న్యూఢిల్లీ: మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో సుప్రీంకోర్టు కార్యకలాపాలు సరైన దిశలో సాగలేదని మాజీ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే నలుగురు జడ్జీలు జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. శుక్రవారం పదవీ విరమణ పొందిన ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు. ‘కోర్టు పనితీరుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని జస్టిస్ మిశ్రా దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే ఇక ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదని నిర్ణయించుకునే మీడియా సమావేశం నిర్వహించాం’ అని ఆయన వెల్లడించారు. అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించంగా..క్రమంగా మార్పు వస్తోందని తెలిపారు. అత్యున్నత న్యాయ వ్యవస్థపై వచ్చిన అవినీతి అరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment