సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి అన్యాయం జరిగేలా కృష్ణా జలాలపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు అమలును నిలిపేయాలని కోరేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష ప్రతినిధి బృందం శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీకానుంది. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, బీజేపీ నేతలు గురువారమే హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. వీరందరూ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆయన నివాసంలో కలుస్తారు. ఢిల్లీకి వెళ్లిన వారిలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మరో ముగ్గురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటే శ్వర్లు, ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, టీడీపీ నుంచి కోడెల శివప్రసాదరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేశ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు, శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి, బీజేపీ నేత, మా జీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, పార్టీ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు తదితరులున్నారు.
రాష్ట్రానికి కృష్ణా నీటిని కేటాయించే విషయంలో ట్రిబ్యునల్ వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోలేదనే అంశాన్ని ప్రధాని దృష్టికి తెస్తామని, శుక్రవారం ఉదయం 10 గంటలకు అన్ని పక్షాల నేతలతో మన్మోహన్‌సింగ్‌ను కలుస్తామని నాగిరెడ్డి తెలిపా రు. మిగులు జలాల కేటాయింపు సక్రమంగా లేదని, ఈ విషయాన్నే ప్రధాని దృష్టికి తీసుకువస్తామని జూలకంటి చెప్పారు. మిగులు జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టుల భవిష్యత్‌ను ఏమి చేస్తారనేదాన్ని ప్రశ్నిస్తామని గుండా మల్లేశ్ తెలిపారు.