కురియన్ జోసెఫ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై రిటైర్డ్ జస్టిస్ కురియన్ జోసెఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి సీజేఐ జస్టిస్ మిశ్రా బాహ్య శక్తుల ఒత్తిడికి లోబడి పనిచేశారని, దీని ప్రభావం న్యాయవ్యవస్థ పరిపాలనపై పడిందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అప్పటి సీజేఐ కొన్ని బాహ్య శక్తుల ప్రభావానికి లోబడి పనిచేశారు. ఆయన రిమోట్ కంట్రోల్ నియంత్రణలో ఉన్నారు’ అని పేర్కొన్నారు.
అయితే, ఆ వెలుపలి శక్తి రాజకీయ పార్టీనా లేక ప్రభుత్వమా అనే విషయం వివరించేందుకు, ఏఏ కేసుల కేటాయింపులో సీజేఐ ఏకపక్షంగా వ్యవహరించారో తెలిపేందుకు ఆయన నిరాకరించారు. దీనిపై ఆధారాలున్నాయా అని ప్రశ్నించగా.. సుప్రీంకోర్టులోని అందరు జడ్జీలు ఇదే నమ్మకంతో ఉన్నారని జస్టిస్ కురియన్ బదులిచ్చారు. సీజేఐ జస్టిస్ మిశ్రా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారన్న విషయం స్పష్టమయ్యాకే తాము మీడియా సమావేశం ఏర్పాటు చేశామన్నారు.
జడ్జి బీహెచ్ లోయా మృతి వంటి కీలక కేసు కేటాయింపు కూడా అసంతృప్తికి కారణమా అని ప్రశ్నించగా ఫలానా విషయమంటూ ప్రత్యేకంగా చెప్పలేనన్నారు. కేసుల కేటాయింపుతోపాటు సుప్రీంకోర్టు పరిపాలన సంబంధిత అంశాలు కారణమని వివరించారు. కీలకమైన సొహ్రబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారిస్తున్న జడ్జి బీహెచ్ లోయా 2014లో నాగపూర్‌లో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా నిందితుడిగా ఉన్నారు. జడ్జి బీహెచ్ లోయా మృతిపై తిరిగి దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఆయనది సహజ మరణమేనని స్పష్టం చేసింది. జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు పనితీరు మెరుగైందనీ, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై నమ్మకం ఏర్పడిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment