి తిరిగి విచారణ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ప్రతిపా దించిన విచారణ అంశాలపై సమర్పించిన అదనపు పత్రాలపై వాదనలు ఆరంభిం చింది. తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు ఆరంభించారు. ట్రిబ్యునల్‌ ఆర్డర్‌లో పలు అంశాలకు సంబంధించి గత జూలైలో ప్రతిపాదించిన సవరణలు పూర్తి చేయాలని కోరగా, అందుకు ట్రిబ్యునల్‌ అంగీకారం తెలిపింది. అలాగే కృష్ణా బోర్డు పరిధిని ట్రిబ్యునల్‌ పరిధిలోకి తేవాలని కోరారు. ప్రస్తుతం 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు తెలంగాణకు దక్కేలా ఒప్పందం కుదరగా, దాన్ని కృష్ణా బోర్డు అమలు పరుస్తోందని, దాన్నే అమలు పరచాలని ఏపీ కోరగా తెలంగాణ అభ్యంతరం చెప్పింది.

నదీ వ్యవస్థను మార్చవద్దు: ఏపీ
నీటి వాటాల్లో మార్పులు చేయరాదని ట్రిబ్యు నల్‌ను ఏపీ కోరింది. ఈ మేరకు 36 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమని, 60 శాతం జనాభా దానిపై ఆధారపడి ఉందని అందులో తెలిపింది. అందుకు భిన్నంగా తెలంగాణలో ఐటీ, ఆర్థిక రంగం, ఫార్మా, తయారీ కంపెనీ లు ప్రధాన ఆదాయ, ఉపాధి వనరులుగా ఉన్నాయని పేర్కొంది. ‘పశు, కోళ్ల, మత్స్య, కోడి గుడ్ల ఉత్పత్తిలో దేశంలో 70 శాతం వాటా ఏపీ నుంచే ఉంది. వీటన్నింటికీ కృష్ణా డెల్టా వ్యవస్థే ఆధారం. ఏపీ ప్రాజెక్టులన్నీ కృష్ణా జలాలపైనే ఆధారపడి ఉన్నాయి’ అని వివరించింది. 1976లో బచావత్‌ అవార్డు ప్రకారం ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలను పంచగా, ఇందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు దక్కాయని, మూడేళ్లుగా ఇదే విధానం కొనసాగుతోందని చెప్పింది.

ఆయకట్టు, ప్రాజెక్టుల కింది నీటి వినియోగంలో ఎలాంటి మార్పులు లేవని, ఇలాంటి సమయంలో నీటి వాటాల్లో మార్పులు చేస్తే అది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దాదాపు 150 ఏళ్లుగా ఉన్న నదీ వ్యవస్థను మార్చే పనులు చేయరాదని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు 214.14 టీఎంసీలు తరలిస్తోందని, ఇందులో హైదరాబాద్‌ తాగునీటికి జీ–4 బేసిన్‌ నుంచి మూసీ బేసిన్‌కి 6.43 టీఎంసీలు, ఎస్సారెస్పీ స్టేజ్‌–1, 2ల నుంచి 68.48 టీఎంసీలు, ప్రాణహిత– చేవెళ్ల ద్వారా 83.19 టీఎంసీలు, గోదావరి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ద్వారా మరో 24.65 టీఎంసీలు కృష్ణా బేసిన్‌కు తరలిస్తున్నారని, ఇందిరమ్మ వరద కాల్వ, సీతారామ ఎత్తిపోతల, రామప్ప సరస్సు ద్వారా మరో 31.39 టీఎంసీలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఇందులో ఏపీ వాటా ఏమిటో తేల్చాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement