
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళిక ఆమోదాన్ని వాయిదా వేయాలన్న కర్ణాటక అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రణాళికను తయారుచేయాల్సిందిగా తాము కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఆదేశించామనీ, రాష్ట్రాలకు ఈ విషయంతో సంబంధం లేదని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశానుసారం కావేరి జలాల పంపిణీ ముసాయిదా ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ధర్మాసనానికి సమర్పించింది. దీనిపై కర్ణాటక తరఫు న్యాయవాది దివాన్ తన వాదనలు వినిపిస్తూ ‘ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. రాబోయే 15 ఏళ్ల వరకు ఈ నీటి పంపకాలు అమల్లో ఉంటాయి. కాబట్టి కొత్త ప్రభుత్వ సూచనలను నివేదించేందుకు జూలై తొలివారం వరకు సమయం అవసరం. అప్పటివరకు ముసాయిదాను ఆమోదించకండి’ అని ధర్మాసనాన్ని కోరారు. తమిళనాడు న్యాయవాది శేఖర్ కర్ణాటక అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జూలై వరకు ఆగితే జూన్‌లో తమ రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల సంగతేమిటని ప్రశ్నించారు. కోర్టు జోక్యం చేసుకుంటూ రాష్ట్రాలకు ఈ అంశంలో పాత్ర లేదనీ, ఫిబ్రవరి 16 నాటి తీర్పు ప్రకారం ప్రణాళికను కేంద్రం రూపొందిస్తే తాము ఆమోదిస్తామంది.
కేంద్రానికి ఆ అధికారం వద్దు: భవిష్యత్తులో అవసరమైనప్పుడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వాటాను మార్చే అధికారాన్ని తనవద్దే పెట్టుకుంటూ కేంద్రం ఈ ముసాయిదాను తయారుచేసింది. దీనిపై తమిళనాడు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ నిబంధనను మార్చాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.