ఢిల్లీ: కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కృష్ణా జలాల అంశంలో కేంద్రం వైఖరి ఏంటో చెప్పాలని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం కోరింది. అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ లోఖాళీగా ఉన్న సభ్యుల పోస్టులను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని సూచించింది.
కాగా తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ పై నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏపీకి కేటాయించిన నీటిలో వాటా తీసుకోవాలని సూచించింది. అయితే ట్రిబ్యునల్ లో తమకు మొదటి నుంచి అన్యాయం జరిగిందని తెలంగాణ సర్కార్ వాదనలు వినిపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ అవసరాలను పరిరక్షించలేదని ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది. కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని టీ సర్కార్ సుప్రీంను కోరింది.
మరో వైపు ఏపీ ప్రభుత్వం తమ వాదనలు సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పున:సమీక్షించాలని ఏపీ సర్కార్ అభ్యర్థించింది. కృష్ణా నీటి లభ్యత లెక్కింపులో సరైన విదానం పాటించలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 10 వతేదీకి వాయిదా వేసింది.