పాత వాటాలే.. | Krishna River Board Fixes Share Of Two Telugu States | Sakshi
Sakshi News home page

పాత వాటాలే..

Published Sat, Aug 10 2019 3:28 AM | Last Updated on Sat, Aug 10 2019 3:28 AM

Krishna River Board Fixes Share Of Two Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాలను పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నిర్ణయిం చాయి. ప్రస్తుత వాటర్‌ ఇయర్‌లో ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34:66 నిష్పత్తిన పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. ఇరు రాష్ట్రాల తక్షణ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎవరి అవసరాన్నిబట్టి వారు నీటి వినియోగం చేసుకోవచ్చని, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు తగ్గాక విని యోగ లెక్కలు చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశ మైంది.

ఇరు రాష్ట్రాల వాటా నిర్ణయం, నీటి పంపిణీ, కృష్ణా బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించడం, 2019–20 సంవత్సరానికి నీటి కేటాయింపులు, రెండో దశ టెలిమెట్రీ, బోర్డుల వర్కింగ్‌ మ్యాన్యువల్‌ తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించారు. కృష్ణా బోర్డు చైర్మన్‌ ఆర్‌కే గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సోమేశ్‌ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, సీఈ నరసింహారావు, నర్సింహ, డీసీఈ నరహరిబాబు, ఏపీ తరఫున ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావు, ఇతర అంతర్రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. 

ఏపీ జలవనరులశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఈ భేటీకి హాజరు కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో రాలేకపోయారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు గతంలో మాదిరే 34:66 నిష్పత్తిన ప్రాజెక్టుల్లోకి వచ్చే లభ్యత నీటిని వినియోగించుకోవాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించగా ఇందుకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. ఇదే సందర్భంగా బోర్డు వర్కింగ్‌ మ్యాన్యువల్‌కు ఆమోదం తెలపాలని, బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ఇంజనీర్లు కోరారు. అయితే ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని తెలంగాణ తోసిపుచ్చింది. దీనిపై ఏపీ మరోమారు స్పందిస్తూ సాగర్‌ కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని కోరింది.

తమ యాజమాయిషీలేని కారణంగా ఏటా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని దృష్టికి తెచ్చింది. దీనికి తెలంగాణ అంగీకరించలేదు. ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలు సీఎంల స్థాయిలో, అపెక్స్‌ కౌన్సిల్‌లో జరగాల్సిన నిర్ణయాలని, వాటిపై బోర్డు భేటీలో నిర్ణయం చేయలేమని తేల్చిచెప్పింది. దీనిపై మళ్లీ బోర్డు భేటీలో చర్చిద్దామని చైర్మన్‌ స్పష్టం చేశారు. ఇక ఎగువ కర్ణాటక ప్రాంతంలో గేజ్‌ స్టేషన్ల వద్ద నమోదవుతున్న కృష్ణా వరద ప్రవాహాలకు, జూరాలకు చేరిన అనంతరం నమోదవుతున్న కృష్ణా ప్రవాహాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని ఏపీ బోర్డు దృష్టికి తెచ్చింది. 2016–17లో ఈ తేడా 70 టీఎంసీలు, 2017–18లో 52 టీఎంసీలు, గతేడాది 51 టీఎంసీల మేర ఉందని తెలిపింది. దీనిపై ఓ కమిటీ వేసి తేల్చుదామని బోర్డు అభిప్రాయపడింది.

అవసరాన్నిబట్టి వాడకం..
ఆగస్టు నుంచి నవంబర్‌ వరకు శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల నుంచి 103 టీఎంసీలు కావాలని బోర్డును తెలంగాణ కోరగా సాగర్‌ కింది ఆయకట్టుకు 50 టీఎంసీలు, ఏఎంఆర్‌ఎస్‌ఎల్‌బీసీకి 20, హైదరాబాద్‌ తాగునీటికి 4, మిషన్‌ భగీరథకు మరో 4, కల్వకుర్తికి 25 టీఎంసీల కేటాయింపులు చేయాలని కోరింది. ఏపీ తన తక్షణ తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు కింద 23 టీఎంసీలు, సాగర్‌ కుడి కాల్వకు 10, హంద్రీనీవాకు 5 టీఎంసీల నీటి కేటాయింపులు కోరింది. దీనిపై బోర్డు సమావేశం అనంతరం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు సమావేశమై ఎవరి అవసరం మేరకు వారు వాడుకోవాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లోకి స్థిరంగా వరద వస్తున్నందున ఎవరి అవసరాలకు వారు నీటిని వాడుకొని ప్రవాహాలు తగ్గాక వాటాల మేరకు వాడకం జరిగిందా? లేదా చూసుకుందామనే నిర్ణయానికి వచ్చాయి. 

బోర్డు తరలింపు అక్కర్లేదు..
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న ప్రతిపాదనను ఏపీ మరోమారు ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని, దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ఏపీ ఇంజనీర్లు తెలిపారు. అయితే దీనికి తెలంగాణ అభ్యంతరం తెలిసింది. కృష్ణా బేసిన్‌లోని ఎక్కువ ప్రాజెక్టులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సహా పలు కార్యాలయాలు హైదరాబాద్‌ నుంచే నడుస్తున్నాయని బోర్డు దృష్టికి తెచ్చింది.

బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు వచ్చాకే అమరావతి ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. అయితే దీనిపై బోర్డు చైర్మన్‌ స్పందిస్తూ చట్టప్రకారం తాము నడుచుకోవాల్సి ఉందని, దీనిపై కేంద్రా జలశక్తిశాఖకు నివేదించి వారి సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. గోదావరి బోర్డు ఆర్‌కే జైన్‌ నేతృత్వంలో గోదావరి బోర్డు సమావేశం జరిగినా సమావేశం కేవలం నిధుల కూర్పు, ఇంజనీర్ల నియామకం వంటి అంశాలపైనే చర్చించింది. కొత్త ప్రాజెక్టులు, వర్కింగ్‌ మ్యాన్యువల్‌ వంటి అంశాలపై తర్వాత చర్చిద్దామని నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement