కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలి | We need to increase the allocation of the waters of the Krishna | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలి

Published Tue, Apr 18 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలి

కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలి

బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ను మరోమారు కోరిన రాష్ట్రం
► పోలవరం, పట్టిసీమల కింద ఏపీ గోదావరి నీటిని తరలిస్తున్నందున ఆ మేరకు కృష్ణాడెల్టాకు కోత పెట్టాలి
► పాలమూరు, డిండి, వాటర్‌ గ్రిడ్‌కు నీటి కేటాయింపులు చేయాలి


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల్లో తమకున్న నికర జలాల కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్‌లో రాష్ట్రానికి మొత్తంగా 599.90 టీఎంసీల మేర అవసరాలున్నాయని, ఇందులో రాష్ట్రానికి ఉన్న పరివాహకం, సాగు యోగ్యభూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభాను దృష్టిలో పెట్టుకొంటే ప్రస్తుతం లభ్యతగా ఉన్న 811 టీఎంసీల నికర జలాల్లో 574.6 టీఎంసీలు తెలంగాణకు దక్కాలని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో ఎగువ రాష్ట్రాలకు అదనపు వాటాలు దక్కుతాయన్న అంశాన్ని వివరిస్తూ, పెరిగే వాటాను రాష్ట్రానికి కేటాయించాలని కోరింది. పోలవరం, పట్టిసీమల కింద చేస్తున్న వినియోగం మేరకు ఏపీకి కృష్ణా డెల్టా కింద చేసిన కేటాయింపుల్లో కోత పెట్టాలని విన్నవించింది. ఇక ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవికావని, వాటికి అవసరాలకు అనుగు ణంగా నీటి కేటాయింపులు చేయాలని విన్న వించింది. ఈ మేరకు కృష్ణా జలాలపై విచా రణ చేస్తున్న బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు సోమవారం 67 పేజీలతో అఫిడవిట్‌ దాఖలు చేసింది. తెలంగాణకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

అఫిడవిట్‌లోని ప్రధానాంశాలివీ...
తెలంగాణకు కృష్ణా బేసిన్‌లో 68.5శాతం పరివాహకం ఉండగా కేటాయింపులు మాత్రం 36.9 శాతమే. అదే ఏపీకి 31.5 శాతం పరివాహకం ఉన్నా కేటాయింపులు మాత్రం 63.1శాతం ఉన్నాయి. ఇందులోనూ ఏపీకి కేటాయించిన 512 టీఎంసీల్లో 351 టీఎంసీలను ఏపీ బేసిన్‌ బయటే వాడుకుం టోంది. బేసిన్‌ పరివాహకంలో సాగు యోగ్య భూమి తెలంగాణలో 36.5 లక్షల హెక్టార్లు ఉండగా, ఏపీలో కేవలం 15.03 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. జనాభాపరంగా చూసినా కృష్ణా బేసిన్లో తెలంగాణలో 2 కోట్ల మంది (71.9శాతం) మంది ఉండగా, ఏపీలో కేవలం 78.29 లక్షలు (28.1శాతం) మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కలను పరిగణన లోకి తీసుకుంటే 811 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 574.6 టీఎంసీలు, ఏపీకి 236.4 టీఎంసీలు దక్కుతాయి.
రాష్ట్రంలో 299 టీఎంసీలకు ప్రాజెక్టులు నిర్మితమై ఉండగా, 225 టీఎంసీలకు ప్రాజె క్టులు నిర్మాణంలో ఉన్నాయి, మరో 36 టీఎంసీల వినియోగానికి ప్రాజెక్టులు చేపట్టా ల్సి ఉంది. ఇక తాగు నీరు, పరిశ్రమల నీటి అవసరాలకు కలిపి రాష్ట్రానికి మొత్తంగా 599.90 టీఎంసీల అవసరం ఉంటుంది.
1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి. ఈ లెక్కన 80 టీఎంసీల జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలి. ఇక ఏపీ పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలిస్తోంది. ఈ దృష్ట్యా పట్టిసీమ ద్వారా చేస్తున్న వినియోగం మేరకు కృష్ణా డెల్టాకు కోత పెట్టాలి.
బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకే అధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటి అవసరాలు తీరాకే బేసిన్‌అవతలి ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకోవాలి.
కృష్ణాలో 70 టీఎంసీల నీటిని వాడుకుంటూ చేపట్టనున్న పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టుపై సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయాలంటూ 2013 ఆగస్టులోనే అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా, అదే కృష్ణాలో 30 టీఎంసీల నీటిని వాడుకుంటూ డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టేందుకు 2007 జూలై7న అనుమతినిచ్చింది. వీటితోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, వాటర్‌గ్రిడ్‌లకు లభ్య త జలాలను కేటాయించి 7దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని సవరించాలి.
ఆర్డీఎస్‌ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5 నుంచి 6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. ఈ దృష్ట్యా ఇక్కడ లభ్యత జలాలు వచ్చేట్లు ఏపీ సహకరించేలా చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement