water sharing issue
-
Telangana: వాటాలు తేల్చుకుందాం!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై తాడోపేడో తేల్చుకునేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. సెప్టెంబర్ ఒకటిన జరిగే కృష్ణా బోర్డు పూర్తిస్థాయి భేటీలో వినిపించాల్సిన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. మరోవైపు అదేరోజున కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త భేటీకి హాజరయ్యేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక దఫాలుగా ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, న్యాయనిపుణులతో చర్చించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. బోర్డుల ముందు ఏఏ అంశాలను ప్రస్తావించి, ఎలాంటి వాదనలు విన్పించాలనే విషయమై అంశాల వారీగా మార్గదర్శనం చేశారు. ఆయన సూచనలు, సలహాల మేరకు ఇంజనీర్లు అన్ని నివేదికలు సిద్ధం చేశారు. ఇక సెప్టెంబర్ 2న ఢిల్లీకి వెళుతున్న ముఖ్యమంత్రి.. పలువురు కేంద్ర మంత్రులను కలిసి నదీ జలాల సంబంధిత అంశాలపై చర్చించాలని నిర్ణయించారు. వాటాలు పెంచుకోవడంపైనే దృష్టి రాష్ట్ర ప్రభుత్వం తొలినుంచి కృష్ణా నదీ జలాల్లో రాష్ట్రానికి పెరగాల్సిన వాటాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఈ నీటినే ఏపీ, తెలంగాణలు తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో వాడుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది నుంచి నీటి వాటాలను మార్చాలని తెలంగాణ గట్టిగా డిమాండ్ చేస్తోంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం ఉన్నా, నీటి వాటాలు మాత్రం మొత్తం కేటాయింపుల్లో 35 శాతం మేర మాత్రమే ఉన్నాయని.. పరీవాహకాన్ని, ఆయకట్టును పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని, బోర్డును కోరుతోంది. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో మాత్రమే నీటి పంపకాలు జరగాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే మొత్తం 811 టీఎంసీల నికర జలాల కేటాయింపుల్లో సగం వాటా అంటే 405.5 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపేదాకా వినియోగించుకోవాలని సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో నిర్ణయించారు. బుధవారం జరిగే కృష్ణా పూర్తి స్థాయి భేటీలోనూ ఈ మేరకు బలంగా వాదనలు వినిపించాలని, అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ తరలించే 80 టీఎంసీల గోదావరి నీటితో, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కే 45 టీఎంసీల వాటాను ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ రాబట్టుకునేలా వ్యూహరచన చేశారు. దీనికి తోడు క్యారీఓవర్ నీటిపై ఏపీ చేస్తున్న వాదనను తిప్పికొట్టేందుకు, తాగునీటి కేటాయింపులో 20 శాతం వినియోగమే లెక్కలోకి తీసుకునేలా రాష్ట్ర వాదనను బలంగా వినిపించేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఏపీ అక్రమంగా చేపడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవడం లక్ష్యంగా నివేదికలు రూపొందించారు. గెజిట్‌పై చర్చకు రెడీ కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి గెజిట్ నోటి ఫికేషన్ అమలుకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ, అత్యవసర సమావేశాలకు ఇప్పటివరకు దూరంగా ఉన్న తెలంగాణ.. ఈసారి వైఖరి మార్చుకుంది. వచ్చేనెల 1వ తేదీన జరిగే సంయుక్త భేటీకి హాజరవ్వాలని నిర్ణయించింది. గెజిట్‌లోని అభ్యం తరకర అంశాలను సమావేశం దృష్టికి తీసుకురావడంతో పాటు ఇతర విషయాల్లో తామందించబో యే సహకారాన్ని వివరించనుంది. రాష్ట్రంలో అను మతి లేని ప్రాజెక్టులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మూడ్రోజులు ఢిల్లీలో మకాం ఇలావుండగా సెప్టెంబర్ 2న ఢిల్లీకి వెళుతున్న సీఎం.. మూడ్రోజుల పాటు అక్కడే ఉండనున్నట్టు సమాచారం. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో పాటు ఇద్దరు, ముగ్గురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. నదీజలాల వివాద చట్టం సెక్షన్–3 కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుతో కృష్ణా జలాల పునఃపంపిణీ చేసే అంశంపై షెకావత్‌కు విన్నవించే అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్రం కోరుతున్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ఆయా ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి అనుమతులు త్వరగా ఇవ్వాల్సిందిగా ఆయన కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గెజిట్‌లోని అభ్యంతరకర అంశాలపై స్పష్టత కోరనున్నట్లు తెలిపాయి. -
పాత వాటాలే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉండే జలాలను పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నిర్ణయిం చాయి. ప్రస్తుత వాటర్ ఇయర్లో ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34:66 నిష్పత్తిన పంచుకోవాలనే ఒప్పందానికి వచ్చాయి. ఇరు రాష్ట్రాల తక్షణ తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా ఎవరి అవసరాన్నిబట్టి వారు నీటి వినియోగం చేసుకోవచ్చని, ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహాలు తగ్గాక విని యోగ లెక్కలు చూసుకుందామనే అభిప్రాయానికి వచ్చాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశ మైంది. ఇరు రాష్ట్రాల వాటా నిర్ణయం, నీటి పంపిణీ, కృష్ణా బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించడం, 2019–20 సంవత్సరానికి నీటి కేటాయింపులు, రెండో దశ టెలిమెట్రీ, బోర్డుల వర్కింగ్ మ్యాన్యువల్ తదితర అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించారు. కృష్ణా బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈ నరసింహారావు, నర్సింహ, డీసీఈ నరహరిబాబు, ఏపీ తరఫున ఈఎన్సీ వెంకటేశ్వర్రావు, ఇతర అంతర్రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. ఏపీ జలవనరులశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఈ భేటీకి హాజరు కావాల్సి ఉన్నా వివిధ కారణాలతో రాలేకపోయారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాలు గతంలో మాదిరే 34:66 నిష్పత్తిన ప్రాజెక్టుల్లోకి వచ్చే లభ్యత నీటిని వినియోగించుకోవాలని బోర్డు ఇరు రాష్ట్రాలకు సూచించగా ఇందుకు తెలంగాణ, ఏపీ సమ్మతించాయి. ఇదే సందర్భంగా బోర్డు వర్కింగ్ మ్యాన్యువల్‌కు ఆమోదం తెలపాలని, బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ ఇంజనీర్లు కోరారు. అయితే ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు లేకుండా నియంత్రణ అక్కర్లేదని తెలంగాణ తోసిపుచ్చింది. దీనిపై ఏపీ మరోమారు స్పందిస్తూ సాగర్ కుడి కాల్వ నిర్వహణను తమకు అప్పగించాలని కోరింది. తమ యాజమాయిషీలేని కారణంగా ఏటా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతోందని దృష్టికి తెచ్చింది. దీనికి తెలంగాణ అంగీకరించలేదు. ప్రాజెక్టుల నియంత్రణ, నిర్వహణ వంటి అంశాలు సీఎంల స్థాయిలో, అపెక్స్ కౌన్సిల్లో జరగాల్సిన నిర్ణయాలని, వాటిపై బోర్డు భేటీలో నిర్ణయం చేయలేమని తేల్చిచెప్పింది. దీనిపై మళ్లీ బోర్డు భేటీలో చర్చిద్దామని చైర్మన్ స్పష్టం చేశారు. ఇక ఎగువ కర్ణాటక ప్రాంతంలో గేజ్ స్టేషన్ల వద్ద నమోదవుతున్న కృష్ణా వరద ప్రవాహాలకు, జూరాలకు చేరిన అనంతరం నమోదవుతున్న కృష్ణా ప్రవాహాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందని ఏపీ బోర్డు దృష్టికి తెచ్చింది. 2016–17లో ఈ తేడా 70 టీఎంసీలు, 2017–18లో 52 టీఎంసీలు, గతేడాది 51 టీఎంసీల మేర ఉందని తెలిపింది. దీనిపై ఓ కమిటీ వేసి తేల్చుదామని బోర్డు అభిప్రాయపడింది. అవసరాన్నిబట్టి వాడకం.. ఆగస్టు నుంచి నవంబర్ వరకు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల నుంచి 103 టీఎంసీలు కావాలని బోర్డును తెలంగాణ కోరగా సాగర్ కింది ఆయకట్టుకు 50 టీఎంసీలు, ఏఎంఆర్ఎస్ఎల్బీసీకి 20, హైదరాబాద్ తాగునీటికి 4, మిషన్ భగీరథకు మరో 4, కల్వకుర్తికి 25 టీఎంసీల కేటాయింపులు చేయాలని కోరింది. ఏపీ తన తక్షణ తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు కింద 23 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వకు 10, హంద్రీనీవాకు 5 టీఎంసీల నీటి కేటాయింపులు కోరింది. దీనిపై బోర్డు సమావేశం అనంతరం బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం నేతృత్వంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు సమావేశమై ఎవరి అవసరం మేరకు వారు వాడుకోవాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లోకి స్థిరంగా వరద వస్తున్నందున ఎవరి అవసరాలకు వారు నీటిని వాడుకొని ప్రవాహాలు తగ్గాక వాటాల మేరకు వాడకం జరిగిందా? లేదా చూసుకుందామనే నిర్ణయానికి వచ్చాయి. బోర్డు తరలింపు అక్కర్లేదు.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలన్న ప్రతిపాదనను ఏపీ మరోమారు ప్రస్తావించింది. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం బోర్డు కార్యాలయాన్ని అమరావతికి తరలించాలని, దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని ఏపీ ఇంజనీర్లు తెలిపారు. అయితే దీనికి తెలంగాణ అభ్యంతరం తెలిసింది. కృష్ణా బేసిన్‌లోని ఎక్కువ ప్రాజెక్టులు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సహా పలు కార్యాలయాలు హైదరాబాద్ నుంచే నడుస్తున్నాయని బోర్డు దృష్టికి తెచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చాకే అమరావతి ప్రతిపాదనను పరిశీలించాలని కోరింది. అయితే దీనిపై బోర్డు చైర్మన్ స్పందిస్తూ చట్టప్రకారం తాము నడుచుకోవాల్సి ఉందని, దీనిపై కేంద్రా జలశక్తిశాఖకు నివేదించి వారి సూచనల మేరకు నడుచుకుంటామని తెలిపారు. గోదావరి బోర్డు ఆర్కే జైన్ నేతృత్వంలో గోదావరి బోర్డు సమావేశం జరిగినా సమావేశం కేవలం నిధుల కూర్పు, ఇంజనీర్ల నియామకం వంటి అంశాలపైనే చర్చించింది. కొత్త ప్రాజెక్టులు, వర్కింగ్ మ్యాన్యువల్ వంటి అంశాలపై తర్వాత చర్చిద్దామని నిర్ణయించింది. -
‘కావేరి’ ప్రణాళికను ఆపలేం
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళిక ఆమోదాన్ని వాయిదా వేయాలన్న కర్ణాటక అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రణాళికను తయారుచేయాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఆదేశించామనీ, రాష్ట్రాలకు ఈ విషయంతో సంబంధం లేదని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశానుసారం కావేరి జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ధర్మాసనానికి సమర్పించింది. దీనిపై కర్ణాటక తరఫు న్యాయవాది దివాన్ తన వాదనలు వినిపిస్తూ ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. రాబోయే 15 ఏళ్ల వరకు ఈ నీటి పంపకాలు అమల్లో ఉంటాయి. కాబట్టి కొత్త ప్రభుత్వ సూచనలను నివేదించేందుకు జూలై తొలివారం వరకు సమయం అవసరం. అప్పటివరకు ముసాయిదాను ఆమోదించకండి’ అని ధర్మాసనాన్ని కోరారు. తమిళనాడు న్యాయవాది శేఖర్ కర్ణాటక అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై వరకు ఆగితే జూన్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల సంగతేమిటని ప్రశ్నించారు. కోర్టు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాలకు ఈ అంశంలో పాత్ర లేదనీ, ఫిబ్రవరి 16 నాటి తీర్పు ప్రకారం ప్రణాళికను కేంద్రం రూపొందిస్తే తాము ఆమోదిస్తామంది. కేంద్రానికి ఆ అధికారం వద్దు: భవిష్యత్తులో అవసరమైనప్పుడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వాటాను మార్చే అధికారాన్ని తనవద్దే పెట్టుకుంటూ కేంద్రం ఈ ముసాయిదాను తయారుచేసింది. దీనిపై తమిళనాడు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ నిబంధనను మార్చాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
-
కావేరీ ముగిసింది మహానది ముంచుకొస్తోంది!
న్యూఢిల్లీ : కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య హింసాత్మక వాతావరణం సృష్టించిన కావేరి నదీ జలవివాదం ఇలా సద్దుమణిందో లేదో మరో నదీ వివాదం ముంచుకొస్తోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య మహానది జలాల పంపకంపై వివాదం కేంద్రం చెంతకు చేరింది. కావేరి వివాదం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్రప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో, మహానది జలాల పంపకంపై కేంద్రం ముందుగానే స్పందించింది. ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, రమణ్ సింగ్‌లతో కేంద్రం నేడు సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. తమ రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా చత్తీస్‌గఢ్ ప్రభుత్వం మహానదిపై ఏడు నుంచి ఎనిమిది బ్యారేజీలు నిర్మించిందని ఒడిశా ఆరోపిస్తోంది. అదేవిధంగా అవసరమైన దానికంటే ఎక్కువ నీళ్లను ఒడిశా వాడుకుంటుందని చత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరోవైపు నుంచి విమర్శలు గుప్పిస్తోంది. నది ప్రవాహాన్ని అడ్డుకోవడానికేమీ ఈ బ్యారేజీలను నియమించడం లేదని రమణ్ సింగ్ వాదిస్తున్నారు. నది జలాల పంపక వివాదంపై ఓ ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని ఒడిశా ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, ఈ వివాదాన్ని నేషనల్ ఇంటరెస్ట్ కింద పరిగణలోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని ఒడిశా ప్రభుత్వం కోరుతోంది.